సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మున్సిపల్ ఎన్నికల బరిలో కీలకఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన మంగళవారం వివిధ పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున తమ నామినేషన్లు ఉపసహరించుకున్నారు. దీంతో జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో ఈనెల 30న 97 వార్డులకు జరగనున్న ఎన్నికల్లో మొత్తం 525 మంది బరిలో మిగిలారు. ఇల్లెందులో 24 వార్డులకు గాను 175 మంది, కొత్తగూడెంలో 33 వార్డులకు గాను 190 మంది, సత్తుపల్లిలో 20 వార్డులకు గాను 74 మంది, మధిరలో 20 వార్డులకు 86 మంది పోటీలో నిలిచారు.
ఈ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీ-సీపీఎం, కాంగ్రెస్-సీపీఐలు పొత్తు కుదుర్చుకోగా టీడీపీ స్వతంత్రంగానే బరిలో ఉంది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ ఒంటరిపోరు చేస్తుండగా, సీపీఐ-టీఆర్‌ఎస్‌లు అవగాహనకు వచ్చాయి. మొత్తంమీద నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం చాలా వార్డుల్లో త్రిముఖ పోటీ నెలకొంది. కొన్ని చోట్ల వివిధ పార్టీల రెబల్ అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా బరిలో ఉండడంతో బహుముఖ పోటీ కూడా నెలకొంది. రెబల్స్‌కు సంబంధించి అధికార పార్టీలో ఎక్కువ మంది బరిలో ఉన్నారు. ఒక్క ఇల్లెందు మున్సిపాలిటీలోనే ఆ పార్టీ తరఫున 34 మంది రెబల్స్ బరిలో ఉన్నారని లెక్కలు చెపుతున్నాయి. మిగిలిన పార్టీలకు కూడా అక్కడక్కడా తిరుగుబాటు తలనొప్పి మిగిలింది.
‘బరి’ గీశారిలా....
నామినేషన్ల ఉపసంహరణ విషయానికి వస్తే కొత్తగూడెంలో అత్యధికంగా 105 మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇక్కడ మొత్తం 309 నామినేషన్లు దాఖలైతే14 తిరస్కరణకు గురికాగా, ఉపసంహ రణలు పోను 190 మంది బరిలో ఉన్నారు. ఇల్లెందులో 255 మంది నామినేషన్లు దాఖలు చేయగా, తొమ్మిది తిరస్కరించారు. 71 మంది ఉపసంహరించుకుంటే 175 మంది బరిలో ఉన్నారు. మధిరలో 115 నామినేషన్లలో ఏడు తిరస్కరణకు గురయ్యాయి.
22 మంది ఉపసంహరించుకోగా 86 మంది పోటీలో ఉన్నారు. సత్తుపల్లి విషయానికొస్తే మొత్తం 109 నామినేషన్లు దాఖలయ్యాయి. 35 మంది ఉపసంహరించుకుంటే 74 మంది బరిలో నిలిచారు. ఇక్కడ ఒక్క నామినేషన్‌ను కూడా తిరస్కరించలేదు. ఇక తమ పార్టీల తరఫున రంగంలో దిగిన రెబల్స్‌ను బుజ్జగించేందుకు రాజకీయ పార్టీలు నానా తంటాలు పడ్డాయి. ఉపసంహరణలకు చివరిరోజు కావడంతో మంగళవారమంతా అన్ని పార్టీల నేతలు తమ అభ్యర్థులను బతిమిలాడే పనిలో బిజీగా గడిపారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు అనేక ఆర్థిక, రాజకీయ ఆఫర్లను కూడా ఇచ్చి తాత్కాలికంగా గండం నుంచి గట్టెక్కారు.
మున్సిపల్ బరిలో 525 మంది
Published Wed, Mar 19 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
Advertisement