ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణలో రూ.లక్షలు చేతులు మారాయి. జెడ్పీ ఆవరణలో సోమవారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగిన ఈ ప్రక్రియలో.. భారీ మొత్తంలో ఒప్పందం చేసుకుని కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జెడ్పీటీసీ నామినేషన్ ఉపసంహరణకు పలువురు అభ్యర్థులు రూ.5 వేల నుంచి రూ. 2 లక్షల వరకు డిమాండ్ చేశారు. చివరకు ఆయా పార్టీల నేతలు సైతం రెబల్ అభ్యర్థులను ఉపసంహరింపజేయడానికి నానా అవస్థలు పడ్డారు. తాము విజయం సాధిస్తే తమ పరిధిలోని క్రాంటాక్ట్ పనులు కూడా ఇప్పిస్తామని బరిలో నిలిచే అభ్యర్థులు రెబల్స్‌తో ఒప్పందాలు చేసుకున్నారు.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఎంపీటీసీ స్థానానికి గ్రామ పెద్దలు రూ.12 లక్షలకు వేలం వేసినట్లు పలువురు పేర్కొంటున్నారు. ఈ నిధులను గ్రామాభివృద్ది కోసం వినియోగించాలని షరతు విధించారనే ప్రచారం సాగుతోంది. జెడ్పీ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు పాట్లు పడుతున్నారు. రెబల్ అభ్యర్థులను బరిలోనుంచి తప్పించేందుకు డబ్బు వెదలజ్లేందుకైనా వెనకాడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్ల, పినపాక, వేంసూరు, వెంకటాపురం, ఏన్కూర్, కొత్తగూడెం, భద్రాచలం మండలాల్లో కాంగ్రెస్, టీడీపీ రెబల్ అభ్యర్థులను బరిలో నుంచి ఉపసంహరించడానికి ఆయా పార్టీల నేతలు తలకిందులయ్యారు. చివరకు బేరసారాల నడుమ బరిలో నుంచి తప్పుకున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, మధిర, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల పరిధిలో ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి రెబల్ అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. వాటి ఉపసంహరణకు పెద్ద మొత్తంలో డిమాండ్ చేసినట్లు సమాచారం.
నేతలకు తలనొప్పి....
నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు ఆయా పార్టీల నాయకులు ఉరుకులు పరుగులు తీశారు. ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులు రెబల్స్ కోరినంత ముట్టజెప్పేందుకు వెనకాడలేదు. ఇలా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల పైగా డిమాండ్ చేసినవారు ఉన్నారు. ఖమ్మం పరిసర మండలంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని ఉపసంహరింపజేయడానికి ఆ పార్టీ నేతలకు చెమటలు పట్టాయి. రూ. లక్షల్లో డిమాండ్ చేసిన ఆ ఆభ్యర్థి ఏ నాయకుడు వారించినా వినలేదు. చివరకు తాను గెలిస్తే తన పరిధిలోని క్రాంటాక్ట్ పనులు ఇస్తానని అధికారిక అభ్యర్థి హామీ ఇవ్వడంతో పాటు నామినేషన్ ఖర్చులు రూ.5 వేలు చెల్లించాక రెబల్ అభ్యర్థి తప్పుకున్నాడు. ఇప్పటికే గ్రామ పంచాయతీ, సహకార ఎన్నికలు ముగియడంతో గ్రామ, మండల స్థాయి నాయకులకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే చివరి అవకాశం. దీంతో పోటీ నుంచి తప్పుకునేందుకు చాలామంది అంగీకరించలేదు. కొందరు మాత్రం నజరానాలు, నామినేటెడ్ పదవులు ఆశించి రంగం నుంచి తప్పుకున్నారు.
ఎన్నికల నజరానా....
Published Tue, Mar 25 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement