సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది.... ఓటు కోసం ప్రలోభాలకు తెరలేచింది. పోలింగ్‌కు మరో 24 గంటల సమయం మాత్రమే ఉండడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు ఈ రేయినే నమ్ముకుని.. ఓటుకు ఎర వేసే వ్యూహంలో మునిగారు. పోలింగ్ జరగనున్న కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల పరిధిలో 1,35,235 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు.
సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీల నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఈ ఎన్నికలు ఆయా స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపనుండడంతో అందరి దృష్టీ వీటి ఫలితాలపైనే ఉంది. మొత్తం 97 వార్డుల్లో 523 మంది బరిలో నిలవడంతో అన్నిచోట్ల పోటీ తీవ్రంగానే ఉంది. ప్రధానంగా కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో ఇక్కడ గెలుపును అభ్యర్థులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. విజయమే ధ్యేయంగా అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రచారంలో భారీగానే ఖర్చు చేశారు. నిన్నటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తయితే.. పోలింగ్ సమయానికి గడువున్న ఈ ఒక్కరోజే కీలకం. ఓటర్లను పలువిధాల ఆకర్షించడానికి ఈ రేయినే అభ్యర్థులు నమ్ముకున్నారు.
అంతటా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అభ్యర్థులు వార్డుల్లో తమకు నమ్మకంగా ఉన్న మహిళలను లీడర్లుగా ఎంపిక చేసి.. చీరెల పంపిణీ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రత్యర్థి కన్నా ఎంత ఎక్కువగా డబ్బులు పంచితే అంత తేలికగా గెలుపుసాధించవచ్చనే ధీమాలో అభ్యర్థులున్నారు. కొన్ని చోట్ల రాత్రికిరాత్రికే డబ్బు, మద్యం పంచడానికి ఇప్పటికే రహస్యంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంత ఖర్చు చేసినా ఈ రేయి ఏమిచేస్తుందోనని అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
కీలక ఓట్ల కోసం ఎంతైనా....
ఆయా మున్సిపాలిటీలలో చైర్మన్ అభ్యర్థిగా పార్టీల తరఫున ఇద్దరు,ముగ్గురు పేర్లు వినవడుతుండడంతో.. వీరంతా విజయం కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు వెనకాడడం లేదు. వారు పోటీ చేస్తున్న వార్డుల్లో కీలకమైన ఓట్లకు రూ.వెయ్యి నుంచి రూ.5 వేలు పంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వైస్ చైర్మన్ అభ్యర్థులు కూడా ఇదే బాట పట్టారు. ప్రధానంగా కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర పరిధిలో చైర్మన్ అభ్యర్థిత్వం కోసం పోటీపడే వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారంతా ప్రతి ఓటు స్కానింగ్ చేసి తమ ఖాతాలో పడేవి, పడనవి లెక్కేసుకున్నారు. పడని ఓట్ల కోసం రూ. వేలు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. చివరి అంచుకు వరకు వచ్చి ఓటమి పాలైతే చైర్మన్ గిరి దక్కదని భావించి భారీగానే ఖర్చు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు.
నేతలంతా పాగా..
మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న కేంద్రాల్లో జిల్లా నేతలు పార్టీల వారీగా మకాం వేశారు. పోలింగ్‌కు మరి కొద్ది గంటలే ఉండడంతో తెర వెనక రాజకీయాలకు సదరు నేతలు చక్రం తిప్పుతున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు, మధిర, సత్తుపల్లిలో స్థానిక ఎమ్మెల్యేలతో పాటు వారి అనుంగు అనుచరులు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. చైర్మన్ అభ్యర్థులున్న చోట వారి విజయం కోసం ఎడతెగని మంత్రాంగం సాగిస్తున్నారు.
ప్రచారానికి తెర..ప్రలోభాల ఎర
Published Sat, Mar 29 2014 3:05 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement
Advertisement