మరుసటిరోజే తేలనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీల భవితవ్యం
కరీంనగర్ కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. వచ్చే నెల 12వ తేదీన మున్సిపల్, 13వ తేదీన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దీంతో ఎప్పుడెప్పుడా అని ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఎన్నికల అనంతరమే ఫలితాలు వెల్లడించాల్సి ఉండగా సార్వత్రిక ఎన్నికలు అడ్డువచ్చాయి.
సార్వత్రిక ఎన్నికలపై వీటి ఫలితాల ప్రభావం పడుతుందని సుప్రీం కోర్టు సూచన మేరకు మే నెల 7వ తేదీ తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. ఫలితాలు వాయిదా పడడంతో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మున్సిపల్ ఎన్నికలు మార్చి 30వ తేదీన జరగగా, వాటి ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెల్లడించాల్సి ఉంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఏప్రిల్ 11వ తేదీన జరగగా వాటి ఫలితాలపై ముందే నిర్ణయం తీసుకున్నారు.
మూడు ఎన్నికలకు సంబంధించి మే నెల 7వ తేదీ తర్వాతనే ఫలితాలు వెల్లడిస్తామని ఈసీ ప్రకటించింది. అయితే ఖచ్చితమైన ప్రకటన వెలువడకపోవడంతో సాధారణ ఎన్నికల ఫలితాల వెల్లడయ్యాకే ఈ మూడు ఎన్నికల ఫలితాలు వెలువరిస్తారని భావించారు. ఈసీ కూడా మున్సిపల్ చైర్మన్, నగర మేయర్, జిల్లా, మండల పరిషత్ చైర్మన్ల ఎంపిక కోసం న్యాయ సలహాను కూడా కోరింది.
శాసనసభ కొలువుదీరక ముందు చైర్మన్లు, మేయర్ల ఎంపిక చేయవచ్చా లేదా అనే సందిగ్ధంలో పడింది. శాసనసభ కొలువుదీరాకే ఫలితాలు వెల్లడవుతాయనే వాదనలు వినిపించాయి. సంప్రదింపుల అనంతరం ఈసీ ఎన్నికల ఫలితాలు వెల్లడించేందుకు నిర్ణయం తీసుకుంది.