సాక్షి, ఖమ్మం: ఈ సార్వత్రిక ఎన్నికలలో ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో వీరు ఎటు మొగ్గు చూపితే అటు విజయం తధ్యమన్న భావనలో రాజకీయ పార్టీలున్నాయి. ముఖ్యంగా ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల పరిధిలో ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే ఓట్లు పెరగడంతో అన్ని పార్టీలు వీరిని ఆకట్టుకునే ప్రయత్నాలలో ఉన్నాయి. కాగా, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ముస్లింలకు లబ్ధి చేకూరిన అంశం
ఎన్నికల సమయంలో చర్చకు వస్తోంది.
జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో మొత్తం 19,71,797 మంది ఓటర్లున్నారు. ఇందులో అన్ని నియోజకవర్గాల్లో కలిపి 1,51,848 మంది ముస్లిం ఓటర్లున్నారు. గతంతో పోలిస్తే అన్ని నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య పెరిగింది. అయితే, ప్రధానంగాఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, ఇల్లెందులో వీరి ఓట్లు ప్రస్తుత ఎన్నికల్లో కీలకంగా మారుతున్నాయి. ఖమ్మంలో 39,700, కొత్తగూడెంలో 17,708, సత్తుపల్లిలో 16,000, ఇల్లెందులో 16,500 ఓట్లు ఉండగా....గెలుపుఓటములను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఖమ్మం, ఇల్లెందులో ముస్లింలు ఎటు మొగ్గుచూపితే అటు విజయం తధ్యమని పార్టీల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి ఓట్లను రాబట్టేందుకు అన్ని పార్టీల అనుబంధ సంఘాల్లో ఈ కేటగిరికి చెందిన వారికే బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఖమ్మం నియోకజవర్గంలో అత్యధికంగా ఓట్లు ఉండడంతో అన్ని పార్టీలకు ఇక్కడ విజయం అన్నది ముస్లిం ఓట్లపైనే ఆధారపడి ఉంటుంది. గత ఎన్నికలను బేరీజు వేసుకొని నాయకులు వీరి ఓట్లకు గాలం వేసేలా మరిన్ని సంక్షేమ పథకాలకు హామీలిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముస్లిం కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు పెద్ద చదువులు చదువుకోవడానికి ఆసరానిచ్చాయి. ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకారవేతనాలు, రుణాల మాఫీ, ముఖ్యంగా 4 శాతం రిజర్వేషన్ వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లింది.
రూ. 3.38 కోట్ల రుణ మాఫీ..
2004 ముందు అల్పసంఖ్యాక వర్గాలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి పెద్ద మనసుతో వారి సంక్షేమానికి పెద్దపీట వేసి.. ముస్లింల మనసులో చిరస్థాయిగా నిలిచారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జిల్లాలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 1999 నుంచి 2004వరకు 8,768 మంది రూ. 3.38 కోట్ల రుణాలు తీసుకున్నారు. అయితే ఈ రుణాలను చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. వైఎస్ అధికారంలోకి రాగానే జిల్లా వ్యాప్తంగా ముస్లింలు తీసుకున్న ఈ రుణం అంతా మాఫీ చేశారు. అలాగే 2006-2009 మధ్య కాలంలో జిల్లాలో 602 మందికి రూ. 98.65 లక్షలు రుణాలు అందజేశారు. ఓవైపు రుణ మాఫీ కావడం, మారోవైపు ఆయన ఉన్న కాలంలో ఆర్థికంగా చేయూతనివ్వడంతో ముస్లిం కుటుంబాల్లో ఆత్మస్థైర్యం పెరిగింది.
రీయింబర్స్‌తో పెద్ద చదువులు..
తెలివి ఉన్నా.. ఆర్థిక స్తోమత లేక 2004కు ముందు ముస్లిం కుటుంబాల్లో ఉన్నత విద్య అందని ద్రాక్షగా ఉండేది. వైఎస్ అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వారిని ఉన్నత చదువుల బాట పట్టించింది. ఈ పథకంతో డిగ్రీ, పీజీ.., బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్, ఎల్‌ఎల్‌బీ వంటి వివిధ వృత్తివిద్య కోర్సులు అభ్యసించేందుకు పూర్తి ఫీజును చెల్లించారు. జిల్లాలో ఈ పథకం కింద 2008-09 నుంచి ఇప్పటివరకు 20,126మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులకు రూ. 16.60 కోట్లు చెల్లించారు. ఈ పథకంతో ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించేలా వైఎస్ భరోసా ఇచ్చారు. అలాగే 4 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రత్యేకంగా ముస్లింలను వైఎస్ అక్కున చేర్చుకున్నారు. ఈ రిజర్వేషన్‌తో జిల్లాలో విద్య, ఉద్యోగాల్లో వారికి అవకాశం దక్కింది.
పెద్దన్నలా సామూహిక వివాహాలు..
నిరుపేద ముస్లిం యువతి,యువకులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి పెద్దన్న అయ్యారు. ఆర్థికంగా స్తోమత లేనివారికి నిఖా (వివాహం) చేయించడానికి సామూహిక వివాహాల పథకానికి వైఎస్ రూపకల్పన చేశారు. ఒక్కో జంటకు రూ.1500, వస్తు సామగ్రి అందజేయించి నిఖా చేసి పెద్దన్నలా వారి హృదయాల్లో నిలిచారు వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ హయాంలో జిల్లాలో వందలాది సామూహిక వివాహాలు జరిగాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఈ పథకంపై శీతకన్ను వేసింది. దరిమిలా సామూహిక వివాహాల సంఖ్య రానురాను తగ్గింది. గత ప్రభుత్వ హయాంలో కేవలం 34 వివాహాలు మాత్రమే జరిగాయి.
కిరణ్ ప్రభుత్వంలో రుణ మంజూరుకు కొర్రీలు..
వైఎస్ మరణం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రుణ మంజూరుకు అనేక కొర్రీలు పెట్టారు. వైఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వివిధ రుణాలు పొందాలంటే నిరుద్యోగులకు 18-55 ఏళ్ల మధ్య వయసు ఉంటే రుణాలు పొందే అవకాశం ఉండేది. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి రాగానే వయసును కుందించారు. 21-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికే రుణాలు ఇచ్చేలా నిర్ణయించి .. నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు.
వైఎస్ హయాంలో ఉన్న తత్కాల్ పథకాన్నీ రద్దు చేశారు. ఈ పథకం ద్వారా వితంతు, వికలాంగులు, భర్త వదిలేసిన మహిళలు, అనాథలు, అగ్నిప్రమాద బాధితులు, జైలులో ఉంటున్న వారి భార్యలకు తక్షణ సహాయం కింద రూ.10 వేలు ఇచ్చేవారు. వైఎస్ మృతి తర్వాత ఈ పథకాన్ని రద్దు చేశారు. అదేవిధంగా ఒకసారి రుణం పొందిన వారి కుటుంబంలో 5 ఏళ్ల వరకు సదరు కుటుంబంలో ఎవ్వరికీ రుణం ఇచ్చే అవకాశం లేకుండా నిబంధన పెట్టారు. దీంతో అల్పసంఖ్యాకుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వైఎస్ మరణం తర్వాత జిల్లాలో సంక్షేమ పథకాల లబ్ధి అందక వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
రెండు నియోజకవర్గాల్లో ఎటు మొగ్గు చూపితే అటే విజయం
Published Fri, Mar 28 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 5:15 AM
Advertisement
Advertisement