కర్నూలు, సాక్షి /ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల వేళ ‘ప్రాదేశిక’ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకోవడం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికలు ఇప్పటికే పూర్తి కాగా కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఫలితాల సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక తొలి విడత స్థానిక పోరు కర్నూలు, నంద్యాల డివిజన్లలో పూర్తి కాగా.. 11న ఆదోని డివిజన్‌లో మలి విడత పోరుకు రంగం సిద్ధమైంది.
పచార పర్వం బుధవారం నాటికి ముగియనుండటంతో ప్రలోభాల పర్వం జోరందుకుంది. పల్లెల్లో పాగా వేస్తే.. సాధారణ ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం తేలికవుతుందనే ఉద్దేశంతో డబ్బులు ‘కట్ట’లు తెంచుకుంటుండగా.. మద్యం ఏరులై పారుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఫ్యాన్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కు రాజకీయానికి తెరలేపాయి. గ్రామ స్థాయి చోటా నాయకులకు ప్యాకేజీలతో ప్రలోభపెడుతున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి ఎదురులేకపోవడంతో టీడీపీ చెమటోడుస్తోంది.
పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులతో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటోంది. గోనెగండ్ల మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఇప్పటికే ఐదింటిని ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 16 స్థానాల్లో టీడీపీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ 8 స్థానాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని 21 ఎంపీటీసీ స్థానాల్లో రెండింట్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. నందవరం మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం సహకరించుకుంటున్నారు. అయితే ఒంటరి పోరు చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతుండటం విశేషం.
మంత్రాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ‘గాలి’
కర్ణాటక సరిహద్దులోని మంత్రాలయం నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి నేతృత్వంలో అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నాలుగు మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు తథ్యమని స్పష్టమవుతోంది. మండలంలో 18 ఎంపీటీసీ స్థానాల్లో ఐదింటిని వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. 13 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అన్నింటికీ పోటీ చేస్తుండగా.. టీడీపీ 10, కాంగ్రెస్ అభ్యర్థులు 3 చోట్ల బరిలో నిలిచారు. ఇక్కడ కూడా కాంగ్రెస్, టీడీపీ తెర చాటు రాజకీయం నెరుపుతున్నాయి.
కోసిగి మండలంలోని 20 ఎంపీటీసీ స్థానాల్లో ఒకటి వైఎస్‌ఆర్‌సీపీ ఖాతాలో చేరిపోగా.. 19 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొంది. కౌతాళం మండలంలోని 22 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంతకాలం టీడీపీ జెండా మోసిన నేతలపై ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ నేత పెత్తనం చెలాయిస్తుండటం ఆ పార్టీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న బీసీ నాయకుల్లో ఒకరిని రూ.కోటికి, మరొకరిని రూ.80 లక్షలతో కొనేసినట్లు సదరు నేత ప్రచారం చేస్తుండటం మంత్రాలయం టీడీపీలో కలకలం రేపుతోంది.
తీరం.. తూలుతోంది!
Published Wed, Apr 9 2014 2:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement