ఏన్కూరు/ జూలూరుపాడు, న్యూస్‌లైన్: ఓటు అడిగేహక్కు వైఎస్‌ఆర్‌సీపీకే ఉందని ఆ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఏన్కూరు మండలం నాచారంలోని శ్రీ అద్భుత వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మండలంలోని నాచారం, కాలనీనాచారం, గంగులనాచారం, రామాతండా, ఒంటిగుడిసె, భద్రుతండా, హిమామ్‌నగర్, రేపల్లెవాడ, ఏన్కూరు, ఇందిరానగర్, అంబేద్కర్‌నగర్, టీఎల్‌పేట, కోదండరాంపురం తదితర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
కల్లబొల్లి మాటలు చెప్పే పార్టీలను దగ్గరకు రానీయొద్దని కోరారు. రాజన్న పథకాలతో లబ్ధిపొందిన మనమంతా ఆయన ఆశయసాధన కోసం కృషి చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు. వైఎస్‌ఆర్ మరణానంతరం ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని జూలూరుపాడు, పాపకొల్లులో జరిగిన బహిరంగసభల్లో పొంగులేటి మాట్లాడారు. ప్రజాభిమానం ముందు ఎంతటి వారైనా తలవంచకతప్పదన్నారు. సీపీఎం పొత్తుతో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలు, జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ బరిలో ఉందని, మిగిలిన మూడు అసెంబ్లీ స్థానాల్లో సీపీఎం పోటీచేస్తోందని వివరించారు. ఫ్యాన్‌గుర్తుపై ఓటేసి వైఎస్‌ఆర్‌సీపీ, సుత్తికొడవలి నక్షత్రంపై ఓటేసి సీపీఎం అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరారు.
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా..
జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. జూలూరుపాడు మండలంలోని పాపకొల్లు పాంతంలో నిరుపయోగంగా ఉన్న కాకతీయుల కాలంనాటి పొలారం చెర్వు, కురుపోళ్లవాగు ప్రాజెక్టును నిర్మిస్తామన్నారు. పాపకొల్లు నుంచి పుల్లుడతండా వరకు రోడ్డు నిర్మిస్తామన్నారు. భూపంపిణీ, పోడు భూములకు పట్టాలిచ్చి పేదలసంక్షేమానికి కృషి చేసిన ఘనత దివంగత వైఎస్‌ఆర్‌దేనని వైరా అసెంబ్లీ స్థానం అభ్యర్థి బాణోత్ మదన్‌లాల్ అన్నారు. జూలూరుపాడు సాయిబాబా మందిరం ప్రధాన రహదారిపై ప్రారంభమైన ప్రచార ర్యాలీ పాపకొల్లు వరకు సాగింది. అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మార్గంమధ్యలో మిరప కోతల్లో ఉన్న కూలీల దగ్గరకు వెళ్లి పొంగులేటి, మదన్‌లాల్ వారితో ముచ్చటించారు. వృద్ధులను ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నారు. వారి సమస్యలను ఓపికగా విన్నారు.
అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ జూలూరుపాడు, ఏన్కూరు మండల కన్వీనర్‌లు పొన్నెకంటి వీరభద్రం, ముక్తి వెంకటేశ్వర్లు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పూర్ణకంటి నాగేశ్వరరావు, నల్లమల శివకుమార్, జిల్లా రైతు విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యుడు దారావతు నాగేశ్వరరావు, జిల్లా నాయకులు గుమ్మా రోశయ్య, కొలిపాక బాబూరావు, నాయకులు ఆంగోతు కృష్ణారావు, కాళ్లూరి ప్రవీణ్, తాళ్లూరి లక్ష్మయ్య, భూక్యా సక్రునాయక్, గుమ్మా రోశయ్య, తంబళ్ల రవి, కట్టా సత్యనారాయణ పాల్గొన్నారు.
ఓటు అడిగే హక్కు వైఎస్‌ఆర్‌సీపీకే ఉంది..
Published Sun, Apr 13 2014 3:57 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement