అందరి చూపు.. ఖమ్మం వైపు
* జిల్లాలో ఎవరు గెలుస్తారన్న దానిపై చర్చ
* ప్రతిష్టాత్మకంగా పార్లమెంటు స్థానం
* పొంగులేటి, నామా, నారాయణ నడుమ ఆసక్తికర పోరు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో తెలంగాణలో అందరి దృష్టి ఖమ్మం జిల్లా వైపు పడుతోంది. రాజకీయంగా చైతన్యం ఉన్న జిల్లా ఓటరు ఏం చేస్తాడో? తెలంగాణ గుమ్మం ఖమ్మంలో ఏ పార్టీ ప్రభంజనం ఉంటుందో అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణలోనే వైఎస్సార్‌సీపీ ఈ జిల్లాలో బలంగా ఉండడం, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రచారం జరుగుతున్న టీఆర్‌ఎస్‌కు ఇక్కడ పెద్దగా బలం లేకపోవడం, అధికార కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్టులు ప్రబలంగానే ఉండడంతో ఈ జిల్లా ఫలితం ఎలా ఉంటుందోనన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ జిల్లాలో ఓటరు దేవుడు ఎలాంటి తీర్పునిస్తాడోనన్న దానిపై జోరుగా బెట్టింగ్‌సాగుతుండడం గమనార్హం.
బలీయ శక్తిగా ఉన్న వైఎస్సార్‌సీపీ
ఖమ్మం జిల్లాలో మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పార్టీకి కేడర్ ఉంది. దీంతో పాటు సర్పంచ్ ఎన్నికల నుంచి తాజాగా వెలువడిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల వరకు తెలంగాణలోనే వైఎస్సార్‌సీపీ ఎక్కువ స్థానాలను ఈ జిల్లాలో గెలుచుకుంది. దీంతో వైఎస్సార్‌సీపీ మంచి ఫలితాలు సాధిస్తుందనే అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ కూడా జిల్లాలో బలంగానే ఉన్నాయి. అయితే, కాంగ్రెస్‌ను నడిపించే సమర్థ నాయకుడు లేకపోవడం, టీడీపీలో గ్రూపు తగాదాలు ఆయా పార్టీల విజయావకాశాలను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులంటున్నారు. ఇక కమ్యూనిస్టు పార్టీలకు మంచి పట్టు ఉన్న ఖమ్మంలో సీపీఐ కాంగ్రెస్‌తో, సీపీఎం వైఎస్సార్‌సీపీతో కలిసి పోటీచేశాయి.
వైఎస్సార్‌సీపీ, సీపీఎం మధ్య ఎన్నికల అవగాహన కూడా బాగానే కుదిరింది. మరోవైపు ఖమ్మం ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉన్న సీపీఐకు కాంగ్రెస్ సరిగా సహకరించలేదనే ప్రచారం కూడా జరిగింది. ఈ పార్టీల పరిస్థితి ఉంటే తెలంగాణలో మిగిలిన చోట్ల గట్టిపోటీ ఇస్తున్న టీఆర్‌ఎస్‌కు ఈ జిల్లాలో సంస్థాగతంగా బలం లేదని సర్పంచ్, మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పార్టీ నుంచి పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం ఏమిటి? ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తెలంగాణవాదులు తమవైపే నిలిచారని టీఆర్‌ఎస్ ధీమాలో ఉంది. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్ ఇక్కడ సాధించే ఫలితాలపైనే ఇక్కడ అన్ని పార్టీల దృష్టి ఉంది.
ఖిల్లాపై ఎగిరేది ఏ జెండా?
ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానంలో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఇప్పుడు ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణలోనే కీలకాంశంగా మారింది. రాజకీయాల్లోకి వచ్చిన తక్కువ కాలంలోనే తనదైన శైలిలో గుర్తింపు పొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడి నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
ఆ పార్టీ తరఫున తెలంగాణలో మొదట అభ్యర్థిగా స్వయంగా జగన్‌మోహన్‌రెడ్డే ఈయనను ప్రకటించారు. జిల్లా ప్రజలు గెలిపిస్తే కేంద్రమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం పార్లమెంటు స్థానం ‘ఫ్యాన్’దేనని జోరుగా ప్రచారం జరిగింది. ఇక్కడి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న డాక్టర్ కె.నారాయణ బరిలో నిలవడంతో ఈ స్థానానికి మరింత ప్రాధాన్యం లభించింది. మరోవైపు సిట్టింగ్ ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావు ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు. ఈ ముగ్గురు ఉద్ధండుల నడుమ జరిగిన రసవత్తర పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది చర్చ జరుగుతున్నా, పొంగులేటి గెలుపు ఖాయమేనని జిల్లాలో ఇప్పటికీ జోరుగా ప్రచారం సాగుతుండగా, ఆయనకు లభించే మెజార్టీపైనే చర్చలు జరుగుతున్నాయి.
భట్టి, మోత్కుపల్లి, రాంరెడ్డి, వనమా భవితవ్యం ఏమిటో?
జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు నేతలు బరిలో ఉన్న నేపథ్యంలో వారి భవితవ్యంపై కూడా జోరుగా అంచనాలు సాగుతున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లా నుంచి వలస వచ్చిన టీడీ పీ సీనియర్ నేత రాజకీయ భవితవ్యాన్ని జిల్లా ఓటర్లు తేల్చనున్నారు. ఆయన జిల్లాలోని మధిర నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క కూడా ఇక్కడి నుంచి కాంగ్రెస్ పక్షాన నిలబడ్డారు. వీరిద్దరికీ వైఎస్సార్‌సీపీ మద్దతుతో పోటీచేసిన సీపీఎం అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గట్టిపోటీ ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆ ఇద్దరి రాజకీయ ప్రముఖుల భవిష్యత్ శుక్రవారం తేలనుంది. మాజీమంత్రులు వనమా వెంకటేశ్వరరావు, రాంరెడ్డి వెంకటరెడ్డి, టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన ఊకె అబ్బయ్య, సీపీఐ నుంచి కారెక్కిన బానోతు చంద్రావతి, టీడీపీ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావులాంటి నాయకులు కూడా ఎలాంటి ఫలితం సాధిస్తారో అనేది తేలడానికి మరికొద్ది సమయమే ఉంది.