సాక్షి ప్రతినిధి, అనంతపురం : పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీర్చడమంటే ఇదే! రాయదుర్గం టీడీపీ టికెట్ కోసం ఇన్నాళ్లు జి.దీపక్‌రెడ్డి ఓ వైపు.. కేవీ ఉష మరొక వైపు ప్రయత్నిస్తూ వచ్చారు. కేవీ ఉషకు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తూ వచ్చారు. ఇరు వర్గాల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. దీన్ని మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు అనువుగా మల్చుకున్నారు. రాయదుర్గం టీడీపీ అభ్యర్థిత్వాన్ని తనకు ఖరారు చేయించుకున్నారు.
ఇప్పుడు కాలవకు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, కేవీ ఉషలు దన్నుగా నిలుస్తున్నారు. కేవీ ఉష, మెట్టును వెంటబెట్టుకుని బుధవారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కాలవ సమావేశమవడానికి సన్నాహాలు చేస్తోండటంపై దీపక్‌రెడ్డి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఆ తర్వాత ఆయనను రాయదుర్గం నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా చంద్రబాబు నియమించారు. సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ కూడా ఇస్తామని అప్పట్లోనే ఖరారు చేశారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే ముహూర్తం ముంచుకొచ్చింది.
ఎన్నికల నేపథ్యంలో బెంగుళూరులో నివాసం ఉండే కేవీ ఉష తనకు రాయదుర్గం టీడీపీ టికెట్ ఇప్పించాలని జనతాదళ్(ఎస్) అధ్యక్షులు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ ద్వారా చంద్రబాబుపై ఒత్తిడి తెప్పించారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు రాయదుర్గంలో పనిచేసుకోవాలని కేవీ ఉషకు సూచించారు. దీపక్‌రెడ్డితో అప్పటికే విభేదిస్తోన్న ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి క్షేత్రస్థాయిలో కేవీ ఉషకు దన్నుగా నిలిచారు. నియోజకవర్గం వ్యాప్తంగా కేవీ ఉష కలియతిరగడం దీపక్‌రెడ్డిని ఆందోళనకు గురిచేసింది. ఈ క్రమంలోనే ఇరు పక్షాల మధ్య మాటల యుద్ధం నడించింది. ఇరుపక్షాల మధ్య దాడులు ప్రతిదాడులు జరిగాయి. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన అంతర్గత సర్వేల్లో దీపక్‌రెడ్డికి ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు వెల్లడైందని ఆ పార్టీ వర్గాలు అప్పట్లో వెల్లడించాయి. దీన్ని మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు అనువుగా మల్చుకున్నారు.
అనంతపురం లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని వదులుకున్న నేపథ్యంలో తనకు రాయదుర్గం నుంచి అవకాశం కల్పించాలని ఇటీవల జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చంద్రబాబును కోరారు. కాలవ శ్రీనివాసులుకు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు తోడయ్యారు. దాంతో.. కాలవ శ్రీనివాసులుకు రాయదుర్గం టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. ఆ మేరకు ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేస్తూ నిర్ణయం కూడా తీసుకున్నారు. అధికారిక ప్రకటన వెలువడటమే తరుతాయి. ఇది పసిగట్టిన దీపక్‌రెడ్డి మండిపడుతున్నారు.
దీపక్‌రెడ్డి అనునయులు రాయదుర్గంలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. బలనిరూపణకు దిగారు. కాలవ శ్రీనివాసులుకు సహకరించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే కాలవ శ్రీనివాసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డికి స్నేహహస్తం చాచారు. దీంతో కాలవతో చెలిమికి ఎమ్మెల్సీ మెట్టు సై అన్నారు. ఎమ్మెల్సీ మెట్టు, కాలవ శ్రీనివాసులు కలిసి మంగళవారం బెంగుళూరులో కేవీ ఉషతో సమావేశమయ్యారు. ఆమె కూడా కాలవ శ్రీనివాసులుకు మద్దతు పలికారు. వారిద్దరినీ వెంటబెట్టుకుని బుధవారం చంద్రబాబును కలవడానికి కాలవ సన్నాహాలు చేస్తున్నారు.
ఫలించిన కాలవ వ్యూహం
Published Wed, Apr 9 2014 2:47 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
Advertisement
Advertisement