సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. పంచాయితీ ఎన్నికల కోసం బీజేపీతో సీపీఎం దోస్తీ కడుతోంది. పంచాయితీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ విషయాన్ని ధృవీకరించినట్లు ప్రముఖ మీడియా ఏజెన్సీ పీటీఐ ఓ కథనాన్ని ప్రచురించింది.
‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) చేస్తున్న రౌడీ రాజకీయాల్ని కూకటి వేళ్లతోసహ పెకలించాలని నదియా జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలోనే మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. టీఎంసీని ఓడించటమే మా లక్ష్యం’ అని సీపీఎం ప్రతినిధి సుమిత్ దే వెల్లడించారు. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య సీట్ల పంపిణీ జరుగుతోందని ఆయన వెల్లడించారు. ఇక మిగతా జిల్లాలో, ముఖ్యంగా టీఎంసీ ఆధిపత్యం ఉన్న ప్రాంతాల్లో కలిసి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా సీపీఎం-బీజేపీలు ఉన్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తెలిపారు. అధిష్ఠానం అనుమతి తర్వాతే తాము ఈ విషయంలో ముందుకెళ్తున్నామని దిలీప్ తెలిపారు.
కాగా, విభజన రాజకీయాలకు బీజేపీ కేరాఫ్ అంటూ విమర్శలు గుప్పించే సీపీఎం.. ఇప్పుడు అదే పార్టీతో జత కట్టడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీఎంసీ ఈ వ్యవహారాన్ని కుట్రపూరిత రాజకీయంగా అభివర్ణిస్తోంది. తమను దెబ్బకొట్టాలని యత్నిస్తున్న వారికి భంగపాటు తప్పదని టీఎంసీ కార్యదర్శి పార్థ ఛటర్జీ చెప్పారు. నదియా జిల్లా కరీంపూర్-రానాఘాట్‌లో కొన్నిరోజుల క్రితం హింస చెలరేగింది. దీనికి టీఎంసీనే కారణమంటూ బీజేపీ-సీపీఎంలు సంయుక్తంగా ర్యాలీలు చేపట్టాయి. తదనంతర పరిస్థితులతో ఇప్పుడు ఏకంగా కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి.
ఖండించిన సీతారాం ఏచూరి.. ఇదిలా ఉంటే ఆ వార్తలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విటర్ వేదికగా ఖండించారు. ‘పొత్తులపై మీడియా కథనాల్లో వాస్తవం లేదని, నదియా జిల్లాలో సీపీఎం ఒంటరిగానే పోటీ చేస్తోందని తెలిపారు. టీఎంసీ, బీజేపీల విధానాలకు తాము వ్యతిరేకమని ప్రకటించారు. తప్పుడు వార్తలతో కార్యకర్తల్లో గందరగోళం సృష్టించాలని కొందరు యత్నిస్తున్నారంటూ’ ఆయన ట్వీట్ చేశారు. కాగా, మే 14న పశ్చిమ బెంగాల్‌లో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment