కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రాజ్‌భవన్ పంచాయితీలు రసవత్తరమైన రాజకీయాలకు వేదిక అవుతున్నాయి. జగదీప్ ధన్‌కర్ ఉప రాష్ట్రపతి కావడంతో ఆయన స్థానంలో బెంగాల్‌కు గవర్నర్‌గా(అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు లా గణేశన్ అయ్యర్. అయితే ఆయన తీరు ఇప్పుడు బీజేపీకి చుక్కలు చూపిస్తోంది.
అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న గవర్నర్ గణేశన్.. బీజేపీ నేతలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు. మణిపూర్ గవర్నర్‌గా ఉన్న ఆయన.. బెంగాల్‌కు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా చెన్నైలో జరిగిన తన సోదరుడి పుట్టినరోజుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఆహ్వానించారాయన. ఇక మంగళవారం నాటి పరిణామం అయితే ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.
తోటి ప్రతినిధులతో కలిసి రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లగా.. ఆ సమయంలో గవర్నర్ నగరంలో లేరనే సమాచారం తెలుసుకుని సువేందు అధికారి అసంతృప్తిగా కనిపించారు. అంతకు ముందు రోజు బీజేపీ ప్రతినిధులంతా గవర్నర్‌ను కలిసి ఓ మెమోరాండం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ మంత్రి అఖిల్ గిరి భర్తరఫ్ కోసం సీఎం మమతా బెనర్జీకి సిఫార్సు చేయాలని గవర్నర్‌ను కోరాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఆయన లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.
మంగళవారం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన సువేందు అధికారి.. ‘‘తాము రాజ్‌భవన్‌కు అభ్యర్థన చేయడానికి రాలేదని, గట్టి డిమాండ్‌తోనే వచ్చామని, గవర్నర్ కార్యదర్శితో టీ తాగడానికి రాలేదంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఆయన(మంత్రి అఖిల్) కామెంట్లు చేసి 72 గంటలు గడుస్తున్నా.. సీఎం ఆయన్ని తొలగించలేదని, కనీసం గవర్నర్‌కు సిఫార్సు కూడా చేయలేదని సువేందు ఆగ్రహం వెల్లగక్కారు. శనివారం రాజ్‌భవన్‌కు తాము మెయిల్ చేశామని, గవర్నర్ ఢిల్లీ, చెన్నై, ఇంపాల్.. ఇలా ఎక్కడున్నా ఒక మంత్రిని తొలగించేలా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉంటారని, మా సందేశం గవర్నర్‌కు చేరే ఉద్దేశంతోనే తాము వచ్చామని సువేందు అధికారి మీడియా ద్వారా స్పష్టం చేశారు.
ఇక ధన్‌కర్ లేనిలోటుపై బీజేపీ నేత అగ్రిమిత్ర పాల్ స్పందించారు. జగ్‌దీప్ ధన్‌కర్ బెంగాల్‌కు గవర్నర్‌గానే కాకుండా.. తమకు సంరక్షకుడిగానూ వ్యవహరించారని వ్యాఖ్యానించారు. అన్నిరకాలుగా ఆయన మమ్మల్ని చూసుకునేవారన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన్ని భావించామని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నామని వ్యాఖ్యానించారు.
ఇక గవర్నర్ గణేశన్‌పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ నుంచి కనెక్షన్లు లేకపోతే ఆయన(సువేందు అధికారిని ఉద్దేశించి..) జీరో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఢిల్లీ నుంచి ఉన్న రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడని, రేపు కేంద్రంలో అధికారం దూరమైతే ఆయన ఏమైపోతారో అని వ్యాఖ్యానించారామె.
మరోవైపు కేరళలో గవర్నర్‌తో వైరం నడుపుతున్న వామపక్ష సైతం.. బెంగాల్ గవర్నర్ రాజకీయాలపై స్పందించాయి. గవర్నర్ అంటే ఒకప్పుడు రాజ్యాంగబద్ధమైన హోదా. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్‌గా వ్యవహరించే పరిస్థితులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాళ్లను నియమిస్తోంది కాబట్టి.. బీజేపీ నేతలు గవర్నర్ భవనాలను తమ పూర్వీకుల ఆస్తులుగా భావిస్తున్నారు అని విమర్శించారు సీపీఐ(ఎం) నేత మహమ్మద్ సలీం.
గతంలో గవర్నర్‌గా ఉన్న సమయంలో జగదీప్ ధన్‌కర్.. దీదీ సర్కార్‌కు ట్రబుల్ మేకర్‌గా ఉండేవారు. రాజకీయ అంశాలపై బీజేపీ ప్రతినిధులతో తరచూ చర్చించేవారు. అంతేకాదు.. దీదీ ప్రభుత్వంపై వచ్చే ప్రతీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునేవారు కూడా. కానీ, అందుకు భిన్నంగా ఉన్న ప్రస్తుత గవర్నర్ తీరు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, తమిళనాడుకు చెందిన లా గణేశన్ అయ్యర్.. ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడం బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆయన్ని తప్పించాలనే డిమాండ్ బెంగాల్ బీజేపీ నుంచి కేంద్రానికి బలంగా వినిపిస్తోంది.
::ఇంటర్నెట్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment