west bengal governor
-
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
మమతా బెనర్జీ: రాజ్‌భవన్‌లో అడుగుపెట్టను
సప్తాగ్రామ్: పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోసుపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గవర్నర్ ఇంకా పదవిలో కొనసాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం సప్తాగ్రామ్‌లో ఎన్నికల ప్రచారం మమతా బెనర్జీ మాట్లాడారు. గవర్నర్ పదవిలో ఆనంద బోసు కొనసాగినంత కాలం తాను రాజ్‌భవన్‌లో అడుగుపెట్టబోనని తేలి్చచెప్పారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాలనుకుంటే వీధుల్లోనే కలుస్తానని అన్నారు. మహిళలపై వేధింపులకు గవర్నర్ సమాధానం చెప్పాలన్నారు. గత నెల 24న, ఈ నెల 2న గవర్నర్ ఆనంద బోసు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని రాజ్‌భవన్‌లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి గతవారం కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను తప్పు చేయలేదని గవర్నర్ అన్నారు. పూర్తి వీడియోలను గవర్నర్ బహిర్గతం చేయలేదని మమత ఆరోపించారు. -
బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్ సీవీ ఆనంద బోస్(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు గురువారం ఆనంద బోస్ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ పేరిట విడుదలైన సర్క్యులర్ వెల్లడించింది. గతంలో బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్ గణేశన్, బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్‌లాల్ నెహ్రూ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్‌గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా. -
అధికార పార్టీతో అంటకాగుతూ.. బీజేపీకి చుక్కలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో రాజ్‌భవన్ పంచాయితీలు రసవత్తరమైన రాజకీయాలకు వేదిక అవుతున్నాయి. జగదీప్ ధన్కర్ ఉప రాష్ట్రపతి కావడంతో ఆయన స్థానంలో బెంగాల్‌కు గవర్నర్‌గా(అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు లా గణేశన్ అయ్యర్. అయితే ఆయన తీరు ఇప్పుడు బీజేపీకి చుక్కలు చూపిస్తోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్న గవర్నర్ గణేశన్.. బీజేపీ నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. మణిపూర్ గవర్నర్‌గా ఉన్న ఆయన.. బెంగాల్‌కు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. తాజాగా చెన్నైలో జరిగిన తన సోదరుడి పుట్టినరోజుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం ఆహ్వానించారాయన. ఇక మంగళవారం నాటి పరిణామం అయితే ప్రతిపక్ష నేత సువేందు అధికారికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది. తోటి ప్రతినిధులతో కలిసి రాజ్ భవన్‌కు ర్యాలీగా వెళ్లగా.. ఆ సమయంలో గవర్నర్ నగరంలో లేరనే సమాచారం తెలుసుకుని సువేందు అధికారి అసంతృప్తిగా కనిపించారు. అంతకు ముందు రోజు బీజేపీ ప్రతినిధులంతా గవర్నర్‌ను కలిసి ఓ మెమోరాండం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బెంగాల్ మంత్రి అఖిల్ గిరి భర్తరఫ్ కోసం సీఎం మమతా బెనర్జీకి సిఫార్సు చేయాలని గవర్నర్‌ను కోరాలనుకున్నారు. కానీ, ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఆయన లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. మంగళవారం రాజ్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడిన సువేందు అధికారి.. ‘‘తాము రాజ్‌భవన్‌కు అభ్యర్థన చేయడానికి రాలేదని, గట్టి డిమాండ్‌తోనే వచ్చామని, గవర్నర్ కార్యదర్శితో టీ తాగడానికి రాలేదంటూ తీవ్ర అసహనం ప్రదర్శించారు. ఆయన(మంత్రి అఖిల్) కామెంట్లు చేసి 72 గంటలు గడుస్తున్నా.. సీఎం ఆయన్ని తొలగించలేదని, కనీసం గవర్నర్‌కు సిఫార్సు కూడా చేయలేదని సువేందు ఆగ్రహం వెల్లగక్కారు. శనివారం రాజ్‌భవన్‌కు తాము మెయిల్ చేశామని, గవర్నర్ ఢిల్లీ, చెన్నై, ఇంపాల్.. ఇలా ఎక్కడున్నా ఒక మంత్రిని తొలగించేలా ముఖ్యమంత్రికి సిఫార్సు చేసే రాజ్యాంగబద్ధమైన హక్కును కలిగి ఉంటారని, మా సందేశం గవర్నర్‌కు చేరే ఉద్దేశంతోనే తాము వచ్చామని సువేందు అధికారి మీడియా ద్వారా స్పష్టం చేశారు. ఇక ధన్కర్ లేనిలోటుపై బీజేపీ నేత అగ్రిమిత్ర పాల్ స్పందించారు. జగ్దీప్ ధన్కర్ బెంగాల్‌కు గవర్నర్‌గానే కాకుండా.. తమకు సంరక్షకుడిగానూ వ్యవహరించారని వ్యాఖ్యానించారు. అన్నిరకాలుగా ఆయన మమ్మల్ని చూసుకునేవారన్నారు. ఒక కుటుంబ సభ్యుడిగా ఆయన్ని భావించామని, ఆయన్ని ఎంతో మిస్ అవుతున్నామని వ్యాఖ్యానించారు. ఇక గవర్నర్ గణేశన్పై బీజేపీ చేసిన వ్యాఖ్యలను సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ నుంచి కనెక్షన్లు లేకపోతే ఆయన(సువేందు అధికారిని ఉద్దేశించి..) జీరో అని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత కేవలం ఢిల్లీ నుంచి ఉన్న రాజకీయ పలుకుబడిని ప్రదర్శించేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నాడని, రేపు కేంద్రంలో అధికారం దూరమైతే ఆయన ఏమైపోతారో అని వ్యాఖ్యానించారామె. మరోవైపు కేరళలో గవర్నర్‌తో వైరం నడుపుతున్న వామపక్ష సైతం.. బెంగాల్ గవర్నర్ రాజకీయాలపై స్పందించాయి. గవర్నర్ అంటే ఒకప్పుడు రాజ్యాంగబద్ధమైన హోదా. కానీ, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఒక ఏజెంట్‌గా వ్యవహరించే పరిస్థితులు వచ్చాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వాళ్లను నియమిస్తోంది కాబట్టి.. బీజేపీ నేతలు గవర్నర్ భవనాలను తమ పూర్వీకుల ఆస్తులుగా భావిస్తున్నారు అని విమర్శించారు సీపీఐ(ఎం) నేత మహమ్మద్ సలీం. గతంలో గవర్నర్‌గా ఉన్న సమయంలో జగదీప్ ధన్కర్.. దీదీ సర్కార్‌కు ట్రబుల్ మేకర్‌గా ఉండేవారు. రాజకీయ అంశాలపై బీజేపీ ప్రతినిధులతో తరచూ చర్చించేవారు. అంతేకాదు.. దీదీ ప్రభుత్వంపై వచ్చే ప్రతీ ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకునేవారు కూడా. కానీ, అందుకు భిన్నంగా ఉన్న ప్రస్తుత గవర్నర్ తీరు బీజేపీని ఇబ్బందికి గురి చేస్తోంది. బీజేపీ సీనియర్ నేత, తమిళనాడుకు చెందిన లా గణేశన్ అయ్యర్.. ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడం బీజేపీ తట్టుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఆయన్ని తప్పించాలనే డిమాండ్ బెంగాల్ బీజేపీ నుంచి కేంద్రానికి బలంగా వినిపిస్తోంది. ::ఇంటర్నెట్ డెస్క్, సాక్షి -
Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రధాని మోదీ అభినందనలు భారత రాజ్యాంగంపై జగదీప్ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. అంచలంచెలుగా ఎదుగుతూ... జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు. -
దీదీ పాలన హింసాత్మకమంటూ గవర్నర్ సీరియస్
కోల్‌కతా: బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో సోమవారం జరిగిన హింసాత్మక ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బేనర్జీ ప్రభుత్వంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ‘బెంగాల్లో హింసాత్మకమైన పాలన సాగుతోంది. భయంకరమైన హింసాత్మక ఘటనలు, సజీవ దహనాలు చూస్తుంటే అదే సత్యమనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఓ నివేదికను అడిగాను. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేస్తున్నా’ అని గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విటర్లో విడుదుల చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని బొగ్తుయ్ గ్రామంలో సోమవారం బర్షల్ గ్రామ పంచాయితీ డిప్యూటీ చీఫ్ తృణమాల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత బాదు షేక్ బాంబు దాడిలో మరణించారు. అదేరోజు అర్ధరాత్రి చెలరేగిన హింసలో అల్లరి మూకలు 10 ఇళ్లకు నిప్పంటించారు. ఈ హింసాత్మక ఘటనలో 8 మంది మృతి సజీవ దహనమయ్యారు. టీఎంసీ నేత హత్యకు ప్రతీకారంగానే ఈ ఘాతుకానికి పాల్పపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Horrifying violence and arson orgy #Rampurhat #Birbhum indicates state is in grip of violence culture and lawlessness. Already eight lives lost. Have sought urgent update on the incident from Chief Secretary. My thoughts are with the families of the bereaved. pic.twitter.com/vtI6tRJcBX — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) March 22, 2022 -
బీజేపీ నేతలకు కనీస మర్యాద, సభ్యత లేదు: మమతా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు. కానీ ప్రస్తుతం బెంగాల్లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు. -
గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
కోల్‌కతా: తమ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ పచ్చి అవినీతిపరుడని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికే ఆయన ఇటీవల ఉత్తర బెంగాల్లో పర్యటించారని మండిపడ్డారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘గవర్నర్ ధన్కర్ అవినీతిపరుడు. 1996 నాటి జైన్ హవాలా కేసు చార్జీషీట్లో ఆయన పేరు ఉంది. అవినీతి మకిలి అంటిన ఇలాంటి గవర్నర్‌ను ఇంకా ఎందుకు పదవిలో కొనసాగిస్తున్నారో కేంద్రం సమాధానం చెప్పాలి’అని మమత డిమాండ్ చేశారు. గవర్నర్‌ను› తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో లేఖలు రాశానని, అయినా స్పందించలేదని విమర్శించారు. ఆ ఆరోపణలు నిరాధారం: గవర్నర్ సీఎం మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారని, తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని గవర్నర్ ధన్కర్ దుయ్యబట్టారు. ఒక ముఖ్యమంత్రి తరహాలో మమత వ్యవహరించడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా తాను చేయాల్సిన ప్రసంగంలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తానని, అందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జైన్ హవాలా కేసుకు సంబంధించిన ఏ చార్జిషీట్లోనూ తన పేరు లేదని స్పష్టం చేశారు. మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని చెప్పారు. -
గవర్నర్‌గా ధన్కర్ వద్దంటూ ప్రధానికి మూడుసార్లు లేఖ రాశా
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ధన్కర్ను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోదీకి ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ‘చిన్న పిల్లాడైతే బుజ్జగించవచ్చు కానీ, ఒక వృద్ధుడిని అలా చేయలేం కదా. ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది’అంటూ మమత వ్యాఖ్యానించారు. గవర్నర్ ధన్కర్ను తొలగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయాలేవీ తనకు తెలియవన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ధన్కర్ను కేంద్రం నియమించింది. ఆయన్ను వెనక్కి తీసుకోవాలని మోదీకి లేఖలు రాశా’అని తెలిపారు. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంతో గవర్నర్ ధన్కర్ మధ్య విభేదాలు మొదట్నుంచీ కొనసాగుతున్నాయి. అమిత్ షాను కలిసిన ధన్కర్ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ధన్కర్.. గురువారం హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపై ధన్కర్ హోం మంత్రికి వివరించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
West Bengal: కొలువుదీరిన మమత జంబో కేబినెట్
కోల్‌కత: ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సీఎంగా మమత ప్రమాణ స్వీకారం చేయగా తాజాగా ఆమె జంబో కేబినెట్ కొలువుదీరింది. 43 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు సోమవారం మంత్రులుగా ప్రమాణం చేశారు. బెంగాల్ గవర్నర్ జగదీప్ ధంకర్ రాజ్‌భవన్‌లో వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బెంగాల్ సీఎం మమత పాల్గొన్నారు. కరోనా కారణంగా అతి తక్కువ మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 43 మందిలో 24 మంది పూర్తి స్థాయి మంత్రులుగా, 10 మంది సహాయ మంత్రులు, మరో 9 మంది స్వతంత్ర మంత్రులుగా సేవలు అందించనున్నారు. మమత కేబినెట్లో చాలా మంది పాతమంత్రులు మళ్లీ బెర్తులను దక్కించుకోగా.. బంకిమ్ చంద్ర హజ్రా, రతిన్ ఘోష్, పులక్ రాయ్, బిప్లబ్ మిత్రాను పదవులు వరించాయి. ఇక 2011 నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తున్న అమిత్ మిత్రా సైతం మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంది. మాజీ ఐపీఎస్ అధికారి హుమాయున్ కబీర్, రత్న దే నాగ్ని సైతం మంత్రి (స్వతంత్ర) పదవులు వరించాయి. అలాగే రాజకీయ నాయకుడిగా మారిన క్రికెటర్ మనోజ్ తివారీ సైతం మంత్రి మండలిలో చోటు దక్కించుకున్నాడు. కాగా, ఇటీవల వెలువడిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఎంసీ జయభేరీ మోగించింది. తృణమూల్ కాంగ్రెస్ 213 సీట్లను గెలుచుకోగా బీజేపీ 77 సీట్లలో విజయం సాధించింది. బీజేపీ సర్వశక్తులూ ఒడ్డినప్పటికీ.. ఓటమి తప్పలేదు. అయితే, గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకోవడం గమనార్హం. (చదవండి: Tamil nadu: శశికళకు మద్దతుగా అన్నాడీఎంకే పోస్టర్లు) -
మమత X గవర్నర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ప్రస్తుత సంక్షోభ సమయంలో గవర్నర్ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మమత మండిపడ్డారు. ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అధికారిక ప్రకటనలను, లోగోలను వాడరాదని గవర్నర్‌ను కోరారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్రం తీసుకుంటున్న చర్యలను విమర్శిస్తూ గవర్నర్ ధన్కర్ గత వారం ప్రభుత్వానికి రెండు లేఖలు రాశారు. వీటికి బదులిస్తూ సీఎం మమతా బెనర్జీ శనివారం గవర్నర్‌కు 14 పేజీల లేఖ రాశారు. ‘ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి గవర్నర్ రాసిన లేఖ, అందులో వాడిన భాష, భావం, తీరు అనూహ్యం. నాపైన, మా మంత్రులు, అధికారులనుద్దేశించి మీరు వాడిన భాష ఏమాత్రం తగినది కాదు’అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను ఆచరించకుండానే ఆయన రాజ్యాంగ విలువలను బోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తమకు బలం ఉన్నంత వరకు ఇలాంటివి చేయడం మినహా గవర్నర్‌కు అధికారాలేవీ లేవన్నారు. సంక్షోభ సమయంలో అధికారం చెలాయించేందుకు ఆయన చేస్తున్న యత్నాలను అడ్డుకుంటామన్నారు. -
గవర్నర్ వస్తే.. అసెంబ్లీకి తాళం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్) ప్రభుత్వం, గవర్నర్ జగదీప్ ధన్కర్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గురువారం ధన్కర్ అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించగా అధికారులు గవర్నర్ ప్రత్యేక గేటుకు తాళం వేసి, ఎటో వెళ్లిపోయారు. ఈ పరిణామంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మధ్యాహ్నం ధన్కర్ నంబర్3 ప్రత్యేక గేటు గుండా అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించారు. అయితే, ఆ గేటుకు తాళం వేసి ఉంది. అధికారులు అందుబాటులో లేరు. దీంతో మీడియా సిబ్బందికి కేటాయించిన నంబర్–2 గేటు ద్వారా లోపలికి ప్రవేశించారు. ‘నేను వస్తున్నట్లు తెలిసినా మూడో నంబర్ గేటును ఎందుకు మూసేశారు? ఈ చర్య మన ప్రజాస్వామిక చరిత్రలో దుర్దినం. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసే ప్రయత్నం జరుగుతోంది’అని అన్నారు. తనను భయపెట్టేందుకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ విమర్శలపై టీఎంసీ నేత పార్థా బెనర్జీ స్పందించారు. ‘అధికార బంగళా కోసం రూ.7 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాక ప్రజాస్వామ్యంపై గవర్నర్ మాట్లాడాలి’అని అన్నారు. కాగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున రెండ్రోజులు సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం స్పీకర్ ప్రకటించడం గమనార్హం. -
పశ్చిమ బెంగాల్ గవర్నర్‌ను విచారించిన సీబీఐ
న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలీకాప్టర్ ఒప్పందం కేసులో పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ కేసులో ఆయనను సాక్షిగా విచారించారు. 3600 కోట్ల రూపాయిలకు సంబంధించి ముడుపుల వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోంది. సీబీఐ అధికారులు శుక్రవారం నారాయణన్ విచారించి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా నారాయణన్ బాధ్యతుల చేపట్టకుముందు జాతీయ భద్రత సలహాదారుగా వ్యవహరించారు. హెలికాప్టర్లను కొనుగోలు చేసేముందు 2005లో జరిగిన సమావేశాల్లో నారాయణన్ పాల్గొన్నారు. గోవా గవర్నర్ బీవీ వాంఖూ కూడా నారాయణన్‌తో పాటు ఆ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని రక్షణ బాధ్యతలు చూసే ఎస్పీజీ ఆ సమయంలో వాంఖూ ఉన్నారు. అగస్టా కేసులో వాంఖూను కూడా ప్రశ్నించాలని సీబీఐ భావిస్తున్నట్టు సమాచారం. అగస్టా ఒప్పందంలో 360 కోట్ల రూపాయిలు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు రావడంతో గతేడాది రద్దు చేశారు. భారత వైమానిక దళం మాజీ చీఫ్ ఎస్పీ త్యాగీతో పాటు 13 మందిపై కేసు నమోదు చేశారు. -
నేనింకా రాజీనామా చేయలేదు
తానింకా గవర్నర్ పదవికి రాజీనామా చేయలేదని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తెలిపారు. అయితే రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఏమైనా వర్తమానం వచ్చిందా లేదా అన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లను సాగనంపాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణన్‌ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు. దానికి ఆయన తానింకా రాజీనామా చేయలేదని, ఇప్పటికీ తానే బెంగాల్ గవర్నర్‌నని అన్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదని కూడా నారాయణన్ చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏమీ చెప్పకపోయినా.. రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిన గవర్నర్ల జాబితాలో నారాయణన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.