
గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ సంచలన ఆరోపణ
బెంగాల్ పోలీసులతో తనకు ముప్పు ఉందని ఆందోళన
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్‌చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది.
ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు.