
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ జగదీప్ ధన్‌కర్ ప్రారంభ ఉపన్యాస సమయంలో బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై సీఎం మమతా తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ ఉపన్యాసం అనంతరం ఆయనకు సీఎం మమతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో సీఎం మమతా బీజేపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. తాను బీజేపీకి చెందిన సుష్మా స్వరాజ్ నుంచి రాజనాథ్‌సింగ్ వంటి నేతలను చూశానని తెలిపారు.
కానీ ప్రస్తుతం బెంగాల్‌లో ఉన్న బీజేపీ నాయకులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న బీజేపీ నేతలకు కనీసం సభా గౌరవ మర్యాదలు, సభ్యత లేదని దుయ్యబట్టారు. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటన కేసులకు సంబంధించి అసెంబ్లీలో నిరసన తెలిపారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రారంభ ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు యత్నించారు.