
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన ప్రకంపనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా, విద్యార్థి సంఘాలు ‘పశ్చిమబంగాఛాత్రో సమాజ్’మంగళవారం చేపట్టిన నిరసన ప్రదర్శనపై పోలీసులు విరుచుకు పడ్డారు. దీంతో కోల్‌కతా వీధుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
‘నభన్నా అభిజాన్’ పేరుతో హావ్‌డా నుంచి మొదలైన విద్యార్థుల ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. బాష్పవాయువు వాటర్ ఫిరంగులతో విరుచుకుపడ్డారు. దీంతో కొందరు ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. మరికొందరు బారికేడ్లను తోసుకొని దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేసి గాల్లోకి కాల్పులు జరిపారు.
మరోవైపుఈ ర్యాలీ నేపథ్యంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసం దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. ర్యాలీ నిర్వహించేందుకు ఎలాంటి అనుమతి లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ నలుగురు విద్యార్థులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. ఇది బీజేపీ ప్రేరేపిత కుట్ర అని హింసాకాండతో అల్లకల్లోలం సృష్టించేందుకు పన్నిన పన్నాగమని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
కాగా ఈ ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 వేలమంది పోలీసులను మోహరించారు. నిరసనకారులపై నిఘా నిమిత్తం డ్రోన్లను ఉపయోగించారు. బారికేడ్లను తొలగించే అవకాశం లేకుండా, వెల్డింగ్ చేసి గ్రీజు పూయడం గమనార్హం.