గేటు బయట మాట్లాడుతున్న గవర్నర్ జగదీప్ ధన్‌కర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని టీఎంసీ(తృణమూల్ కాంగ్రెస్) ప్రభుత్వం, గవర్నర్ జగదీప్ ధన్‌కర్ మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గురువారం ధన్‌కర్ అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించగా అధికారులు గవర్నర్ ప్రత్యేక గేటుకు తాళం వేసి, ఎటో వెళ్లిపోయారు. ఈ పరిణామంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మధ్యాహ్నం ధన్‌కర్ నంబర్3 ప్రత్యేక గేటు గుండా అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించారు. అయితే, ఆ గేటుకు తాళం వేసి ఉంది. అధికారులు అందుబాటులో లేరు. దీంతో మీడియా సిబ్బందికి కేటాయించిన నంబర్–2 గేటు ద్వారా లోపలికి ప్రవేశించారు.
‘నేను వస్తున్నట్లు తెలిసినా మూడో నంబర్ గేటును ఎందుకు మూసేశారు? ఈ చర్య మన ప్రజాస్వామిక చరిత్రలో దుర్దినం. ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసే ప్రయత్నం జరుగుతోంది’అని అన్నారు. తనను భయపెట్టేందుకు ప్రభుత్వం సాగిస్తున్న ప్రయత్నాలను సాగనివ్వబోనన్నారు. ఈ విమర్శలపై టీఎంసీ నేత పార్థా బెనర్జీ స్పందించారు. ‘అధికార బంగళా కోసం రూ.7 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారో చెప్పాక ప్రజాస్వామ్యంపై గవర్నర్ మాట్లాడాలి’అని అన్నారు. కాగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నందున రెండ్రోజులు సమావేశాలను వాయిదా వేస్తున్నట్లు మంగళవారం స్పీకర్ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment