నేనింకా రాజీనామా చేయలేదు
తానింకా గవర్నర్ పదవికి రాజీనామా చేయలేదని పశ్చిమబెంగాల్ గవర్నర్ ఎంకే నారాయణన్ తెలిపారు. అయితే రాజీనామా చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి ఏమైనా వర్తమానం వచ్చిందా లేదా అన్న విషయం మాత్రం ఆయన చెప్పలేదు. యూపీఏ హయాంలో నియమితులైన పలువురు గవర్నర్లను సాగనంపాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో.. కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణన్ను విలేకరులు ఈ విషయమై ప్రశ్నించారు.
దానికి ఆయన తానింకా రాజీనామా చేయలేదని, ఇప్పటికీ తానే బెంగాల్ గవర్నర్నని అన్నారు. తాను ఏం చేయాలనుకుంటున్నానో చెప్పాల్సిన అవసరం లేదని కూడా నారాయణన్ చెప్పారు. అధికారికంగా ఇప్పటివరకు ఏమీ చెప్పకపోయినా.. రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిన గవర్నర్ల జాబితాలో నారాయణన్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.