Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌ | Presidential election 2022: West Bengal Governor Jagdeep Dhankhar is NDA vice presidential candidate | Sakshi
Sakshi News home page

Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్‌

Published Sun, Jul 17 2022 5:02 AM | Last Updated on Sun, Jul 17 2022 6:54 AM

Presidential election 2022: West Bengal Governor Jagdeep Dhankhar is NDA vice presidential candidate - Sakshi

న్యూఢిల్లీ:  ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్, జాట్‌ నాయకుడు జగదీప్‌ ధన్‌ఖడ్‌(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్‌ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు.  

ప్రధాని మోదీ అభినందనలు  
భారత రాజ్యాంగంపై జగదీప్‌ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్‌ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్‌ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.

ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా..  
కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్‌ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్‌ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి.

అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్‌లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్‌ నిర్వహిస్తారు.  

అంచలంచెలుగా ఎదుగుతూ...
జగదీప్‌ ధన్‌ఖడ్‌ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్‌ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్‌ సైనిక్‌ స్కూల్‌లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్తాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు.

రాజస్తాన్‌ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్‌ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్‌ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్‌ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్‌ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement