nda candidate
-
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
ప్రధాని సమక్షంలో నామినేషన్ వేసిన జగదీప్ ధన్కర్
సాక్షి, ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆయన నామినేషన్ సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ తదితరుల ధన్కర్ వెంట ఉన్నారు. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా ఇంకా నామినేషన్ దాఖలు చేయలేదు. మంగళవారంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ల గడువు ముగియనుంది. Delhi | Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections, as the candidate of NDA. Prime Minister Narendra Modi, HM Amit Shah, Defence Minister Rajnath Singh, Union Minister Nitin Gadkari, BJP national president JP Nadda and other BJP leaders present. pic.twitter.com/iBRfuXC0pO — ANI (@ANI) July 18, 2022 #WATCH | Delhi: NDA candidate Jagdeep Dhankhar files his nomination for the Vice Presidential elections in the presence of PM Narendra Modi. (Source: DD) pic.twitter.com/jyUOddtxOe — ANI (@ANI) July 18, 2022 -
Presidential election 2022: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్
న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్, జాట్ నాయకుడు జగదీప్ ధన్‌ఖడ్(71)ను బరిలోకి దించనున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం ప్రకటించారు. ధన్‌ఖడ్ అచ్ఛమైన రైతు బిడ్డ అని ప్రశంసించారు. ప్రజల గవర్నర్‌గా పేరు సంపాదించారని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నారని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీలో విస్తృత సంప్రదింపుల అనంతరం ధన్‌ఖడ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు చెప్పారు. ఎన్డీయే అభ్యర్థిగా అనూహ్యంగా జగదీప్ ధన్‌ఖడ్ పేరును బీజేపీ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. హరియాణా, రాజస్తాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కీలక సామజికవర్గమైన జాట్ల మద్దతు కూడగట్టడానికి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వ్యవసాయదారులైన జాట్లు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రధాని మోదీ అభినందనలు భారత రాజ్యాంగంపై జగదీప్ ధన్‌ఖడ్‌కు అపార పరిజ్ఞానం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్టసభల వ్యవహారాలపై మంచి పట్టు ఉందన్నారు. దేశ అభివృద్ధే లక్ష్యంగా చైర్మన్ హోదాలో రాజ్యసభను చక్కగా ముందుకు నడిపిస్తారంటూ అభినందనలు తెలియజేశారు. ఉప రాష్ట్రపతిగా తన పేరును ప్రకటించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్‌ఖడ్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక ఇలా.. కొత్త ఉప రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభలో ఎన్నికైన, నామినేటెడ్ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఉప రాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఎన్నిక విషయానికొస్తే నామినేటెడ్ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్రాలకు ఎలాంటి పాత్ర ఉండదు. పార్లమెంట్ ఉభయ సభల్లోని సభ్యులంతా కలిసి ఉప రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఒక్కో ఎంపీ ఓటు విలువ ఒకటి. అందరి ఓటు విలువ సమానమే. ప్రస్తుతం పార్లమెంట్లో మొత్తం ఎంపీల సంఖ్య 780. బీజేపీకి సొంతంగానే 394 మంది ఎంపీలున్నారు. మెజారిటీ (390) కంటే అధికంగా ఉన్నారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్ విజయం నల్లేరు మీద నడకేనని చెప్పొచ్చు. నూతన ఉప రాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 19 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. ఆగస్టు 6వ తేదీన ఓటింగ్ నిర్వహిస్తారు. అంచలంచెలుగా ఎదుగుతూ... జగదీప్ ధన్‌ఖడ్ 1951 మే 18న రాజస్తాన్‌లోని ఝున్‌ఝున్ జిల్లాలో మారుమూల కిథానా గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చీత్తోర్‌గఢ్ సైనిక్ స్కూల్లో పాఠశాల విద్య అభ్యసించారు. జైపూర్‌లోని మహారాజా కాలేజీలో ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ రాజస్తాన్ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించారు. రాజస్తాన్‌లో ప్రముఖ లాయర్‌గా గుర్తింపు పొందారు. రాజస్తాన్ హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులోనూ లాయర్‌గా ప్రాక్టీస్ చేశారు. తర్వాత ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో ఝున్‌ఝున్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. 1990లో చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1993లో రాజస్తాన్‌లో అజ్మీర్ జిల్లాలోని కిషన్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 జూలైలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో అనేక విషయాల్లో ధన్‌ఖఢ్ విభేదించినట్లు వార్తలు వచ్చాయి. ఆయనకు భార్య సుదేశ్ ధన్‌ఖడ్, ఓ కుమార్తె ఉన్నారు. -
Presidential Elections 2022: రాష్ట్రపతి భవన్ వైపు ముర్ము అడుగులు
దేశ ప్రథమ పౌరుడు, జాతి సమైక్యతకు, సమగ్రతలకు ప్రతీకగా నిలిచే రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. దేశానికి 16వ రాష్ట్రపతి ఎన్నుకోవడానికి జూలై 18న ఓటింగ్ జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగిసిపోతుంది. రాష్ట్రపతి ఎన్నికలకి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరి పోరు ఉన్నప్పటికీ ఎన్డీయే.. ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి. ప్రాంతీయ పార్టీల్లో అత్యధికులు ముర్ముకే జై కొట్టడంతో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోరు ఏకపక్షంగా సాగుతుందన్న అంచనాలున్నాయి. ద్రౌపది వెంట 44 పార్టీలు ఉంటే, సిన్హాకు మద్దతుగా 34 పార్టీలున్నాయి. బీజేడీ, వైఎస్సార్సీపీలతో పాటు శివసేన, జేఎంఎం, టీడీపీ, అన్నాడీఎంకే, బీఎస్పీ వంటి పార్టీలు ద్రౌపదికి మద్దతు ప్రకటించాయి. దీంతో ఒక ఆదివాసీ మహిళ దేశ అత్యున్నత పీఠంపైకెక్కడం లాంఛనమనే చెప్పాలి. ముర్ము గెలిస్తే దేశానికి రెండో మహిళ రాష్ట్రపతి అవుతారు. ఎన్నిక ప్రక్రియ.. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. రాజ్యసభకు నామినేట్ అయిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఓటింగ్‌లో పాల్గొనే అర్హత లేదు. ఓటింగ్ రహస్య పద్ధతిలో జరుగుతుంది. దీంతో క్రాస్ ఓటింగ్‌కు అవకాశాలుంటాయి. ఎంపీలకు ఆకుపచ్చ రంగు బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలను ఇవ్వనున్నారు. బ్యాలెట్ పత్రాల్లో రెండు కాలమ్‌లు ఉంటాయి. అవే అభ్యర్థి పేరు, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. పోటీపడుతున్న అభ్యర్థుల్లో మొదటి ప్రాధాన్యం ఓటు ఎవరికో తప్పనిసరిగా వేయాలి. అప్పుడే ఓటు చెల్లుతుంది. రెండో ప్రాధాన్యం ఓటు ఐచ్ఛికం. విజేతని నిర్ణయించేది ఇలా .. రాష్ట్రపతి ఎన్నిక జూలై 18న జరిగితే, ఓట్ల లెక్కింపు జూలై 21న జరుగుతుంది. ప్రతీ ఎంపీకి, ఎమ్మెల్యేకి ఓటు విలువ ఉంటుంది. రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర జనాభా ఆధారంగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య ఓటు విలువ మారిపోతుంది. అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం ఓటు విలువని పార్లమెంటు సభ్యుల సంఖ్యతో భాగిస్తే వచ్చే దానిని ఎంపీ ఓటు విలువగా నిర్ధారిస్తారు. ఈ సారి జమ్ము కశ్మీర్ రాష్ట్రంగా లేకపోవడంతో 708గా ఉండాల్సిన ఎంపీ ఓటు విలువ 700కి తగ్గింది. ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ ఎలక్టోరల్ కాలేజీగా వ్యవహరిస్తారు. 776 మంది లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, 4,120 మంది ఎమ్మెల్యేలు మొత్తంగా 4,896 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల విలువ 10,86,431 కాగా అందులో కనీసం 50% కంటే ఎక్కువ ఓట్లు పోలయిన అభ్యర్థిని విజేతగా నిర్ణయిస్తారు. అంటే 5,49,442కి పైగా ఓట్ల విలువ వచ్చిన వారు అత్యున్నత పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటికే 44 పార్టీలు ద్రౌపది ముర్ముకు మద్దతునివ్వడంతో ఆమెకు 6 లక్షలకుపైగా విలువైన ఓట్లు పోలవతాయని అంచనా. ఇంచుమించుగా మూడింట రెండు వంతుల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతభత్యాలు, జీవనం దేశంలో రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారి అందరికంటే రాష్ట్రపతి జీతం ఎక్కువ. ప్రస్తుతం రాష్ట్రపతికి నెలకి రూ.5 లక్షల వేతనం చెల్లిస్తున్నారు. 2018లో రూ.లక్షన్నర ఉన్న జీతాన్ని రూ.5లక్షలకు పెంచారు. న్యూఢిల్లీలోని 340 గదులు, హాళ్లు ఉన్న రాష్ట్రపతి భవన్ అధికారిక నివాసం. అందులోనే బసచేస్తారు. వేసవి కాలం, శీతాకాలం గడపడానికి రెండు విడిదిలు ఉన్నాయి. వేసవి విడిది సిమ్లాలో ఉంటే, శీతాకాలం విడిది హైదరాబాద్‌లో ఉంది. ప్రెసిడెంట్స్ బాడీగార్డ్(పీబీజీ) భద్రత ఉంటుంది. భారత ఆర్మీలో ఇదొక విభాగం. ఇక ఎక్కడికైనా ఉచిత ప్రయాణాలు, కావాల్సినంత మంది సిబ్బంది ఉంటారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ ఉన్న కారులో ప్రయాణిస్తారు. రిటైర్ అయిన తర్వాత రూ.లక్షన్నర పెన్షన్, ఉచిత నివాసం, ఫోన్, అయిదుగురు సిబ్బంది, ఉచిత ప్రయాణ సదుపాయాలు ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ రాష్ట్రపతి అధికారాలు–విధులు ► రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు. ప్రధాన కార్యనిర్వాహణాధికారి. దేశ పరిపాలన, కార్యనిర్వహణ రాష్టపతి పేరు మీదే నిర్వహించాలి ► దేశ కార్యనిర్వాహణ అధికారిగా రాష్ట్రాల గవర్నర్లు, సుప్రీం కోర్టు, హైకోర్టుల జడ్జీలు, ఆడిటర్ జనరల్ ఆర్థిక సంఘాలను నియమిస్తారు. ప్రధానమంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రిమండలిని రాష్ట్రపతి నియమిస్తారు. ► పార్లమెంటు ఆమోదించిన ఏ బిల్లయినా రాష్ట్రపతి సంతకం తర్వాతే చట్టరూపం దాల్చుతుంది. బిల్లులో తనకి నచ్చని అంశాలు ఉంటే రాష్ట్రపతి వెనక్కి తిరిగి పంపే అధికారం ఉంది. రాష్ట్రపతి సిఫారసు లేనిదే ఆర్థిక బిల్లులేవీ సభలో ప్రవేశపెట్టకూడదు. ► దేశంలో త్రివిధ బలగాలకు అధిపతి రాష్ట్రపతి. ► దేశంలో అంతర్యుద్ధం చెలరేగి భద్రత అదుపు తప్పినా, సైనిక తిరుగుబాటు జరిగినా, విదేశాలు దండయాత్రకు దిగినా అత్యవసర పరిస్థితి విధించే అధికారం రాష్ట్రపతిదే. ► సుప్రీం కోర్టు విధించిన మరణ శిక్షలపైన క్షమాభిక్ష ప్రసాదించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ► ప్రధాని, మంత్రిమండలి లేకుండా రాష్ట్రపతి ఏమీ చేయలేరు. కానీ దేశ నిర్ణయాలను తెలియజెప్పే ఒక అధికారిక హోదా, గౌరవం ఈ పదవికి ఉన్నాయి. -
ద్రౌపది ముర్ముకు వైఎస్ఆర్ సీపీ పూర్తీ మద్దతు పలుకుతోంది: సీఎం వైఎస్ జగన్
-
ద్రౌపది ముర్ముకు ఘన స్వాగతం
-
వైఎస్ఆర్ సీపీ మద్దతు కోరనున్న ద్రౌపది ముర్ము
-
Draupadi Murmu: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ
న్యూఢిల్లీ: గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. విపక్షాలు కూడా మంగళవారమే తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాను ప్రకటించడం తెలిసిందే. దాంతో అందరి కళ్లూ జూలై 18న జరగబోయే ఎన్నికపైనే కేంద్రీకృతమయ్యాయి. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైతే ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లున్నాయి. ముర్ము అభ్యర్థిత్వం నేపథ్యంలో పలు ఎన్డీఏయేతర పార్టీలు ఆమెకు ఓటేయడం ఖాయమే. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, జార్ఖండ్‌లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం, పలు ఇతర కీలక ప్రాంతీయ పార్టీలు ఈ జాబితాలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక లాంఛనమే. అదే జరిగితే స్వాతంత్య్రం వచ్చాక జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా 64 ఏళ్ల ముర్ము రికార్డు సృష్టిస్తారు. మోదీ కూడా స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కడం తెలిసిందే. ముర్ము త్వరలో నామినేషన్ వేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. 2017లో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన బీజేపీ, తాజాగా ఓ ఎస్టీని, అందులోనూ మహిళను ఆ పదవికి పోటీదారుగా ఎంపిక చేయడం విశేషం. అప్పుడు కూడా ముర్ము పేరు గట్టిగా విన్పించింది. 20 పేర్లు పరిశీలించాం: నడ్డా రాష్ట్రపతి అభ్యర్థిగా పార్లమెంటరీ బోర్డు భేటీలో దాదాపు 20 పేర్ల దాకా చర్చకు వచ్చినట్టు నడ్డా చెప్పారు. ‘‘అయితే ఈసారి తూర్పు భారతం నుంచి గిరిజన నేతను, అది కూడా మహిళను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారు. ‘‘అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని ఆశించాం. కానీ విపక్షాలు ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడంతో అది సాధ్యపడలేదు’’ అన్నారు. ఏకగ్రీవ ప్రయత్నాల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సిఢంగ్ ఇప్పటికే పలు పార్టీల నేతలతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముర్ము అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలతో ఇప్పటికే చర్చించినట్టు వివరించారు. ముర్ము పేరును ప్రకటించడానికి ముందు ఎన్డీఏ అభ్యర్థిగా మంగళవారం రోజంతా పలు పేర్లు విన్పించాయి. ఛత్తీస్‌గఢ్ అనసూయ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లో ఒకరికి అవకాశం దక్కుతుందంటూ ప్రచారం జరిగింది. గిరిజన నాయకురాలైన ముర్ము అభ్యర్థిత్వం దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో గిరిజన ఓట్లు సాధించి పెడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అంచెలంచెలుగా ఎదిగిన... ఆదివాసీ బిడ్డ న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము. అత్యంత సౌమ్యురాలు. మృదుభాషి అయిన ఆదివాసీ బిడ్డ. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఆమె ప్రస్థానం సాగిన తీరు అత్యంత ఆసక్తికరం. ఎందరికో ఆదర్శనీయం. ఒడిశాలో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మయూర్‌భంజ్‌లో గిరిజన సంతాల్ తెగలో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. ఆమె ముర్ము తండ్రి బిరంచి నారాయణ్ తుడుది నిరుపేద కుటుంబం. దాంతో వారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందుల నడుమే ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ చేశారు. తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పని చేశారు. 1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్య్స, పశుసంవర్థక శాఖలు నిర్వహించారు. అంతకుముందు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్భంజ్ (పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ఆమే. గొప్ప రాష్ట్రపతి అవుతారు: మోదీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు. -
9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ నెల 8 సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు, ప్రభాత్ ఖబర్ హిందీ పత్రిక ఎడిటర్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఎన్నికల తేదీల్ని వెంకయ్య ప్రకటించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రాంగణంలోని కాంగ్రెస్ నేత ఆజాద్ చాంబర్లో భేటీఅయ్యాయి. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలన్న అంశంపై చర్చించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. సభలో బలాబలాలెంత: ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
రికార్డ్ బ్రేక్ చేసిన మీరాకుమార్
న్యూఢిల్లీ: బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించగా.. పరాజయం పాలైన ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ యాభై ఏళ్ల చరిత్రను తిరగరాశారు. రామ్‌నాథ్ కోవింద్ 65.65 శాతం ఓట్లు సాధించగా, మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా.. మీరాకుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థిగా 50 ఏళ్ల రికార్డును మీరాకుమార్ చెరిపేశారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పేరిట ఉండేది. ఓటమిపాలైన వారిలో అత్యధిక ఓట్ల విలువ ఎక్కువ సొంతం చేసుకున్న అభ్యర్థిగా 1967లో కోకా సుబ్బారావు ఈ ఘనత వహించగా, ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పుడు మీరాకుమార్ ఆ రికార్డును అధిగమించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన సుబ్బారావు, జాకీర్ హుస్సేన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే అప్పుడు జాకీర్‌కు పోలైన ఓట్ల విలువ 4.7 లక్షలు కాగా, సుబ్బారావు ఓట్ల విలువ 3.63లక్షలు. అయితే అప్పటినుంచి జరుగుతున్న ఏ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటమిపాలైన అభ్యర్థికి 3.63 లక్షల కంటే ఎక్కువ ఓట్ల విలువ రాలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమిపాలైన మీరాకుమార్ ఓట్ల విలువ 3.67 లక్షలు. దీంతో మీరాకుమార్, 1967లో సుబ్బారావు నెలకొల్పిన అత్యధిక ఓట్ల విలువను అధిగమించినట్లయింది. మరోవైపు ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
భారత రాష్ట్రపతి కోవిందుడు
-
భారత రాష్ట్రపతి కోవిందుడు
♦ భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ♦ కొత్త రాష్ట్రపతికి అభినందనల వెల్లువ ∙ ♦ 25న ప్రమాణ స్వీకారం అందరూ ఊహించినట్టుగానే దేశ ప్రథమ పౌరుడిగా రామ్‌నాథ్ కోవింద్ ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 65.65 శాతం ఓట్లతో రామ్‌నాథ్ విజయ దుందుభి మోగించగా.. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు 34.35 శాతం ఓట్లు దక్కాయి. ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన విజయంపట్ల ప్రధాని మోదీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తంచేశారు. బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ వంటి గొప్పవాళ్ల బాటలో బాధ్యతాయుతంగా నడుస్తానని రామ్‌నాథ్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు రాజ్యాంగాన్ని కాపాడుతూ.. పదవి గౌరవాన్ని పెంచేందుకు కృషిచేస్తా. వ్యవసాయ పనులు చేసేవారు, సాయంత్రం భోజనం కోసం పగలంతా చెమటచుక్క చిందించే నాలాంటి కోవిందులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ నెనొక్కటే చెప్పదలచుకున్నాను. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను మీ ప్రతినిధిగా రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టబోతున్నా. – రామ్‌నాథ్ న్యూఢిల్లీ: అనుకున్నట్లుగా భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ (71) ఎన్నికయ్యారు. మొదట్నుంచీ అనుకున్నట్లుగానే గురువారం జరిగిన ఎలక్టోరల్ కాలేజీ కౌంటింగ్‌లో 65.65 శాతం ఓట్లతో కోవింద్ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను ఓడించిన రామ్‌నాథ్ మొత్తం ఎలక్టోరల్ కాలేజీలో నమోదైన ఓట్లలో 65.5 శాతం ఓట్లు సాధించారు. మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు దక్కాయి. కోవింద్‌కు మొత్తం 2,930 ఓట్లు రాగా ఆయనకు లభించిన మొత్తం ఓట్ల విలువ (వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ఓటు విలువ ఆధారంగా) ఎలక్టోరల్ కాలేజీలో 7,02,044. మీరాకుమార్ 1,844 ఓట్లు గెలుచుకోగా వీటి విలువ 3,67,314 (34.35 శాతం). బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా, దేశ అత్యున్నత పదవి అందుకున్న రెండో దళితుడిగా కోవింద్ రికార్డు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవటం గమనా ర్హం. జూలై 25న రాష్ట్రపతి భవన్లో ప్రణబ్ ముఖర్జీ వారసుడిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, పలురాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. చాలాచోట్ల విపక్షాల సభ్యులూ కోవింద్‌కే ఓటేశారు. ఫలితాలు వెల్లడైన అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా.. 10 అక్బర్ రోడ్డులోని రామ్‌నాథ్ కోవింద్ తాత్కాలిక నివాసానికి వెళ్లి ఎన్నిక పత్రాన్ని అందజేశారు. అభినందనల పర్వం: ‘నేను రాష్ట్రపతి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. చిత్తశుద్ధితో పనిచేసేవారికి ఇదో మంచి సందేశాన్నిస్తుంది. రాష్ట్రపతిగా నేను విజయం సాధించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం. చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను’ అని విజయం అనంతరం కోవింద్ పేర్కొన్నారు. ఈ భారీ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా రామ్‌నాథ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ‘రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం ఫలప్రదంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు. మీరాకుమార్ను కూడా మోదీ అభినందించారు. ‘ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలతో మీరు ప్రచారం చేసిన తీరు మా అందరికీ మీరు గర్వకారణం’ అని మోదీ పేర్కొన్నారు. కోవింద్ విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమన్నారు. ‘పేదల విజ యమిది. బడుగు, బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షల విజయమిది’ అని షా తెలిపారు. కోవింద్‌ను ఆయన ప్రత్యర్థి మీరాకుమార్ అభినందించారు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీపై ఉంది’ అని కోవింద్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. లౌకికవాదం, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవటంలో తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. పార్లమెంటే నిర్ణయాత్మకం పార్లమెంటు ఉభయసభల్లో మొత్తం 768 ఎంపీలు (99శాతం పోలింగ్ జరిగింది) ఓటేయగా.. ఇందులో 21 ఓట్లు చెల్లలేదు. మొత్తం 747 ఓట్లలో కోవింద్‌కు 522 మంది ఎంపీల మద్దతు (3,69,576 ఓట్ల విలువ) లభించగా మీరాకుమార్‌కు 225 ఓట్లు (1,59, 300)వచ్చాయి. పార్లమెంటులో పోలైన ఓట్లలో చెల్లనివి తొలగించగా వచ్చిన మొత్తం 5,28,876 ఓట్ల విలువలో కోవింద్ 69.87 శాతం ఓట్లు సంపాదించారు. ఇదే ఆయన భారీ విజయాన్ని దాదాపు ఖరారు చేసింది. ఆ తర్వాత రాష్ట్రాల వారీగా జరిగిన కౌంటింగ్‌లోనూ పలుచోట్ల (హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ) మినహా కోవింద్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు. కాగా బీజేపీ వర్గాల ప్రకారం ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో స్వల్పంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలిసింది. ఈ ఓట్ల మద్దతు కూడా కోవింద్‌కే లభించింది. ఫలితాలు వెలువడగానే కోవింద్ సొంత గ్రామమైన యూపీలోని కాన్పూర్ జిల్లా కల్యాణ్‌పూర్ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ అధిపత్యం పెరిగేందుకు తోడ్పడింది. అయితే ఎన్డీయే కూటమి సొంతగా కోవింద్‌ను గెలిపించుకునేందుకు బలం లేకపోవటంతో బీజేపీ ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్ ఏఐఏడీఎంకే, జేడీయూ పార్టీల సాయం కోరింది. ఈ పార్టీలన్నీ కోవింద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతోపాటుగా విపక్ష కూటమిలోని జేడీయూ కూడా మాజీ బిహార్ గవర్నర్‌కు మద్దతు తెలిపింది. ఇవీ చెల్లని ఓట్లు! పార్లమెంటు సభ్యులతోపాటుగా వివిధ రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. గురువారం జరిగిన కౌంటింగ్‌లో నిబంధనల ప్రకారం లేని ఓట్లను తిరస్కరించినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా వెల్లడించారు. మొత్తం 77 ఓట్లు చెల్లనివిగా తేలగా అందులో పార్లమెంటు సభ్యులే 21 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. పశ్చిమబెంగాల్లో 10, ఢిల్లీలో 6, మణిపూర్, జార్ఖండ్‌లలో నాలుగు చొప్పున, ఉత్తరప్రదేశ్‌లో 2 ఓట్లను తిరస్కరించారు. మొత్తంగా ఈ చెల్లని ఓట్ల విలువ 20, 942. తొలి ప్రాధాన్యత ఓటును సరిగ్గా మార్క్ చేయలేకపోవటం, ఎన్నికల సంఘం సూచించినట్లుగా కాకుండా వేరే రకంగా నెంబర్లు రాయటం వల్ల ఈ ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. ఈసీ ఇచ్చిన ప్రత్యేక పెన్ను కాకుండా సాధారణ పెన్నుతో మార్కింగ్ చేయటం కూడా తిరస్కరణకు ఓ కారణమన్నారు. మొత్తం మీద 77 ఓట్లు చెల్లకపోవటంతో విపక్షాలకు సరిగ్గా ఎంతనష్టం జరిగిందనేది అంచనాలకు అందటం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కూడా లేనందున ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా దక్కలేదు. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కే ఓటేశారు. అయితే ఇందులో మూడు ఓట్లు చెల్లలేదు. తెలంగాణలో 117 అసెంబ్లీ ఓట్లలో మీరా కుమార్‌కు 20 ఓట్లు రాగా, కోవింద్‌కు 97 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. పారాంఖ్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు.. రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. ప్రచారానికి, వివా దాలకు దూరంగా ఉండేవారు. న్యాయవాది వృత్తి నుంచి రాజ్యసభ ఎంపీ, గవర్నర్, రాష్ట్రపతి వరకు ప్రస్థానమిదీ.. దళితుల కోసం: కోవింద్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లా దేరాపూర్ తాలూకా పారాంఖ్ గ్రామంలో 1945 అక్టోబర్ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్ వర్సిటీ నుంచి బీకాం, ఎల్ఎల్బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1977–79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి.రాజకీయాల్లో..: ఆర్ఎస్ఎస్ నేపథ్యమున్న కోవింద్ కమలదళానికి అత్యంత విధేయుడు.యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సన్నిహితుడు. కోవింద్ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఘాటంపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998–2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. నాలాంటి చాలా మంది కోవిందులున్నారు! విజయంపై ఉద్విగ్నంగా స్పందించిన రామ్‌నాథ్ న్యూఢిల్లీ: ‘దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు రాజ్యాంగాన్ని కాపాడుతూ.. పదవి గౌరవాన్ని కాపాడేందుకు కృషిచేస్తా’న నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. గురువారం ఫలితాలు వెల్లైడన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘నాకు వ్యక్తిగతంగా ఇది చాలా ఉద్విగ్నమైన క్షణం. ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నపుడు మా సొంతూళ్లోని కచ్చా ఇంట్లో ఉన్న రోజులు గుర్తొస్తాయి. ఇల్లంతా ఊరుస్తుంటే.. అన్నాదమ్ములతో కలిసి గోడకు ఆనుకుని నిలబడే వాళ్లం. వాన ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు. దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ అందరినీ సంతోషంగా ఉంచేందుకు కృషిచేస్తానని కోవింద్ వెల్లడించారు. ‘అలాంటి ఇళ్లలో ఉన్నవారు, వ్యవసాయ పనులు చేసేవారు, సాయంత్రం భోజనం కోసం పగలంతా చెమటచుక్క చిందించే నాలాంటి కోవిందులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ నెనొక్కటే చెప్పదలచుకున్నాను. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను మీ ప్రతినిధిగా రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టబోతున్నాను’ అని ఉద్విగ్నంగా కోవింద్ పేర్కొన్నారు. తనలాగా నిజాయితీగా పనిచేసేవారికి ఎప్పటికైనా సరైన అవకాశాలు దక్కుతాయనే సందేశాన్ని ఈ విజయం మరోసారి గుర్తుచేసిందన్నారాయన. రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ వంటి గొప్పవాళ్లు చూపిన బాటలోనే బాధ్యతాయుతంగా నడుస్తానన్నారు. తనపై నమ్మకముంచిన ప్రజలకు, తనపై నమ్మకముంచి ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు కోవింద్ ధన్యవాదాలు తెలిపారు. తను రాష్ట్రపతి అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. ఈ విజయం దేశం, సమాజం కోసం చేసిన అవిశ్రాంత కృషికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాన్నారు. తొలి బీజేపీ రాష్ట్రపతి న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టబోతున్న తొలి బీజేపీ నాయకుడుగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించారు. రాష్ట్రపతిగా తమ పార్టీ నుంచి తొలిసారి ఒక దళితుడు ఎన్నికకావడం తమకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తరఫున దివంగత ఏపీజే అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికి కలాంకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. 2007లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్ సింగ్ షెకావత్‌ను తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. అయితే ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో యూపీఏ అభ్యర్థి ప్రతిభాపాటేల్ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక 2012లో లోక్‌సభ మాజీ స్పీకర్ ఏపీ సంగ్మాకు బీజేపీ మద్దతునివ్వగా యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ చేతిలో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మెజారిటీ ఓట్లు రావడమే కాకుండా బీజేడీ, జేడీయూ లాంటి ప్రత్యర్థులు సైతం కోవింద్‌కు మద్దతు ఇచ్చారు. విపక్ష సభ్యుల క్రాస్ ఓటింగ్ న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పలుచోట్ల క్రాస్ ఓటింగ్ జరిగింది. గురువారం జరిగిన కౌంటింగ్‌లో ఈ విషయం సుస్పష్టమైంది. చాలాచోట్ల విపక్ష పార్టీల సభ్యులు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు తెలిపారు. గుజరాత్లో కోవింద్‌కు మద్దతుగా 132 మంది ఓటేయగా మీరాకుమార్‌కు 49 ఓట్లు వచ్చాయి. గుజరాత్ అసెంబ్లీలో అధికార బీజేపీకి 121 స్థానాలున్నాయి. అటు గోవాలోనూ కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలుండగా మీరాకుమార్‌కు 11 ఓట్లు దక్కాయి. మహారాష్ట్రలోనూ 13 మంది విపక్ష సభ్యులు కోవింద్‌కు మద్దతుగా ఓటేశారు. మధ్యప్రదేశ్ ఆరుగురు, ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, హరియాణాలో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో 11మంది, కర్ణాటక 8మంది, హిమాచల్ ప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమబెంగాల్లో ఐదుగురు, అస్సాంలో ముగ్గురు, పంజాబ్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఇద్దరు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమైంది. రాష్ట్రాల వారీగా ఆధిక్యం న్యూఢిల్లీ: పెద్ద రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్ నుంచి రామ్‌నాథ్ కోవింద్ అత్యధిక ఓట్లు సాధించగా.. తృణమూల్ పాలిత పశ్చిమ బెంగాల్లో ఆయనకు అతి తక్కువగా 11 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమాచారం మేరకు .. పోలైన ఓట్లలో 4,774 (10,69,358 ఎలక్టోరల్ ఓట్లు) చెల్లుబాటు కాగా.. కోవింద్ మొత్తం 2,930(7,02,044) లేదా 65.65 శాతం ఓట్లు సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు 1,844 ఓట్లు (3,67,314 ఎలక్టోరల్) లేదా 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి. ఢిల్లీలో భార్య సవితతో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందుకుంటూ నవ్వులు చిందిస్తున్న రామ్‌నాథ్ అభినందనలు రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌కు శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం ఫలవంతంగా, స్ఫూర్తిని నింపేలా ఉండాలని కోరుకుంటున్నా. రామ్‌నాథ్‌ను గెలిపించిన ఎలక్టోరల్ కాలేజీ సభ్యులకు కృతజ్ఞతలు. నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి కోవింద్‌కు అభినందనలు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. – మీరా కుమార్, విపక్షాల అభ్యర్థి ఈ విజయం చరిత్రాత్మకం. పేద, అట్టడుగు, నిమ్న వర్గాలకు, వారి అభిలాషలకు లభించిన విజయమిది. – అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు చాలా తక్కువ స్థాయిలో మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవిని చేపట్టే స్థాయికి కోవింద్ ఎదిగారు. ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ఇది తెలియజేస్తోంది. ఆయన ఆదర్శ రాష్ట్రపతి అవుతారని నాకు అనిపిస్తోంది. – వెంకయ్య నాయుడు, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌కు అభినందనలు. రాజ్యాంగ సంరక్షకుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, త్రివిధ దళాధిపతిగా భారత రాష్ట్రపతి పాత్ర అద్వితీయమైనది. – సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి కోవింద్ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలి. – కేసీఆర్, తెలంగాణ సీఎం కోవింద్ వంటి మృదుస్వభావి, అనుభవశాలి, చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం మంచి పరిణామం. – చంద్రబాబు, ఏపీ సీఎం ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, విలువలు గల వ్యక్తి కోవింద్. ప్రజా జీవితంలో కోవింద్‌కు ఉన్న అపారమైన అనుభవం రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవికి అలంకారం తేగలదు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు 20 ఏళ్ల క్రితం కోవింద్ కుటుంబ సభ్యులతో తాను దిగిన ఫొటోను, ఇటీవల మళ్లీ వారితోనే తానుదిగిన ఫొటోను మోదీ ట్విటర్లో పోస్ట్‌చేశారు. ఆ ఫొటోలివి. -
ఎన్డీఏ అభ్యర్థికే మా మద్దతు: టీఆర్ఎస్
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరిచే అభ్యర్థికే తమ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా ఉండే అధికార ఎన్డీఏ పక్షాన్నే తాముంటామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే తమ ముఖ్య కర్తవ్యమని ఆయన తెలిపారు. ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎన్డీఏను సైతం పక్కనబెట్టేందుకు వెనుకాడమని స్పష్టం చేశారు. అయితే, దీనిపై త్వరలోనే పార్టీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపేందుకు చేస్తున్న క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ పదవీకాలం జూలై 24వ తేదీతో ముగియనుండటంతో త్వరలోనే రాష్ట్రపతి ఎన్నిక జరిపేందుకు సన్నాహాలు ప్రారంభయ్యాయి. టీఆర్ఎస్కు లోక్‌సభలో 15 మంది సభ్యులున్నారు.