న్యూఢిల్లీ: గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. విపక్షాలు కూడా మంగళవారమే తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాను ప్రకటించడం తెలిసిందే. దాంతో అందరి కళ్లూ జూలై 18న జరగబోయే ఎన్నికపైనే కేంద్రీకృతమయ్యాయి.
దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైతే ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లున్నాయి. ముర్ము అభ్యర్థిత్వం నేపథ్యంలో పలు ఎన్డీఏయేతర పార్టీలు ఆమెకు ఓటేయడం ఖాయమే. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, జార్ఖండ్‌లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం, పలు ఇతర కీలక ప్రాంతీయ పార్టీలు ఈ జాబితాలో ఉంటాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక లాంఛనమే. అదే జరిగితే స్వాతంత్య్రం వచ్చాక జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా 64 ఏళ్ల ముర్ము రికార్డు సృష్టిస్తారు. మోదీ కూడా స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కడం తెలిసిందే. ముర్ము త్వరలో నామినేషన్ వేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. 2017లో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన బీజేపీ, తాజాగా ఓ ఎస్టీని, అందులోనూ మహిళను ఆ పదవికి పోటీదారుగా ఎంపిక చేయడం విశేషం. అప్పుడు కూడా ముర్ము పేరు గట్టిగా విన్పించింది.
20 పేర్లు పరిశీలించాం: నడ్డా
రాష్ట్రపతి అభ్యర్థిగా పార్లమెంటరీ బోర్డు భేటీలో దాదాపు 20 పేర్ల దాకా చర్చకు వచ్చినట్టు నడ్డా చెప్పారు. ‘‘అయితే ఈసారి తూర్పు భారతం నుంచి గిరిజన నేతను, అది కూడా మహిళను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారు. ‘‘అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని ఆశించాం. కానీ విపక్షాలు ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడంతో అది సాధ్యపడలేదు’’ అన్నారు. ఏకగ్రీవ ప్రయత్నాల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సిఢంగ్ ఇప్పటికే పలు పార్టీల నేతలతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు.
ముర్ము అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలతో ఇప్పటికే చర్చించినట్టు వివరించారు. ముర్ము పేరును ప్రకటించడానికి ముందు ఎన్డీఏ అభ్యర్థిగా మంగళవారం రోజంతా పలు పేర్లు విన్పించాయి. ఛత్తీస్‌గఢ్ అనసూయ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లో ఒకరికి అవకాశం దక్కుతుందంటూ ప్రచారం జరిగింది. గిరిజన నాయకురాలైన ముర్ము అభ్యర్థిత్వం దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో గిరిజన ఓట్లు సాధించి పెడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
అంచెలంచెలుగా ఎదిగిన... ఆదివాసీ బిడ్డ
న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము. అత్యంత సౌమ్యురాలు. మృదుభాషి అయిన ఆదివాసీ బిడ్డ. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఆమె ప్రస్థానం సాగిన తీరు అత్యంత ఆసక్తికరం. ఎందరికో ఆదర్శనీయం. ఒడిశాలో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మయూర్‌భంజ్‌లో గిరిజన సంతాల్ తెగలో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. ఆమె ముర్ము తండ్రి బిరంచి నారాయణ్ తుడుది నిరుపేద కుటుంబం. దాంతో వారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందుల నడుమే ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ చేశారు.
తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పని చేశారు. 1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్య్స, పశుసంవర్థక శాఖలు నిర్వహించారు. అంతకుముందు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌భంజ్ (పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ఆమే.
గొప్ప రాష్ట్రపతి అవుతారు: మోదీ
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment