Adivasi women
-
పచ్చబొట్టు చెరిగీపోదులే! ‘మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం’
ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే కేవలం ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నం.. టాటూ పేరుతో చిత్రించుకొనే ప్రత్యేకమైన డిజైన్. కానీ నిన్నటితరం వారికి మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకొనే ఒక పదిల జ్ఞాపకం.. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం.. జీవన విధానంలో ఓ భాగం.. తరతరాల ఆచారం. గిరిజనుల్లో మొదలై మైదాన ప్రాంతాలు, అటు నుంచి మెట్రో నగరాలకు ఓ ఫ్యాషన్ గా మారిన పచ్చబొట్టు పుట్టుక, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లోకి వెళ్లాల్సిందే. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి అనే తెగలోని ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. ఐదేళ్ల నుంచే సూదులు చేతబట్టి, ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు నాటి తరం తోటి మహిళల సొంతం. ఇందుకోసం సన్నని మూడు సూదులను దగ్గర చేర్చి చేతితో పట్టుకొనేలా దారంతో చుట్టగా చుడతారు. అడవిలో దొరికే (పెద్దేగి జాతి చెట్టు) బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు. ఒక్కో బొట్టుకు ఒక్కో ప్రత్యేకత.. ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్‌గోండ్ అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకొనేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై, మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకొనేవారు. రోగాలు, నొప్పులు వస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతి వేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై వేసుకొనేవారు. అలంకారమే కాక, దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మనాన్నలు, ఇష్ట దైవం, పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకునేవాళ్లు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారని నాటి తరం ఆదివాసీలు చెబుతున్నారు. పూర్వం గిరిజన మహిళలు చేతి నుంచి వీపు, తల వరకు ఒంటికి వేయని దుస్తుల వలే పచ్చబొట్టును వేయించుకొనేవారని గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు వలసలు మొదలవడంతో గిరిజనేతరులకు సైతం ఈ ఆచారం అలవాటు అయిందని పేర్కొన్నారు. అయితే ఈ తరం గిరిజన మహిళల్లో ఎక్కువ మంది పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు. చరిత్రకారుల ప్రస్తావన.. గతంలో హైమన్ డార్ఫ్, మైఖేల్ యోర్క్ వంటి విదేశీ పరిశోధకులు తమ రచనలు, ఫొటోలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం తమ ఒంటిపై కనీసం ఒక చుక్కనైనా తోటిల వద్ద వేసుకొని మురిసిపోయేవారు. ఆదివాసీల్లో ఒకటైన తోటి తెగ జనాభా 2011 లెక్కల ప్రకారం 4,811గా ఉండగా ప్రస్తుతం 10 వేల వరకు ఉండొచ్చని అంచనా. దేవుడిచ్చిన వరం మా ముందు తరం నుంచే పచ్చబొట్టు వేసే ఆచారం ఉంది.. మా తెగకు దేవుడు ఇచ్చిన వరం ఇది. రాను రాను గిరిజనుల్లో పచ్చబొట్టుపై ఆసక్తి తగ్గిపోయినా మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం. – వెడ్మ రాంబాయి, ఎదులపాడ్, తిర్యాణి మండలం, కుమురంభీం జిల్లా -
Draupadi Murmu: అంచెలంచెలుగా ఎదిగిన ఆదివాసీ బిడ్డ
న్యూఢిల్లీ: గిరిజన నాయకురాలికి అత్యున్నత గౌరవం దక్కింది. ఒడిశాకు చెందిన బీజేపీ నేత, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అనంతరం పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. విపక్షాలు కూడా మంగళవారమే తమ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హాను ప్రకటించడం తెలిసిందే. దాంతో అందరి కళ్లూ జూలై 18న జరగబోయే ఎన్నికపైనే కేంద్రీకృతమయ్యాయి. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైతే ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి గిరిజన మహిళగా ముర్ము చరిత్ర సృష్టిస్తారు. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీకి 49 శాతానికి పైగా ఓట్లున్నాయి. ముర్ము అభ్యర్థిత్వం నేపథ్యంలో పలు ఎన్డీఏయేతర పార్టీలు ఆమెకు ఓటేయడం ఖాయమే. ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్, జార్ఖండ్‌లోని పాలక గిరిజన పార్టీ జేఎంఎం, పలు ఇతర కీలక ప్రాంతీయ పార్టీలు ఈ జాబితాలో ఉంటాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక లాంఛనమే. అదే జరిగితే స్వాతంత్య్రం వచ్చాక జన్మించిన తొలి రాష్ట్రపతిగా కూడా 64 ఏళ్ల ముర్ము రికార్డు సృష్టిస్తారు. మోదీ కూడా స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కడం తెలిసిందే. ముర్ము త్వరలో నామినేషన్ వేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 29. 2017లో దళితుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతి చేసిన బీజేపీ, తాజాగా ఓ ఎస్టీని, అందులోనూ మహిళను ఆ పదవికి పోటీదారుగా ఎంపిక చేయడం విశేషం. అప్పుడు కూడా ముర్ము పేరు గట్టిగా విన్పించింది. 20 పేర్లు పరిశీలించాం: నడ్డా రాష్ట్రపతి అభ్యర్థిగా పార్లమెంటరీ బోర్డు భేటీలో దాదాపు 20 పేర్ల దాకా చర్చకు వచ్చినట్టు నడ్డా చెప్పారు. ‘‘అయితే ఈసారి తూర్పు భారతం నుంచి గిరిజన నేతను, అది కూడా మహిళను అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించాం’’ అని వివరించారు. ‘‘అన్ని పార్టీల అంగీకారంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని ఆశించాం. కానీ విపక్షాలు ముందుగానే తమ అభ్యర్థిని ప్రకటించడంతో అది సాధ్యపడలేదు’’ అన్నారు. ఏకగ్రీవ ప్రయత్నాల్లో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సిఢంగ్ ఇప్పటికే పలు పార్టీల నేతలతో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముర్ము అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలతో ఇప్పటికే చర్చించినట్టు వివరించారు. ముర్ము పేరును ప్రకటించడానికి ముందు ఎన్డీఏ అభ్యర్థిగా మంగళవారం రోజంతా పలు పేర్లు విన్పించాయి. ఛత్తీస్‌గఢ్ అనసూయ , జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్లో ఒకరికి అవకాశం దక్కుతుందంటూ ప్రచారం జరిగింది. గిరిజన నాయకురాలైన ముర్ము అభ్యర్థిత్వం దేశవ్యాప్తంగా త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల్లో గిరిజన ఓట్లు సాధించి పెడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అంచెలంచెలుగా ఎదిగిన... ఆదివాసీ బిడ్డ న్యూఢిల్లీ: ద్రౌపది ముర్ము. అత్యంత సౌమ్యురాలు. మృదుభాషి అయిన ఆదివాసీ బిడ్డ. జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి రాష్ట్రపతి అభ్యర్థి దాకా ఆమె ప్రస్థానం సాగిన తీరు అత్యంత ఆసక్తికరం. ఎందరికో ఆదర్శనీయం. ఒడిశాలో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మయూర్‌భంజ్‌లో గిరిజన సంతాల్ తెగలో 1958 జూన్ 20వ తేదీన ముర్ము జన్మించారు. ఆమె ముర్ము తండ్రి బిరంచి నారాయణ్ తుడుది నిరుపేద కుటుంబం. దాంతో వారు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. అనేక ఇబ్బందుల నడుమే ముర్ము భువనేశ్వర్‌లోని రమాదేవి విమెన్స్ కాలేజీ నుంచి బీఏ చేశారు. తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పని చేశారు. 1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవితం మొదలైంది. అక్కడి నుంచి ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో ఒడిశాలో బీజేడీ–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్య్స, పశుసంవర్థక శాఖలు నిర్వహించారు. అంతకుముందు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్భంజ్ (పశ్చిమ) జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ఆమే. గొప్ప రాష్ట్రపతి అవుతారు: మోదీ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపికపై ప్రధాని మోదీ స్పందించారు. దేశానికి ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ద్రౌపది ముర్ము సమాజ సేవకు, అణగారిన, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేశారు. పరిపాలనపరమైన అపార అనుభవం ఆమెకు ఉంది. గవర్నర్‌గా అత్యుత్తమ సేవలం దించారు. ఆమె గొప్ప రాష్ట్రపతి అవుతారని నాకు నమ్మకముంది’ అని ప్రధాని ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘విధానపరమైన విషయాలపై ఆమెకున్న అవగాహన, దయాస్వభావం దేశానికి ఎంతో ఉపకరిస్తాయి. పేదరికాన్ని, కష్టాలను అనుభవిస్తున్న కోట్లాది మంది ప్రజలు ద్రౌపది ముర్ము జీవితం నుంచి ప్రేరణ పొందుతారు’ అని ప్రధాని అన్నారు. -
మంచిగా చెప్తే వినరురా మీరు : మహిళలు
సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా : కెరమెరిలో మండలంలో బెల్టు షాపు నిర్వాహకుడిపై ఆదివాసీ మహిళలు బుధవారం దాడి చేశారు. బెల్టు షాపు నిర్వహించవద్దని గతంలోనే మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అయినా తీరు మారకపోవడంతో ఆగ్రహించిన మహిళలు నిర్వాహకుడిని చితకబాదారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఏజెన్సీలో సంపూర్ణ మద్య నిషేధం అమలవుతుండగా, గిరిజన సంఘాల తీర్మానం మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని వైన్‌షాపులకు అధికారులు టెండర్లు పిలవలేదు. దీంతో ఏజెన్సీలో వైన్‌షాపులు లేవు, మద్యం అమ్మకాలు లేవు. బెల్టుషాపులు కూడా ఉండొద్దంటూ ఆదివాసీ మహిళలు ఊరూరా తిరిగి షాపులలో ఉన్న మద్యం సీసాలను అప్పుడే ధ్వంసం చేశారు. సంఘాల తీర్మానాన్ని ఎవరైనా అతిక్రమిస్తే పది వేల రూపాయల జరిమానాతో పాటు దుకాణాల మీద దాడులు తప్పవని గతంలోనే హెచ్చరించారు. -
ఆదివాసీ ఆణిముత్యం.. కన్నీబాయి
సాక్షి, కెరమెరి (ఆసిఫాబాద్): కెరమెరి మండలంలోని భీమన్‌గోంది గ్రామానికి చెందిన కన్నీబాయి ధైర్యానికి చిరునామాగా స్థానికులకు సుపరిచితమే! పదో తరగతి వరకు ఆసిఫాబాద్‌లోని ఎస్టీ బాలికల ఉన్నత పాఠశాలలో చదివిన ఆమె ఇంటర్ కెరమెరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పూర్తి చేసింది. ఆర్థిక ఇబ్బందులతో పై చదువులు చదవలేకపోయినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆమెను చైతన్యపథాన నడిపించాయి. ఇందిరాక్రాంతి పథంలో పీవోపీ సీఏగా చేసిన కన్నీబాయి మండలంలోని చాలా గ్రామాలు సందర్శించి, అత్యంత వెనకబడిన కుటుంబాలపై సర్వే నిర్వహించింది. మండలంలో 108 అత్యంత వెనకబడిన కుటుంబాలు ఉన్నాయని అధికారులకు నివేదిక పంపించిన ఆమె ప్రస్తుతం వారి అభ్యున్నతికే పాటుపడుతోంది. కన్నీబాయి ఆదివాసీ గిరిజన సంఘంలో మహిళా కార్యదర్శిగా ఉన్నప్పుడు అప్పటి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణణ్‌తో మాట్లాడి ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల 150 మంది ఆదివాసీలకు అటవీ హక్కు పత్రాలను ఇప్పించింది. తిర్యాణి మండలం చాపిడి కొలాంగూడ గ్రామానికి చెందిన కొలాం విద్యార్థిని ఆసిఫాబాద్‌లోని గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతూ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న కన్నీబాయి ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే విద్యార్థిని మృతి చెందిందని, మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి, ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి రూ.2.5 లక్షల సాయం అందించడంలో కీలకపాత్ర పోషించింది. అదేవిధంగా లైన్‌పటార్ గ్రామంలో రక్త పరీక్షల నిమిత్తం వెళ్లిన కన్నీబాయి అక్కడి ఆదివాసీ రైతుల పరిస్థితిపై చలించి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య సహకారంతో ఆ రైతులకు 17 జతల ఎడ్లను ఇప్పించింది. ఇవేకాకుండా, బిత్తిరి సత్తి నటిస్తున్న ‘తుపాకి రాముడు’ సినిమాకు కన్నీబాయి కొరియోగ్రాపర్‌గా పని చేస్తోంది. రెజ్లింగ్‌లోనూ ఆమెకు ప్రావీణ్యముండటం విశేషం. విశాఖపట్టణంలో జనవరి 11 నుంచి 14 వరకు కొనసాగిన రెజ్లింగ్ పోటీల్లో 18 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా కన్నీబాయి రెండోస్థానం సాధించింది. అరకులోని కటక జలపాతంలో 400 మీటర్ల అడుగులో 2.35 నిమిషాల్లో చేరి అందరినీ ఆశ్చర్యపర్చింది. నెహ్రూ యువ కేంద్రంలో పని చేస్తున్నప్పుడు అక్కడి అధికారులు ఆమెలోని ప్రతిభను గుర్తించి పారాచూట్ శిక్షణ ఇప్పించారు. దీంతో హైదరాబాద్, నిజామాబాద్, నిర్మల్‌లోని కుంటాల జలపాతంలో ఉన్న పెద్దపెద్ద గుట్టలను అలవోకగా ఎక్కేసింది. రెండేళ్లుగా కన్నీబాయి సేవలను గుర్తించిన కుమురంభీం జిల్లా కలెక్టర్ చంపాలాల్, అటవీ శాఖా మంత్రి చేతుల మీదుగా ఉత్తమ సేవకురాలిగా అవార్డు అందజేశారు. -
ఫేస్బుక్లో కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తారా?
రాయ్‌పూర్: ‘వారు నలుగురు ఆదివాసి అమ్మాయిలు. వారికి 14 నుంచి 16 ఏళ్లు ఉంటాయి. వారి మణికట్లపై, రొమ్ములపై ఎలక్ట్రిక్ షాకులిచ్చిన గుర్తులున్నాయి. ఆ గుర్తులను చూసిన నేను భయకంపితురాలయ్యాను. ఎందుకు ఈ పోలీసులు మైనర్ బాలికలపై థర్డ్ డిగ్రీ హింసను ప్రయోగిస్తారని ఆందోళనకు గురయ్యాను’ అంటూ గత నెల ఏప్రిల్ 26వ తేదీన ఫేస్బుక్లో వర్షా డోగ్రి చేసిన కామెంట్ అప్పడు సంచలనం సృష్టించింది. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జైలు డిప్యూటి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల వర్షా డోంగ్రే మాత్రం కామెంట్ చేసినందుకు ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. ఆ తర్వాత ఇక్కడికి 350 కిలోమీటర్ల దూరంలోని అంబికాపూర్ జైలుకు ఆమెను బదిలీ చేశారు. ఆమె 1964 నాటి కేంద్ర పౌర సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ జైళ్ల డైరెక్టర్ జనరల్ గధారి నాయక్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తాను అధికార రహస్యాలనో, ప్రభుత్వ డాక్యుమెంట్లనో బయట పెడితే సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లుగాని, తన కళ్లారా చూసిన చిత్రహింసల తాలూకు గుర్తుల గురించి ఫేస్బుక్లో కామెంట్ చేస్తే శిక్ష ఎలా విధిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరులందరితో పాటు తనకూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని ఆమె వాదిస్తున్నారు. మావోయిస్టుల కేసులకు సంబంధించి ఆదివాసి ఆడపిల్లలను అరెస్ట్ చేయడం, వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఇలా దారుణంగా హింసించడం భద్రతా దళాల దృష్టిలో మామూలు విషయంగా మారిందని ఆమె చెబుతున్నారు. 2008 నుంచి 2010 మధ్య జగదల్పూర్ జైల్లో మహిళా ఖైదీల ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు వర్షాకు ఈ ఆదివాసి పిల్లలను ఎలా పోలీసులు హింసిస్తారో తెల్సింది. ‘2010లో ఓ రోజు జైల్లో మహిళా ఖైదీల గదులను తనిఖీ చేస్తున్నప్పుడు ఓ గదిలో నలుగురు ఆదివాసి బాలికలు కనిపించారు. వారు విపరీతంగా భయంతో వణకిపోతున్నారు. నోరు విప్పి ఏం జరిగిందో చెప్పడానికి కూడా వారికి మాట రావడం లేదు. వారు నలుగురు తమ మణికట్లను చూపిస్తే చూడగా ఒక్కొక్కరి చేతులపై తొమ్మిది, పదిసార్లు కరెంట్ షాకులిచ్చిన గుర్తులు కనిపించాయి. వారి రొమ్ములపై ఏడెనిమిది కరెంట్ షాకులిచ్చిన గుర్తులున్నాయి. వెంటనే జైలు డాక్టర్‌ను పిలిపించి ఆ గుర్తులను నమోదు చేసి వారికి చికిత్స అందించాల్సిందిగా సూచించాను. ఇంకా అప్పటికీ జైలుకొచ్చిన ఖైదీల మెడికల్ రికార్డును నమోదు చేయాలనే నిబంధన అమల్లోకి రాలేదు (జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశం మేరకు ఖైదీల మెడికల్ రికార్డును తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన 2010, మే నెల నుంచి అమల్లోకి వచ్చింది). ఆ మరుసటి రోజు డ్యూటీకి వచ్చేసరికి ఆ గిరిజన బాలికలు జైల్లో లేరు. బెయిల్‌పై విడుదలయ్యారని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత పని ఒత్తిడిలో ఆ బాలికల పరిస్థితి గురించి నేను పట్టించుకోలేదు’ అని వర్షా మీడియాకు వివరించారు. అందరిలా అన్యాయాలను చూస్తూ తలవంచుకుపోయే తత్వం కాదు వర్షాది. ఆమెది పోరాడేతత్వం. 2006లో జరిగిన పోలీసుల నియామకాల్లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని, దాని వల్ల తాను కూడా నష్టపోవాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోకపోతే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపించమని కోరారు. అందుకు ఆయన కోపగించుకొని గార్డులను పిలిపించి బయటకు పంపించారు. అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడకుండా కోర్టుకెక్కి పోరాటం కొనసాగించారు. దాదాపు పదేళ్ల అనంతరం రాష్ట్ర హైకోర్టు ఇటీవల వర్షా తరఫున తీర్పు చెప్పింది. ఆ నాటి పోలీసు అధికారుల నియామకాలపై సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద వర్షా డోగ్రికి ఐదులక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ 26వ తేదీన ఫేస్బుక్లో వర్షా చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. ప్రముఖ సామాజిక కార్యకర్త హిమాంషు కుమార్ ఆమె పోస్ట్‌ను షేర్ చేస్తూ దానికి కొన్ని ఫొటోలను కూడా జోడించడంతో పోలీసు అధికారులకు కోపం వచ్చింది. వివరణ ఇవ్వాలంటూ 36 పేజీల నోటీసును వర్షాకు పంపారు. తాను చేసిన పోస్ట్‌కు బాధ్యత వహిస్తానని, ఇతరులు చేసిన పోస్ట్‌కు తాను బాధ్యత వహించలేనంటూ ఆమె సమాధానం ఇచ్చారు. ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయకుండానే ఆమెను విధుల్లో నుంచి సస్పెండ్ చేశారు. ('దళిత బాలికల బట్టలిప్పించడం చూశాను')