ఈ తరం వారికి పచ్చబొట్టు అంటే కేవలం ఒంటిపై వేయించుకొనే ఫ్యాషన్ చిహ్నం.. టాటూ పేరుతో చిత్రించుకొనే ప్రత్యేకమైన డిజైన్. కానీ నిన్నటితరం వారికి మాత్రం అది జీవితాంతం గుర్తుంచుకొనే ఒక పదిల జ్ఞాపకం.. ముఖ్యంగా గిరిజనులకైతే అదో సంప్రదాయం.. జీవన విధానంలో ఓ భాగం.. తరతరాల ఆచారం. గిరిజనుల్లో మొదలై మైదాన ప్రాంతాలు, అటు నుంచి మెట్రో నగరాలకు ఓ ఫ్యాషన్ గా మారిన పచ్చబొట్టు పుట్టుక, అందుకు ఉపయోగించే వస్తువుల గురించి తెలుసుకోవాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గూడేల్లోకి వెళ్లాల్సిందే.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: గిరిజనుల్లో పచ్చబొట్టు అనేది తోటి అనే తెగలోని ఆడవాళ్లకు మాత్రమే పరిమితమైన కళ. ఐదేళ్ల నుంచే సూదులు చేతబట్టి, ఒంటిపై ఎలాంటి ఆకారమైనా వేయగల నేర్పు నాటి తరం తోటి మహిళల సొంతం. ఇందుకోసం సన్నని మూడు సూదులను దగ్గర చేర్చి చేతితో పట్టుకొనేలా దారంతో చుట్టగా చుడతారు.
అడవిలో దొరికే (పెద్దేగి జాతి చెట్టు) బెరడును తెచ్చి చిన్న కుండలో వేసి మాడిపోయే వరకు వేడి చేస్తే పచ్చని రంగు వస్తుంది. సన్నటి కట్టెపుల్లతో శరీరంపై మొదట ఆకారం వేస్తారు. ఆముదం నూనెను, ఆ రంగులో ముంచి శరీరంపై సూదితో పొడుస్తారు. వేసిన పచ్చబొట్టు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇదంతా ఎంతో క్రమశిక్షణ, ఓర్పుతో వేస్తుంటారు.
ఒక్కో బొట్టుకు ఒక్కో ప్రత్యేకత..
ఆది దంపతులైన శివపార్వతుల కల్యాణంలో తోటీలు పచ్చబొట్టు వేశారని పురాణ కథల్లో ఉంది. పార్వతికి నుదుటిపై పచ్చబొట్టు వేశాకే వివాహం జరిగిందని చెబుతుంటారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్‌గోండ్ అమ్మాయిలు పెళ్లిపీటలు ఎక్కేముందు నుదుటిపై సూర్యచంద్రుల ఆకారంలో పచ్చబొట్టు వేయించుకొనేవారు. మూడు నెలల శిశువుకు దిష్టి చుక్కతో మొదలై, మహిళల చేతులపై నవగ్రహాలు, పుష్పాలు రకాల రూపాల్లో సందర్భాన్ని బట్టి వేసుకొనేవారు.
రోగాలు, నొప్పులు వస్తే నుదిటి, కణత, గడ్డం, బుగ్గ, మెడ, వీపు, చేతి వేళ్ల మీద నుంచి భుజం వరకు, నడుము తదితర భాగాలపై వేసుకొనేవారు. అలంకారమే కాక, దైవభక్తి, భార్యాభర్తలు, అమ్మనాన్నలు, ఇష్ట దైవం, పేర్లను సైతం ఒంటిపై ముద్రించుకునేవాళ్లు. పూర్వం తమ పిల్లల్ని గుర్తుపట్టేందుకు శిశువుకు 3 నెలలు రాగానే పచ్చబొట్టు వేసేవారని నాటి తరం ఆదివాసీలు చెబుతున్నారు.
పూర్వం గిరిజన మహిళలు చేతి నుంచి వీపు, తల వరకు ఒంటికి వేయని దుస్తుల వలే పచ్చబొట్టును వేయించుకొనేవారని గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు వలసలు మొదలవడంతో గిరిజనేతరులకు సైతం ఈ ఆచారం అలవాటు అయిందని పేర్కొన్నారు. అయితే ఈ తరం గిరిజన మహిళల్లో ఎక్కువ మంది పచ్చబొట్టుపై ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. భవిష్యత్తు తరాలకు ఈ కళ అందితేనే పచ్చబొట్టు పదిలంగా ఉంటుందని చెబుతున్నారు.
చరిత్రకారుల ప్రస్తావన..
గతంలో హైమన్ డార్ఫ్, మైఖేల్ యోర్క్ వంటి విదేశీ పరిశోధకులు తమ రచనలు, ఫొటోలు, డాక్యుమెంటరీల్లో పచ్చబొట్టును ప్రస్తావించారు. రెండేళ్ల క్రితం ఐఐటీ హైదరాబాద్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులు పచ్చబొట్టుపై అధ్యయనం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పని చేసిన ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం తమ ఒంటిపై కనీసం ఒక చుక్కనైనా తోటిల వద్ద వేసుకొని మురిసిపోయేవారు. ఆదివాసీల్లో ఒకటైన తోటి తెగ జనాభా 2011 లెక్కల ప్రకారం 4,811గా ఉండగా ప్రస్తుతం 10 వేల వరకు ఉండొచ్చని అంచనా.
దేవుడిచ్చిన వరం
మా ముందు తరం నుంచే పచ్చబొట్టు వేసే ఆచారం ఉంది.. మా తెగకు దేవుడు ఇచ్చిన వరం ఇది. రాను రాను గిరిజనుల్లో పచ్చబొట్టుపై ఆసక్తి తగ్గిపోయినా మేం ఉన్నంతకాలం ఆచారాన్ని కొనసాగిస్తాం.
– వెడ్మ రాంబాయి, ఎదులపాడ్, తిర్యాణి మండలం, కుమురంభీం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment