ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తారా? | Why suspention on Chhattisgarh jailer Varsha Dongre | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తారా?

Published Tue, May 16 2017 5:50 PM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తారా?

ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేస్తే సస్పెండ్‌ చేస్తారా?

రాయ్‌పూర్‌: ‘వారు నలుగురు ఆదివాసి అమ్మాయిలు. వారికి 14 నుంచి 16 ఏళ్లు ఉంటాయి. వారి మణికట్లపై, రొమ్ములపై ఎలక్ట్రిక్‌ షాకులిచ్చిన గుర్తులున్నాయి. ఆ గుర్తులను చూసిన నేను భయకంపితురాలయ్యాను. ఎందుకు ఈ పోలీసులు మైనర్‌ బాలికలపై థర్డ్‌ డిగ్రీ హింసను ప్రయోగిస్తారని ఆందోళనకు గురయ్యాను’ అంటూ గత నెల ఏప్రిల్‌ 26వ తేదీన ఫేస్‌బుక్‌లో వర్షా డోగ్రి చేసిన కామెంట్‌ అప్పడు సంచలనం సృష్టించింది.

చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ జైలు డిప్యూటి సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల వర్షా డోంగ్రే మాత్రం కామెంట్‌ చేసినందుకు ఉద్యోగం నుంచి సస్పెండయ్యారు. ఆ తర్వాత ఇక్కడికి 350 కిలోమీటర్ల దూరంలోని అంబికాపూర్‌ జైలుకు ఆమెను బదిలీ చేశారు. ఆమె 1964 నాటి కేంద్ర పౌర సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ జైళ్ల డైరెక్టర్‌ జనరల్‌ గధారి నాయక్‌ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

తాను అధికార రహస్యాలనో, ప్రభుత్వ డాక్యుమెంట్లనో బయట పెడితే సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లుగాని, తన కళ్లారా చూసిన చిత్రహింసల తాలూకు గుర్తుల గురించి ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేస్తే శిక్ష ఎలా విధిస్తారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దేశ పౌరులందరితో పాటు తనకూ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందని ఆమె వాదిస్తున్నారు. మావోయిస్టుల కేసులకు సంబంధించి ఆదివాసి ఆడపిల్లలను అరెస్ట్‌ చేయడం, వారి నుంచి సమాచారం సేకరించేందుకు ఇలా దారుణంగా హింసించడం భద్రతా దళాల దృష్టిలో మామూలు విషయంగా మారిందని ఆమె చెబుతున్నారు. 2008 నుంచి 2010 మధ్య జగదల్పూర్‌ జైల్లో మహిళా ఖైదీల ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు వర్షాకు ఈ ఆదివాసి పిల్లలను ఎలా పోలీసులు హింసిస్తారో తెల్సింది.

‘2010లో ఓ రోజు జైల్లో మహిళా ఖైదీల గదులను తనిఖీ చేస్తున్నప్పుడు ఓ గదిలో నలుగురు ఆదివాసి బాలికలు కనిపించారు. వారు విపరీతంగా భయంతో వణకిపోతున్నారు. నోరు విప్పి ఏం జరిగిందో చెప్పడానికి కూడా వారికి మాట రావడం లేదు. వారు నలుగురు తమ మణికట్లను చూపిస్తే చూడగా ఒక్కొక్కరి చేతులపై తొమ్మిది, పదిసార్లు కరెంట్‌ షాకులిచ్చిన గుర్తులు కనిపించాయి. వారి రొమ్ములపై ఏడెనిమిది కరెంట్‌ షాకులిచ్చిన గుర్తులున్నాయి. వెంటనే జైలు డాక్టర్‌ను పిలిపించి ఆ గుర్తులను నమోదు చేసి వారికి చికిత్స అందించాల్సిందిగా సూచించాను.

ఇంకా అప్పటికీ జైలుకొచ్చిన ఖైదీల మెడికల్‌ రికార్డును నమోదు చేయాలనే నిబంధన అమల్లోకి రాలేదు (జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశం మేరకు ఖైదీల మెడికల్‌ రికార్డును తప్పనిసరిగా నమోదు చేయాలనే నిబంధన 2010, మే నెల నుంచి అమల్లోకి వచ్చింది). ఆ మరుసటి రోజు డ్యూటీకి వచ్చేసరికి ఆ గిరిజన బాలికలు జైల్లో లేరు. బెయిల్‌పై విడుదలయ్యారని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత పని ఒత్తిడిలో ఆ బాలికల పరిస్థితి గురించి నేను పట్టించుకోలేదు’ అని వర్షా మీడియాకు వివరించారు.

అందరిలా అన్యాయాలను చూస్తూ తలవంచుకుపోయే తత్వం కాదు వర్షాది. ఆమెది పోరాడేతత్వం. 2006లో జరిగిన పోలీసుల నియామకాల్లో అన్యాయాలు, అక్రమాలు జరిగాయని, దాని వల్ల తాను కూడా నష్టపోవాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోకపోతే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపించమని కోరారు. అందుకు ఆయన కోపగించుకొని గార్డులను పిలిపించి బయటకు పంపించారు. అయినప్పటికీ ఆమె నిరుత్సాహపడకుండా కోర్టుకెక్కి పోరాటం కొనసాగించారు. దాదాపు పదేళ్ల అనంతరం రాష్ట్ర హైకోర్టు ఇటీవల వర్షా తరఫున తీర్పు చెప్పింది. ఆ నాటి పోలీసు అధికారుల నియామకాలపై సమగ్ర విచారణ జరపాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఖర్చుల కింద వర్షా డోగ్రికి ఐదులక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో గత ఏప్రిల్‌ 26వ తేదీన ఫేస్‌బుక్‌లో వర్షా చేసిన పోస్ట్‌ వివాదాస్పదమైంది. ప్రముఖ సామాజిక కార్యకర్త హిమాంషు కుమార్‌ ఆమె పోస్ట్‌ను షేర్‌ చేస్తూ దానికి కొన్ని ఫొటోలను కూడా జోడించడంతో పోలీసు అధికారులకు కోపం వచ్చింది. వివరణ ఇవ్వాలంటూ 36 పేజీల నోటీసును వర్షాకు పంపారు. తాను చేసిన పోస్ట్‌కు బాధ్యత వహిస్తానని, ఇతరులు చేసిన పోస్ట్‌కు తాను బాధ్యత వహించలేనంటూ ఆమె సమాధానం ఇచ్చారు. ఎలాంటి చార్జిషీటు దాఖలు చేయకుండానే ఆమెను విధుల్లో నుంచి సస్పెండ్‌ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement