రికార్డ్ బ్రేక్ చేసిన మీరాకుమార్
న్యూఢిల్లీ: బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ రికార్డు సృష్టించగా.. పరాజయం పాలైన ప్రతిపక్ష కూటమి ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్ యాభై ఏళ్ల చరిత్రను తిరగరాశారు. రామ్‌నాథ్ కోవింద్ 65.65 శాతం ఓట్లు సాధించగా, మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి. కోవింద్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02,044 కాగా.. మీరాకుమార్‌కు పోలైన ఓట్ల విలువ 3,67,314. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి చెందిన వారిలో అత్యధిక ఓట్లు పోలైన అభ్యర్థిగా 50 ఏళ్ల రికార్డును మీరాకుమార్ చెరిపేశారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు పేరిట ఉండేది.
ఓటమిపాలైన వారిలో అత్యధిక ఓట్ల విలువ ఎక్కువ సొంతం చేసుకున్న అభ్యర్థిగా 1967లో కోకా సుబ్బారావు ఈ ఘనత వహించగా, ప్రస్తుత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల ద్వారా ఇప్పుడు మీరాకుమార్ ఆ రికార్డును అధిగమించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన సుబ్బారావు, జాకీర్ హుస్సేన్ చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే అప్పుడు జాకీర్‌కు పోలైన ఓట్ల విలువ 4.7 లక్షలు కాగా, సుబ్బారావు ఓట్ల విలువ 3.63లక్షలు. అయితే అప్పటినుంచి జరుగుతున్న ఏ రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఓటమిపాలైన అభ్యర్థికి 3.63 లక్షల కంటే ఎక్కువ ఓట్ల విలువ రాలేదు. ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమిపాలైన మీరాకుమార్ ఓట్ల విలువ 3.67 లక్షలు. దీంతో మీరాకుమార్, 1967లో సుబ్బారావు నెలకొల్పిన అత్యధిక ఓట్ల విలువను అధిగమించినట్లయింది. మరోవైపు ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.