భారత రాష్ట్రపతి కోవిందుడు | Ram Nath Kovind is 14th President of India | Sakshi
Sakshi News home page

భారత రాష్ట్రపతి కోవిందుడు

Published Fri, Jul 21 2017 4:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

భారత రాష్ట్రపతి కోవిందుడు - Sakshi

భారత రాష్ట్రపతి కోవిందుడు

భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి
కొత్త రాష్ట్రపతికి అభినందనల వెల్లువ ∙
25న ప్రమాణ స్వీకారం


అందరూ ఊహించినట్టుగానే దేశ ప్రథమ పౌరుడిగా రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎన్నికయ్యారు. బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లలో 65.65 శాతం ఓట్లతో రామ్‌నాథ్‌ విజయ దుందుభి మోగించగా.. విపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌కు 34.35 శాతం ఓట్లు దక్కాయి. ఈ నెల 25న 14వ రాష్ట్రపతిగా రామ్‌నాథ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన విజయంపట్ల ప్రధాని మోదీతోపాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తంచేశారు. బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్‌ కలాం, ప్రణబ్‌ ముఖర్జీ వంటి గొప్పవాళ్ల బాటలో బాధ్యతాయుతంగా నడుస్తానని రామ్‌నాథ్‌ పేర్కొన్నారు.

దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు రాజ్యాంగాన్ని కాపాడుతూ.. పదవి గౌరవాన్ని పెంచేందుకు కృషిచేస్తా. వ్యవసాయ పనులు చేసేవారు, సాయంత్రం భోజనం కోసం పగలంతా చెమటచుక్క చిందించే నాలాంటి కోవిందులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ నెనొక్కటే చెప్పదలచుకున్నాను. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను మీ ప్రతినిధిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్నా.    
– రామ్‌నాథ్‌

న్యూఢిల్లీ: అనుకున్నట్లుగా భారత 14వ రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ (71) ఎన్నికయ్యారు. మొదట్నుంచీ అనుకున్నట్లుగానే గురువారం జరిగిన ఎలక్టోరల్‌ కాలేజీ కౌంటింగ్‌లో 65.65 శాతం ఓట్లతో కోవింద్‌ ఘన విజయం సాధించారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ను ఓడించిన రామ్‌నాథ్‌ మొత్తం ఎలక్టోరల్‌ కాలేజీలో నమోదైన ఓట్లలో 65.5 శాతం ఓట్లు సాధించారు. మీరాకుమార్‌కు 34.35 శాతం ఓట్లు దక్కాయి. కోవింద్‌కు మొత్తం 2,930 ఓట్లు రాగా ఆయనకు లభించిన మొత్తం ఓట్ల విలువ (వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు ఓటు విలువ ఆధారంగా) ఎలక్టోరల్‌ కాలేజీలో 7,02,044. మీరాకుమార్‌ 1,844 ఓట్లు గెలుచుకోగా వీటి విలువ 3,67,314 (34.35 శాతం).

బీజేపీ తరఫున విజయం సాధించిన తొలి రాష్ట్రపతిగా, దేశ అత్యున్నత పదవి అందుకున్న రెండో దళితుడిగా కోవింద్‌ రికార్డు నెలకొల్పారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి ఒక్క ఓటు కూడా రాకపోవటం గమనా ర్హం. జూలై 25న రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ ముఖర్జీ వారసుడిగా కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, పలురాష్ట్రాల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. చాలాచోట్ల విపక్షాల సభ్యులూ కోవింద్‌కే ఓటేశారు. ఫలితాలు వెల్లడైన అనంతరం లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా.. 10 అక్బర్‌ రోడ్డులోని రామ్‌నాథ్‌ కోవింద్‌ తాత్కాలిక నివాసానికి వెళ్లి ఎన్నిక పత్రాన్ని అందజేశారు.

అభినందనల పర్వం: ‘నేను రాష్ట్రపతి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. చిత్తశుద్ధితో పనిచేసేవారికి ఇదో మంచి సందేశాన్నిస్తుంది. రాష్ట్రపతిగా నేను విజయం సాధించటం భారత ప్రజాస్వామ్య గొప్పదనానికి నిదర్శనం. చాలా ఉద్విగ్నతకు లోనయ్యాను’ అని విజయం అనంతరం కోవింద్‌ పేర్కొన్నారు. ఈ భారీ విజయంతో ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులంతా రామ్‌నాథ్‌ను అభినందనలతో ముంచెత్తారు. ‘రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌కు శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం ఫలప్రదంగా, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని మోదీ పేర్కొన్నారు.

మీరాకుమార్‌ను కూడా మోదీ అభినందించారు. ‘ప్రజాస్వామ్య స్ఫూర్తి, విలువలతో మీరు ప్రచారం చేసిన తీరు మా అందరికీ మీరు గర్వకారణం’ అని మోదీ పేర్కొన్నారు. కోవింద్‌ విజయంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక విజయమన్నారు. ‘పేదల విజ యమిది. బడుగు, బలహీన వర్గాల ఆశలు, ఆకాంక్షల విజయమిది’ అని షా తెలిపారు. కోవింద్‌ను ఆయన ప్రత్యర్థి మీరాకుమార్‌ అభినందించారు. ‘ఈ విపత్కర పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత మీపై ఉంది’ అని కోవింద్‌కు రాసిన లేఖలో ఆమె పేర్కొన్నారు. లౌకికవాదం, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవటంలో తన పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.

పార్లమెంటే నిర్ణయాత్మకం
పార్లమెంటు ఉభయసభల్లో మొత్తం 768 ఎంపీలు (99శాతం పోలింగ్‌ జరిగింది) ఓటేయగా.. ఇందులో 21 ఓట్లు చెల్లలేదు. మొత్తం 747 ఓట్లలో కోవింద్‌కు 522 మంది ఎంపీల మద్దతు (3,69,576 ఓట్ల విలువ) లభించగా మీరాకుమార్‌కు 225 ఓట్లు (1,59, 300)వచ్చాయి. పార్లమెంటులో పోలైన ఓట్లలో చెల్లనివి తొలగించగా వచ్చిన మొత్తం 5,28,876 ఓట్ల విలువలో కోవింద్‌ 69.87 శాతం ఓట్లు సంపాదించారు. ఇదే ఆయన భారీ విజయాన్ని దాదాపు ఖరారు చేసింది.

ఆ తర్వాత రాష్ట్రాల వారీగా జరిగిన కౌంటింగ్‌లోనూ పలుచోట్ల (హిమాచల్‌ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, ఢిల్లీ) మినహా కోవింద్‌ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబరిచారు. కాగా బీజేపీ వర్గాల ప్రకారం ఢిల్లీ, గుజరాత్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో స్వల్పంగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్లు తెలిసింది. ఈ ఓట్ల మద్దతు కూడా కోవింద్‌కే లభించింది. ఫలితాలు వెలువడగానే కోవింద్‌ సొంత గ్రామమైన యూపీలోని కాన్పూర్‌ జిల్లా కల్యాణ్‌పూర్‌ గ్రామంలో సంబరాలు అంబరాన్నంటాయి.

 ఈ ఏడాది ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించటం ఎలక్టోరల్‌ కాలేజీలో బీజేపీ అధిపత్యం పెరిగేందుకు తోడ్పడింది. అయితే ఎన్డీయే కూటమి సొంతగా కోవింద్‌ను గెలిపించుకునేందుకు బలం లేకపోవటంతో బీజేపీ ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌ ఏఐఏడీఎంకే, జేడీయూ పార్టీల సాయం కోరింది. ఈ పార్టీలన్నీ కోవింద్‌కు మద్దతు ప్రకటించాయి. దీంతోపాటుగా విపక్ష కూటమిలోని జేడీయూ కూడా మాజీ బిహార్‌ గవర్నర్‌కు మద్దతు తెలిపింది.

ఇవీ చెల్లని ఓట్లు!
పార్లమెంటు సభ్యులతోపాటుగా వివిధ రాష్ట్రాల్లోనూ పలువురు ఎమ్మెల్యేల ఓట్లు చెల్లుబాటు కాలేదు. గురువారం జరిగిన కౌంటింగ్‌లో నిబంధనల ప్రకారం లేని ఓట్లను తిరస్కరించినట్లు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా వెల్లడించారు. మొత్తం 77 ఓట్లు చెల్లనివిగా తేలగా అందులో పార్లమెంటు సభ్యులే 21 మంది ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే.. పశ్చిమబెంగాల్‌లో 10, ఢిల్లీలో 6, మణిపూర్, జార్ఖండ్‌లలో నాలుగు చొప్పున, ఉత్తరప్రదేశ్‌లో 2 ఓట్లను తిరస్కరించారు.

మొత్తంగా ఈ చెల్లని ఓట్ల విలువ 20, 942. తొలి ప్రాధాన్యత ఓటును సరిగ్గా మార్క్‌ చేయలేకపోవటం, ఎన్నికల సంఘం సూచించినట్లుగా కాకుండా వేరే రకంగా నెంబర్లు రాయటం వల్ల ఈ ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు. ఈసీ ఇచ్చిన ప్రత్యేక పెన్ను కాకుండా సాధారణ పెన్నుతో మార్కింగ్‌ చేయటం కూడా తిరస్కరణకు ఓ కారణమన్నారు. మొత్తం మీద 77 ఓట్లు చెల్లకపోవటంతో విపక్షాలకు సరిగ్గా ఎంతనష్టం జరిగిందనేది అంచనాలకు అందటం లేదు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క అసెంబ్లీ, పార్లమెంటు సీటు కూడా లేనందున ఆ పార్టీకి ఒక్క ఓటు కూడా దక్కలేదు. మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ అభ్యర్థి కోవింద్‌కే ఓటేశారు. అయితే ఇందులో మూడు ఓట్లు చెల్లలేదు. తెలంగాణలో 117 అసెంబ్లీ ఓట్లలో మీరా కుమార్‌కు 20 ఓట్లు రాగా, కోవింద్‌కు 97 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది.

పారాంఖ్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌కు..
రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌ సౌమ్యుడిగా, పేదల హక్కుల పోరాట యోధుడిగా పేరొందారు. ప్రచారానికి, వివా దాలకు దూరంగా ఉండేవారు. న్యాయవాది వృత్తి నుంచి రాజ్యసభ ఎంపీ, గవర్నర్, రాష్ట్రపతి వరకు ప్రస్థానమిదీ..

దళితుల కోసం: కోవింద్‌ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ దేహాత్‌ జిల్లా దేరాపూర్‌ తాలూకా పారాంఖ్‌ గ్రామంలో 1945 అక్టోబర్‌ 1న దళిత(ఎస్సీ) కోలీ కుటుంబంలో జన్మించారు. కాన్పూర్‌ వర్సిటీ నుంచి బీకాం, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1971లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. 1977–79 మధ్య ఢిల్లీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షల్లో మూడో యత్నంలో ఉత్తీర్ణుడైన ఆయన ఐఏఎస్‌ రాకపోవడంతో న్యాయవాద వృత్తికే అంకితమయ్యారు. 1977 నుంచి కొంతకాలం జనతా పార్టీకి చెందిన అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఆర్థిక శాఖ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు.

రైతు కుటుంబంలో పుట్టిన కోవింద్‌కు 1974 మే 30న సవితతో పెళ్లయింది. వారి సంతానం ప్రశాంత కుమార్, స్వాతి.రాజకీయాల్లో..: ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమున్న కోవింద్‌ కమలదళానికి అత్యంత విధేయుడు.యూపీ రాజకీయాల్లో ఆయనకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సన్నిహితుడు. కోవింద్‌ తొలిసారి 1991 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని ఎస్సీ రిజర్వ్‌డ్‌ సీటు ఘాటంపూర్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 1994, 2006లో బీజేపీ తరఫున రెండు పర్యాయాలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998–2002 మధ్య బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు.

నాలాంటి చాలా మంది కోవిందులున్నారు!
విజయంపై ఉద్విగ్నంగా స్పందించిన రామ్‌నాథ్‌
న్యూఢిల్లీ: ‘దేశ అత్యున్నత పదవికి ఎంపిక చేసినందుకు రాజ్యాంగాన్ని కాపాడుతూ.. పదవి గౌరవాన్ని కాపాడేందుకు కృషిచేస్తా’న నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన రామ్‌నాథ్‌ కోవింద్‌ పేర్కొన్నారు. గురువారం ఫలితాలు వెల్లైడన తర్వాత ఆయన మాట్లాడుతూ.. ‘నాకు వ్యక్తిగతంగా ఇది చాలా ఉద్విగ్నమైన క్షణం. ఢిల్లీలో భారీ వర్షాలు పడుతున్నపుడు మా సొంతూళ్లోని కచ్చా ఇంట్లో ఉన్న రోజులు గుర్తొస్తాయి. ఇల్లంతా ఊరుస్తుంటే.. అన్నాదమ్ములతో కలిసి గోడకు ఆనుకుని నిలబడే వాళ్లం. వాన ఎప్పుడు ఆగుతుందా అని ఎదురుచూసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.

దేశం కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తూ అందరినీ సంతోషంగా ఉంచేందుకు కృషిచేస్తానని కోవింద్‌ వెల్లడించారు. ‘అలాంటి ఇళ్లలో ఉన్నవారు, వ్యవసాయ పనులు చేసేవారు, సాయంత్రం భోజనం కోసం పగలంతా చెమటచుక్క చిందించే నాలాంటి కోవిందులు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారందరికీ నెనొక్కటే చెప్పదలచుకున్నాను. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను మీ ప్రతినిధిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్నాను’ అని ఉద్విగ్నంగా కోవింద్‌ పేర్కొన్నారు. తనలాగా నిజాయితీగా పనిచేసేవారికి ఎప్పటికైనా సరైన అవకాశాలు దక్కుతాయనే సందేశాన్ని ఈ విజయం మరోసారి గుర్తుచేసిందన్నారాయన.

రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, ఏపీజే అబ్దుల్‌ కలాం, ప్రణబ్‌ ముఖర్జీ వంటి గొప్పవాళ్లు చూపిన బాటలోనే బాధ్యతాయుతంగా నడుస్తానన్నారు. తనపై నమ్మకముంచిన ప్రజలకు, తనపై నమ్మకముంచి ఓటేసి గెలిపించిన ప్రజాప్రతినిధులకు కోవింద్‌ ధన్యవాదాలు తెలిపారు. తను రాష్ట్రపతి అవుతానని ఎప్పుడూ అనుకోలేదని.. ఈ విజయం దేశం, సమాజం కోసం చేసిన అవిశ్రాంత కృషికి దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాన్నారు.

తొలి బీజేపీ రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టబోతున్న తొలి బీజేపీ నాయకుడుగా రామ్‌నాథ్‌ కోవింద్‌ రికార్డు సృష్టించారు. రాష్ట్రపతిగా తమ పార్టీ నుంచి తొలిసారి ఒక దళితుడు ఎన్నికకావడం తమకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. గతంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ తరఫున దివంగత ఏపీజే అబ్దుల్‌ కలాం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే అప్పటికి కలాంకి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. 2007లో అప్పటి ఉపరాష్ట్రపతి బైరాన్‌ సింగ్‌ షెకావత్‌ను తమ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది.

 అయితే ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో యూపీఏ అభ్యర్థి ప్రతిభాపాటేల్‌ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక 2012లో లోక్‌సభ మాజీ స్పీకర్‌ ఏపీ సంగ్మాకు బీజేపీ మద్దతునివ్వగా యూపీఏ అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ చేతిలో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి బీజేపీ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మెజారిటీ ఓట్లు రావడమే కాకుండా బీజేడీ, జేడీయూ లాంటి ప్రత్యర్థులు సైతం కోవింద్‌కు మద్దతు ఇచ్చారు.  

విపక్ష సభ్యుల క్రాస్‌ ఓటింగ్‌
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పలుచోట్ల క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.
గురువారం జరిగిన కౌంటింగ్‌లో ఈ విషయం సుస్పష్టమైంది. చాలాచోట్ల విపక్ష పార్టీల సభ్యులు ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలిపారు. గుజరాత్‌లో కోవింద్‌కు మద్దతుగా 132 మంది ఓటేయగా మీరాకుమార్‌కు 49 ఓట్లు వచ్చాయి. గుజరాత్‌ అసెంబ్లీలో అధికార బీజేపీకి 121 స్థానాలున్నాయి.

అటు గోవాలోనూ కాంగ్రెస్‌కు 16 మంది ఎమ్మెల్యేలుండగా మీరాకుమార్‌కు 11 ఓట్లు దక్కాయి. మహారాష్ట్రలోనూ 13 మంది విపక్ష సభ్యులు కోవింద్‌కు మద్దతుగా ఓటేశారు. మధ్యప్రదేశ్‌ ఆరుగురు,  ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు, జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు, హరియాణాలో నలుగురు, ఉత్తరప్రదేశ్‌లో 11మంది, కర్ణాటక 8మంది, హిమాచల్‌ ప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు, అస్సాంలో ముగ్గురు, పంజాబ్‌లో ఇద్దరు, ఢిల్లీలో ఇద్దరు క్రాస్‌ఓటింగ్‌కు పాల్పడినట్లు స్పష్టమైంది.

రాష్ట్రాల వారీగా ఆధిక్యం
న్యూఢిల్లీ: పెద్ద రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్‌ నుంచి రామ్‌నాథ్‌ కోవింద్‌ అత్యధిక ఓట్లు సాధించగా.. తృణమూల్‌ పాలిత పశ్చిమ బెంగాల్‌లో ఆయనకు అతి తక్కువగా 11 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సమాచారం మేరకు .. పోలైన ఓట్లలో 4,774 (10,69,358 ఎలక్టోరల్‌ ఓట్లు) చెల్లుబాటు కాగా.. కోవింద్‌ మొత్తం 2,930(7,02,044) లేదా 65.65 శాతం ఓట్లు సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరాకుమార్‌కు 1,844 ఓట్లు (3,67,314 ఎలక్టోరల్‌) లేదా 34.35 శాతం ఓట్లు పోలయ్యాయి.






ఢిల్లీలో భార్య సవితతో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందుకుంటూ నవ్వులు చిందిస్తున్న రామ్‌నాథ్‌

అభినందనలు
రాష్ట్రపతిగా ఎన్నికైన కోవింద్‌కు శుభాకాంక్షలు. ఆయన పదవీకాలం ఫలవంతంగా, స్ఫూర్తిని నింపేలా ఉండాలని కోరుకుంటున్నా. రామ్‌నాథ్‌ను గెలిపించిన ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులకు కృతజ్ఞతలు.    
నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

కోవింద్‌కు అభినందనలు. సవాళ్లతో కూడుకున్న ప్రస్తుత సమయంలో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది.
 – మీరా కుమార్, విపక్షాల అభ్యర్థి

ఈ విజయం చరిత్రాత్మకం. పేద, అట్టడుగు, నిమ్న వర్గాలకు, వారి అభిలాషలకు లభించిన విజయమిది.     
– అమిత్‌ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు

చాలా తక్కువ స్థాయిలో మొదలుపెట్టి దేశ అత్యున్నత పదవిని చేపట్టే స్థాయికి కోవింద్‌ ఎదిగారు. ప్రజాస్వామ్య గొప్పతనాన్ని ఇది తెలియజేస్తోంది. ఆయన ఆదర్శ రాష్ట్రపతి అవుతారని నాకు అనిపిస్తోంది.
– వెంకయ్య నాయుడు, ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి

రామ్‌నాథ్‌కు అభినందనలు. రాజ్యాంగ సంరక్షకుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, త్రివిధ దళాధిపతిగా భారత రాష్ట్రపతి పాత్ర అద్వితీయమైనది.
– సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత్రి

కోవింద్‌ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాం. ప్రజాస్వామ్య, ఫెడరల్‌ స్ఫూర్తిని కొనసాగించడంలో ఆయన సంపూర్ణ విజయం సాధించాలి.     
– కేసీఆర్, తెలంగాణ సీఎం

కోవింద్‌ వంటి మృదుస్వభావి, అనుభవశాలి, చదువుకున్న వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావడం మంచి పరిణామం.    
 – చంద్రబాబు, ఏపీ సీఎం

ఉన్నతమైన నైతిక ప్రమాణాలు, విలువలు గల వ్యక్తి కోవింద్‌. ప్రజా జీవితంలో కోవింద్‌కు ఉన్న అపారమైన అనుభవం రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవికి అలంకారం తేగలదు.
–వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు






20 ఏళ్ల క్రితం కోవింద్‌ కుటుంబ సభ్యులతో తాను దిగిన ఫొటోను, ఇటీవల మళ్లీ వారితోనే తానుదిగిన ఫొటోను మోదీ ట్విటర్‌లో పోస్ట్‌చేశారు. ఆ ఫొటోలివి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement