సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికల నగారా మోగింది. ఆగస్టు 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరుగుతాయని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఈ నెల 8 సాయంత్రంలోగా నామినేషన్ పత్రాలు సమర్పించాలని తెలిపారు. ఇప్పటివరకూ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న పీజే కురియన్ పదవీకాలం జూన్ 1న ముగిసిపోవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ రాజ్యసభ సభ్యుడు, ప్రభాత్ ఖబర్ హిందీ పత్రిక ఎడిటర్ హరివంశ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ఎన్నికల తేదీల్ని వెంకయ్య ప్రకటించిన కొద్దిసేపటికే ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు ప్రాంగణంలోని కాంగ్రెస్ నేత ఆజాద్ చాంబర్‌లో భేటీఅయ్యాయి. తర్వాత డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసుకోవాలన్న అంశంపై చర్చించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం డీఎంకేకు చెందిన తిరుచ్చి శివ, ఎన్సీపీ నేత వందన చవాన్, నామినేటెడ్ సభ్యుడు కేసీ తుల్సీ ప్రతిపక్షాల అభ్యర్థిగా ముందువరుసలో ఉన్నారు. మిత్రపక్షాల్లో ఎవరు అభ్యర్థిని నిలబెట్టినా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
సభలో బలాబలాలెంత: ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్‌ఎస్(6), వైఎస్సార్‌సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి.
Comments
Please login to add a commentAdd a comment