కాంగ్రెస్ కీలక నేతల్లో...ఊగిసలాట
*ప్రత్యామ్నాయం వైపు చూపు
*ఉనికి కోసం తహతహ
*సీటు హామీ కోసం ముమ్మర యత్నాలు
*వైఎస్సార్‌సీపీలో చేరికకు విఫలయత్నం
*టీడీపీలోకి బుద్ధప్రసాద్, పిన్నమనేని!
*బాడిగ, వ్యాస్, సారథి ఎటు?
కాంగ్రెస్ నేతల పార్టీ ఫిరాయింపులపై పూటకో ప్రచారం.. రోజుకో పుకారు షికార్లు చేస్తున్నాయి. ఆయా నేతలు మాత్రం ఎటూ తేల్చుకోలేని గందరగోళ స్థితిలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోవడంతో అందులో నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయాయని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్‌లో ఉండి ఉనికి కోల్పోవడం కంటే పార్టీ ఫిరాయించి పదవుల కోసం అదృష్ట పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన నేతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో వాళ్లు కచ్చితంగా పొరుగు పార్టీలకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. దాదాపు రెండు నెలల కాలంగా వాళ్లు ఫలానా పార్టీలో చేరుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయినా కీలక నేతలు మాత్రం పార్టీ మారేందుకు డీల్ కుదరలేదో.. స్పష్టమైన హామీ దక్కలేదో.. ముహూర్తం కుదరలేదో మరి. కారణం ఏదైనా జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వంటి కీలక నేతలు సీటు హామీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వినికిడి.
జిల్లాలో రాజకీయ అయోమయం...
ఇప్పటికే వైఎస్సార్‌సీపీలో చేరేందుకు విఫలయత్నం చేసిన జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పలువురు మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వ్యాపించడంతో జిల్లాలో రాజకీయ అయోమయం నెలకొంది. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ బందరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నదీ మాత్రం ప్రకటించలేదు.
కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్టంలేని బాడిగ ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చిన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బూరగడ్డ వేదవ్యాస్ సైతం పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతానికి రాజకీయ సమీకరణలు చేసుకుంటున్నారు. వ్యాస్ ఆ పార్టీలో చేరుతున్నారని.. కాదు ఈ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది.
మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. సారథి తనదైన శైలిలో అక్కడ 20 వార్డుల్లోనూ సొంత ప్యానల్‌ను పెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉండే అవకాశం లేదని, పార్టీ మారతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది.
బుద్ధప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం?
కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన బుద్ధప్రసాద్‌కు ముసుగు తొలగిపోనుంది. రాజకీయ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు చేసిన మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. గతం నుంచి బుద్ధప్రసాద్ వెంట నడిచిన అభిమానులు, కార్యకర్తలు ఆయన నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు.
దీంతో కార్యకర్తలకు సర్దిచెప్పేందుకు ఆయన ఈ నెల 26న అవనిగడ్డ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 27న అవనిగడ్డ నుంచి ర్యాలీగా విజయవాడ వెళ్లి అక్కడ జరిగే మహిళా గర్జన సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.
కేడీసీపీ బ్యాంక్ చైర్మన్ అయిన తొలినాళ్లలోనే ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పిన్నమనేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు సభకు పిన్నమనేని వెళతారని.. అక్కడ మాజీ సీఎం కిరణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి దూరంగానే ఉన్న పిన్నమనేని కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.