Buddha Prasad
-
పచ్చ దళం.. ధిక్కార ‘గళం’
అవనిగడ్డ/చీరాల/బి.కొత్తకోట/సాక్షి అమలాపురం: ప్రజాగళం అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు బయలుదేరిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి సొంత పార్టీలోనే ధిక్కార గళం వినిపిస్తోంది. పార్టీలో చెలరేగిన టికెట్ల రగడ ఇంకా చల్లారలేదు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్లు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అధినేతకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌కు సీటివ్వకుంటే పార్టీ సభ్యత్వాలకు, సర్పంచ్ పదవులకు రాజీనామా చేస్తామని పలువురు టీడీపీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో బుధవారం టీడీపీ మద్దతుదారులైన సర్పంచ్‌లు సమావేశమయ్యారు. బుద్ధప్రసాద్‌కు అన్యాయం చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ► చీరాల టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య అభ్యర్థిత్వాన్ని సొంత పార్టీలోని చేనేత నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు ఓటెయ్యొద్దని ఇంటింటికీ తిరిగి ప్రచారమూ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో పొన్నలూరు ప్రాంతానికి చెందిన కొండయ్య చీరాలకు వచ్చి చేనేత నాయకులను బహిరంగంగా దూషించి అవమానించడమే దీనికి కారణమని చేనేత నాయకులు ఆరోపిస్తున్నారు. పొన్నూరు మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సజ్జా హేమలత, టీడీపీ నేత చాట్రాసి రాజేష్ వేర్వేరుగా కొండయ్యకు ఓటెయ్యొద్దంటూ ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరుడికి టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేతలకు ఎక్కడా సీటు ఇవ్వకుండా చంద్రబాబు తమను మోసం చేశారని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర నాయకుడు అన్నగుండ ఆదినారాయణ మరి కొందరు రాష్ట్ర నాయకులు ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేతల ఓట్లు 40 లక్షలు ఉన్నాయని, తమ సత్తా టీడీపీకి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ► తంబళ్లపల్లె టీడీపీ టికెట్ వ్యవహారం మళ్లీ మొదటికొచి్చంది. గతనెల 24న టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించినా రాజకీయాలకు సంబంధం లేని ఆయనను అభ్యర్థిగా ఎలా పెడతారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్, పార్టీ నేతలు కొండా నరేంద్ర తదితరుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. దీంతో పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, శంకరయాదవ్, మధుసూదన్‌రెడ్డి తదితరుల పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్నారు. ఫలితంగా క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే బీజేపీ కొత్తగా రాజంపేట, తంబళ్లపల్లెలో ఒకదానిని బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న దృష్ట్యా తంబళ్లపల్లెను ఆ పార్టీకి ఇచ్చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ► అమలాపురం అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు గెలుపు సాధ్యం కాదనే వాదన సొంత పార్టీలోనే వ్యక్తమవుతోంది. గత ఎన్నికలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్లు క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీడీపీ ఆఫీసులో జనసేన చేరికలు విశాఖ నగర టీడీపీ కార్యాలయంలో జనసేన పార్టీ చేరికల కార్యక్రమం నిర్వహిస్తున్న దక్షిణ అభ్యర్థి వంశీకృష్ణ సాక్షి, విశాఖపట్నం: విశాఖ దక్షిణం నియోజకవర్గంలో బుధవారం ఓ విచిత్రం చోటు చేసుకుంది. ఇక్కడ జనసేనకు సొంత కార్యాలయం లేకపోవడంతో చేరికల కార్యక్రమాన్ని నగర టీడీపీ కార్యాలయంలో జనసేన అభ్యర్థి చేపట్టారు. ఈ సీటును జనసేన నుంచి ఇద్దరు కార్పొరేటర్లు, మరో నాయకుడు ఆశించారు. అయితే వారిని కాదని వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన వంశీకృష్ణ శ్రీనివాస్‌కు పవన్ సీటు ఇచ్చారు. దీంతో జనసేన నేతలు రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. ఈ గందరగోళంలో పార్టీ కార్యాలయ ఏర్పాటును నేతలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో బుధవారం జనసేనలో ఓ నలుగురు చేరడానికి రావడంతో అభ్యర్థి వంశీకృష్ణ నగరంలోని టీడీపీ కార్యాలయంలో చేరికల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పరిణామానికి విస్తుపోయిన టీడీపీ శ్రేణులు తమ కార్యాలయం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
టీడీపీ బుద్ధ ప్రసాద్ ఆవేదన
-
3న ఎస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు
ఎంతమంది నటీనటులు ఉన్నా ‘విశ్వ నట చక్రవర్తి’ ఒక్కరే. వెండితెర విలక్షణ నటునిగా సినీ పరిశ్రమతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులందరూ బ్రహ్మరథం పట్టిన ఆ మహానటుడు యస్వీ రంగారావు. 1918 జూలై 3న ఆయన జన్మించారు. జూలై 3వ తేదీకి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ‘సంగమం’ సంస్థ ఆధ్వర్యంలో యస్వీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ‘సంగమం’ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షులు, సినీ పరిశోధకులు సంజయ్ కిశోర్ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జూలై 3న సాయంత్రం 5 గంటలకు ఎస్వీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్నాం. మండలి బుద్ధప్రసాద్‌గారు, కె.వి.రమణాచారిగార్ల నేతృత్వంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలకు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుగారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. యస్వీఆర్తో కలిసి నటించిన వారితో పాటు తర్వాత కాలంలో పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులను సత్కరిస్తున్నాం’’ అన్నారు. -
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం
- రూ.1.50 కోట్లతో భవన నిర్మాణానికి చర్యలు - ఘంటసాల ఉపయోగించిన వస్తువులు ఇచ్చేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు - తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు - ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ(కృష్ణా జిల్లా): విజయవాడలో రూ.1.50 కోట్లతో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట స్మారక మ్యూజియంను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపసభాపతి, తెలుగు భాషాభివృద్ధి అధ్యన కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఉపసభాపతి కార్యాలయం నందు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు కలిసి ఈనెల 19, 20 తేదీల్లో తమిళనాడులో పర్యటించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గృహానికి వెళ్లి ఘంటసాల వస్తువులను పరిశీలించి మ్యూజియం ఏర్పాటు విషయం ప్రస్తావించగా వారు అంగీకరించినట్టు చెప్పారు. ఘంటసాల వాడిన కళ్లజోడు, తంబుర, కుర్చీ, చెప్పులతో పాటు సంగీత పరికరాలు, 2వేలు గ్రాం ఫోన్ రికార్డులు మ్యూజియంకు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు బుద్ధప్రసాద్ వెల్లడించారు. విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, రూ.1.5 కోట్లతో నిర్మించే ఈ మ్యూజియం పనులు వీలైనంత త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో తమిళభాష పట్ల ప్రజలు ఎంతో మక్కువ చూపుతారని చెప్పారు. అక్కడ భాషాభివృద్ధికి తమిళ సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయని తెలిపారు. తమిళభాషను పరాయివాళ్లకు నేర్పించేందుకు 20వేల మంది పనిచేస్తున్నారని తెలుగును ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన తెలుగు భాషాభిమానులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు రూపకల్పన చేస్తామన్నారు. -
శాసనసభా వ్యవహారాలపై బుద్ధప్రసాద్ కమిటీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా డిసెంబర్ 22వ తేదీన సభలో సభ్యుల ప్రస్తావించిన పలు అంశాలపై ఓ కమిటీని నియమించారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. టీడీపీ సభ్యుడు శ్రవణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ సభ్యుడు జి.శ్రీకాంత్ రెడ్డి, బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రధానంగా ఈ కింది అంశాలపై పరిశీలన జరుపుతుంది సభా కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో టేపులు సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయో విచారిస్తుంది. అసెంబ్లీ ఐదో, ఆరో సమావేశాల ఆడియో వీడియో టేపులను పరిశీలించి, సభలో సభ్యుల ప్రవర్తన, సభలోనే స్పీకర్ మీద వ్యాఖ్యలు తదితర అంశాలను పరిశీలిస్తుంది ఇకమీదట సభా నిర్వహణ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలను సూచిస్తుంది కమిటీ తొలిసారి సమావేశమైన తర్వాత 20 రోజుల్లోగా తన పరిశీలనలు, సూచనలు, ప్రతిపాదనలను స్పీకర్‌కు సమర్పించాలి. కమిటీ గడువు కూడా తొలి సమావేశం జరిగినప్పటి నుంచి 20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. -
కాపులు ధర్మాన్ని గెలిపించారు
మండలి బుద్ధ ప్రసాద్ తిరుచానూరు : తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు, బలిజలు ధర్మాన్ని గెలిపించారని రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తెలిపారు. తిరుపతి బలిజ ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో కాపు ప్రజాప్రతినిధులకు అభినందన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి 13 జిల్లాల నుంచి పలువురు కాపు కులానికి చెందిన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ, తిరుపతి బలిజ జేఏసీ నాయకుడు వూకా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండలి బుద్ధప్రసాద్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ధర్మపరులైన కాపులు ధర్మాన్ని గెలిపించారన్నారు. కర్ణుడు కవచ కుండలాలతో జన్మించాడని, కాపులు నీతినిజాయితీ అనే కవచ కుండలాలతో పుట్టారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కాపు ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ కాపులను బీసీ జాబితాలో చేర్చినప్పుడే తమ కులం సంతోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నాయే తప్ప న్యాయం చేయలేదన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో చేర్చినంత మాత్రాన ఇప్పుడున్న బీసీలకు రిజర్వేషన్లలో ఎటువంటి అన్యాయం జరగదని వారు స్పష్టం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కాపు కులస్తుడైన చిరంజీవిని కలిస్తే, ఆయన స్పర్శ తగిలితే చాలు జీవితం ధన్యం అవుతుందనుకున్న కాపులను ఆయన నమ్మించి మోసం చేశారని గుర్తు చేశారు. అంతకుముందు మాజీ ఎంపీ డీకే.ఆదికేశవుల నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాప్రతినిధులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బడేటికోట రామారావు(ఏలూరు), కే.అప్పలనాయుడు(గజపతినగరం), పి.నారాయణస్వామినాయుడు(నెల్లిమర్ల), మీసాల గీత(విజయనగరం), పి.రమేష్‌బాబు(ఎలమంచిలి), డీకే.సత్యప్రభ(చిత్తూరు), కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, చిత్తూరు కార్పొరేషన్ మేయర్ కటారి అనురాధ, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, డాక్టర్ ఆశాలత, కోలా ఆనంద్ పాల్గొన్నారు. -
ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్?
సోమవారం ప్రకటించనున్న సభాపతి కోడెల సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ దాఖలు గడువు ముగిసేనాటికి ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయటంతో ఉప సభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు సోమవారం (23వ తేదీ) సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించనున్నారు. మండలి గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా, అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి అవనిగడ్డ నుంచి విజయం సాధించారు. జగన్‌కు యనమల ఫోన్: ఉప సభాపతి ఎన్నిక వ్యవహారంపై శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. సమయాభావం వల్ల నామినేషన్ వేయడానికి ముందే ఉప సభాపతి ఎంపికపై సమాచారం ఇవ్వలేకపోయామని, ఎన్నిక ఏక గ్రీవానికి సహకరించాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. చీఫ్ విప్‌గా కాలువ, విప్‌లుగా నలుగురు: ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితోపాటు శాసనసభ సచివాలయానికి అందచేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీరి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. చీఫ్‌విప్‌గా అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు, విప్‌లుగా చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), కూన రవికుమార్ (ఆముదాల వలస), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), యామినీబాల (శింగనమల)లను ఎంపిక చేశారు. -
జిల్లాకు మరో కీలక పదవి
డెప్యూటీ స్పీకర్‌గా బుద్ధప్రసాద్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బుద్ధప్రసాద్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. టీడీ పీలో సీనియర్ నేత, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు కూడా మరో కీలక పదవి దక్కవచ్చని ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదీ బుద్ధప్రసాద్ రాజకీయ ప్రస్థానం.. మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు తనయుడిగా బుద్ధప్రసాద్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఆయన 1977-85లో జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బుద్ధప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన్ను 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. బుద్ధప్రసాద్‌కు పదవి లభించడంతో టీడీపీ అధ్యక్షుడు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది. -
వ్యవసాయం దండగని..
సాక్షి, విజయవాడ : వ్యవసాయం దండగన్న చంద్రబాబునాయుడుకి ప్రజలు తనను రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోపెట్టేసరికి రైతుల పట్ల ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందనే విమర్శలొస్తున్నాయి. తమ జీవితాలు బుగ్గిపాలు కావడానికి చంద్రబాబు నాయుడే కారణమన్న కోపం రైతుల్లో ఇంకా చల్లారలేదు. చంద్రబాబు పాలనలో సాగునీటి కోసం రైతన్న రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. డెల్టా పరిరక్షణ వేదిక పేరుతో రైతులు ఉద్యమం చేయాల్సివచ్చింది. అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తన స్వార్థం కోసం తెలుగుదేశంలో చేరినంత మాత్రాన రైతులంతా ఆయన పక్కన వెళ్లే అవకాశం లేదని ఇతర నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల వల్లే రైతాంగం నేడు ఈ దుస్థితిని అనుభవిస్తోందని చెబుతున్నారు. రైతుల ఆత్మహత్యలకు కారణం.. రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థను దెబ్బతీసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందనేది రైతుల వాదన. 1993లో తుఫాన్ వచ్చిన సందర్భంలో తడిసిన, తేమ ఉన్న రకాలకు ఇంత చొప్పున చెల్లించాలంటూ కనీస మద్దతు ధరలో కోత పెట్టే విధానాన్ని చంద్రబాబునాయుడే ప్రారంభించారు. దీనివల్ల అందరు రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు సమయంలో రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో 2003లో రైతుసంఘం నేతలు ధాన్యాన్ని ఎడ్లబండ్లపై కట్టుకువచ్చి కృష్ణానదిలో పారబోయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. వ్యవసాయానికి విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వాలంటూ ఉద్యమించిన కాల్దారీ రైతులపై కాల్పులు జరిపించిన ఘనత కూడా చంద్రబాబుదే. వ్యవసాయంలో నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులే వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి డెల్టాలో రైతులు ఆడంబరాలకు పోయి అప్పుల పాలవుతున్నారంటూ వారిని కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి రైతాంగం ఇంకా మర్చిపోలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి... జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. 15 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు కోసం శంఖుస్థాపన రాయి వేసి, జగ్గయ్యపేటలో పులిచింతల ఇరిగేషన్ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత పులిచింతల ఇరిగేషన్ సర్కిల్‌ను కూడా ఎత్తివేసి పులిచింతల ప్రాజెక్టును చెత్తబుట్టలో పడేశారు. వ్యవసాయ శాఖ కుదింపు... ఇప్పుడు వ్యవసాయంపై అత్యంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబు ఈ శాఖను కుదిస్తూ అగ్రీ క్లీనిక్స్‌ను తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ప్రతి వెయ్యి మందికి ఒక వ్యవసాయ అధికారి ఉండాల్సిన పరిస్థితిలో మండలానికి ఒకరిద్దరికి కుదించారు. ఆలస్యంగా సాగునీరు... చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో డెల్టాకు ఏనాడు సరైన సమయానికి సాగునీరు అందించిన దాఖలాలు లేవు. జూన్ 10 నాటికి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా రైతులు ఉద్యమించిన తర్వాత నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉండేది. డెల్టా పరిరక్షణ సమితి నేతృత్వంలో పలు ఉద్యమాలు చంద్రబాబు నాయుడు హాయాంలోనే రైతులు చేయాల్సి వచ్చింది. -
బుద్ధప్రసాద్‌కు ఎదురుగాలి
అవనిగడ్డ బరిలో రెబెల్స్ నామినేషన్లు వేసిన కంఠంనేని, పోసబత్తిన కాంగ్రెస్ నుంచి కలిసిరాని కేడర్ టీడీపీలో వ్యతిరేకత సాక్షి, మచిలీపట్నం : సుదీర్ఘకాలం అవనిగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పిన మండలి బుద్ధప్రసాద్‌కు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. దశాబ్దాల తరబడి రాజకీయ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ఆయన టీడీపీలో చేరడంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను అనుసరించడం లేదు. టీడీపీ కేడర్ ఆయన్ని ఇముడ్చుకోలేకపోతోంది. శనివారం నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి బుద్ధప్రసాద్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్లు వేయగా. కాంగ్రెస్ అభ్యర్థి సైతం బరిలో నిలిచారు. దీంతో అటు పాత పార్టీ, ఇటు కొత్త పార్టీల నుంచి కూడా ఆయనకు శిరోభారం తప్పలేదు. వాడుకుని వదిలేయడంలో అగ్రగణ్యుడైన చంద్రబాబు అవనిగడ్డలో చివరకు బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికల్లో సానుభూతితో ఎమ్మెల్యే పదవిని టీడీపీకి దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లో గెలిచినా ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించలేదనే సంగతి తెల్సిందే. నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావుకు టిక్కెట్ ఆశచూపి అవనిగడ్డ నియోజకవర్గానికి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించారు. చివరకు మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు చంద్రశేఖర్‌కు టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో బుద్ధప్రసాద్ జాగ్రత్త పడ్డారు. ఇటీవలే టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కేడర్ ఆయన్ను ఓడిస్తామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రెబల్స్‌గా బరిలోకి.. మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. తెలుగువన్ ఫౌండేషన్ (హైదరాబాద్) చైర్మన్ కంఠంనేని రవిశంకర్ శనివారం నామినేషన్ వేశారు. 2009 ఎన్నికల్లోనే చంద్రబాబు తనకు టిక్కెట్ ఇస్తానని అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఈసారి కూడా మోసం చేయడంతో రెబల్‌గా నామినేషన్ వేసినట్టు రవిశంకర్ ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా గర్జన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రెయిన్బో వెంచర్స్ అధినేత పోసబత్తిన సాంబశివరావు కూడా రెబల్‌గా నామినేషన్ వేశారు. వీరితోపాటు గతంలో బుద్ధప్రసాద్‌కు మద్దతుగా పనిచేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టీడీపీ శ్రేణులు గరం గరం.. టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌పై ఆ పార్టీ శ్రేణులు గరం గరంగానే ఉన్నాయి. పలువురు టీడీపీ నేతలు బుద్ధప్రసాద్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పర్చూరి దుర్గాప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, యర్రంశెట్టి సీతారామయ్య తదితర కీలక నేతలు బుద్ధప్రసాద్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు విడిచి వచ్చిన కాంగ్రెస్ వాళ్లు వెంటరాక పోగా, ఇటు చేరిన టీడీపీలో కలిసిరాక అవనిగడ్డలో బుద్ధప్రసాద్ పరిస్థితి గడ్డుగా మారింది. -
బుద్ధప్రసాద్‌ను ఓడిస్తాం
వక్కపట్లవారిపాలెం (నాగాయలంక), న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో ఏ కార్యకర్త మనోభావాలను పట్టించుకోకుండా బుద్ధప్రసాద్‌కు టీడీపీ సీటిచ్చిన చంద్రబాబును మేమెందుకు పట్టించుకోవాలని పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగాయలంక మండలంలోని వక్కపట్లవారిపాలెంలో ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఇంటి ఆవరణలో మంగళవారం టీడీపీ కార్యకర్తల అత్యవసర సమావేశం జరిగింది. మండల టీడీపీ అధ్యక్షుడు వర్రే రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత అంబటి శ్రీహరిప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తను అడిగి బుద్ధప్రసాద్‌కు సీటిచ్చారని మేమెందుకు కట్టుబడి ఉండాలని పలువురు కార్యకర్తలు నిలదీశారు. బుద్ధప్రసాద్కైతే మేము పనిచేయమని, వైఎస్సార్సీపీలోకి వెళ్లిపోతామని, ఆయనను ఖచిచతంగా ఓడిస్తామని గ్రామాల్లో కార్యకర్తలంటున్నారని, వారికి మేమేం చెప్పాలని కార్యకర్తలు ప్రశ్నించారు. సీనియర్ నేత పర్రచివర సొసైటీ ప్రెసిడెంట్ భోగాది నరసింహారావు చంద్రబాబు తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం సర్పంచి మెండు లక్ష్మణరావు, ప్రముఖ న్యాయవాది అందే శివరామకృష్ణ ప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, యర్రంశెట్టి సీతారామయ్య, మత్స్యకార నేత సువర్ణరాజు, అవనిగడ్డ అధ్యక్షుడు బచ్చు వెంకటనాధ్ప్రసాద్ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. ఆవేశంగా మాట్లాడిన కొంతమంది కార్యకర్తలు ఒక దశలో పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతామని లేవగా, ఎమ్మెల్యే సర్ధి చెప్పడంతో ఆగారు.కన్నా నాగరాజు, పెద్ది భాస్కరరావు, సజ్జా గోపాలకృష్ణ, తలశిల సాంబశివరావుతో పాటు కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల నుంచి కొంత మంది నాయకులు,కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు. -
అవనిగడ్డ టీడీపీలో నాలుగో కృష్ణుడు
కొత్తగా తెరపైకి డాక్టర్ చంద్రశేఖర్! బుద్ధప్రసాద్, ముత్తంశెట్టికి మొండిచెయ్యేనా? సర్వేల్లో వెనుకబడటమే కారణమా? హైదరాబాద్‌కు పయనమైన బుద్ధప్రసాద్, ముత్తంశెట్టి సాక్షి, మచిలీపట్నం/ చల్లపల్లి, న్యూస్‌లైన్ : అవనిగడ్డలో గట్టెక్కడం కష్టమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఖరారులో ప్రయోగాలు చేస్తోంది. వరుసగా అభ్యర్థులను మార్చినా సర్వేల్లో వారికి సానుకూల ఫలితాలు రాకపోవడంతో నాలుగో కృష్ణుడిని తెరపైకి తెస్తోంది. ఇప్పటికే ఇక్కడ ఉప ఎన్నికల్లో గెలిచిన అంబటి శ్రీహరిప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన టీడీపీ అధిష్టానం పొరుగు నియోజకవర్గానికి చెందిన ముత్తంశెట్టి కృష్ణారావును దిగుమతి చేసుకుంది. అప్పటికీ పరిస్థితి చక్కబడకపోవడంతో కాంగ్రెస్‌కు చెందిన మండలి బుద్ధప్రసాద్‌కు పచ్చకండువా కప్పి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామంటూ బొట్టు పెట్టింది. ఆయనకు కూడా ఎదురుగాలి తప్పకపోవడంతో తాజాగా నాలుగో కృష్ణుడు రంగంలోకొచ్చారు. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ తనయుడు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు సింహాద్రి చంద్రశేఖర్‌ని రంగంలోకి దించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆయనతో బుధవారం చంద్రబాబు మంతనాలు జరిపినట్టు తెలిసింది. అవనిగడ్డ నుంచి టిక్కెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, నూజివీడుకు చెందిన నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావు ఆగమేఘాల మీద గురువారం హైదరాబాద్ చేరినట్టు సమాచారం. అవనిగడ్డ నియోజకవర్గంలో అభ్యర్థుల గురించి ఫోన్ల ద్వారా అభిప్రాయ సేకరణ చేసిన పుడు బుద్ధప్రసాద్, ముత్తంశెట్టిలకు ప్రజల నుంచి ప్రాధాన్యత లేకపోవడం, సర్వేల్లో వీరికి సానుకూల ఫలితాలు రాకపోవడంతో వీరిద్దరినీ పక్కన పెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం యత్నిస్తున్నట్టు తెలిసింది. టీడీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి... ప్రస్తుత శాసనసభ్యుడు అంబటి శ్రీహరిప్రసాద్ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించినప్పటికీ చంద్రబాబు అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఉప ఎన్నికల్లో సానుభూతి గెలుపు కోసం అంబటి శ్రీహరిప్రసాద్‌ను దగ్గరకు తీసుకున్నట్టు ప్రేమ నటించిన చంద్రబాబు ఇప్పుడు ఆయనకు ఆర్థిక బలం లేకపోవడం, ఆరోగ్య కారణాల నేపథ్యంలో పక్కనపెట్టారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన నూజివీడుకు చెందిన నోవా విద్యాసంస్థల అధినేత ముత్తంశెట్టి కృష్ణారావుకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు కృష్ణారావే పెద్ద దిక్కయ్యారు. తనకే టికెట్ ఇస్తారని ఆయన ప్రచారం కూడా చేసుకున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌కు టికెట్ ఖాయమని ప్రచారం జరిగింది. బుద్ధప్రసాద్ రాకతో జిల్లాతో పాటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాపు సామాజిక నాయకులు, ఓటర్లు టీడీపీలో చేరతారని ఆశించారు. అందుకు భిన్నంగా ఒకరిద్దరు నాయకులు మినహా బుద్ధప్రసాద్‌తో కాంగ్రెస్ నాయకులెవరూ వెళ్లకపోవడంతో అధిష్టానం తన నిర్ణయాన్ని పునరాలోచిస్తున్నట్టు సమాచారం. వీటికితోడు గత 30 ఏళ్లుగా తెలుగుదేశానికి వ్యతిరేకంగా బుద్ధప్రసాద్ వర్గీయులు వ్యవహరించడంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత కొంపముంచుతుందని భావించిన టీడీపీ అధినాయకత్వం బుద్ధప్రసాద్‌కు హ్యాండిచ్చే అవకాశాలున్నట్టు ఆ పార్టీ నాయకులు కొందరు చెబుతున్నారు. దీంతో నియోజకవర్గంలో ఇప్పటివరకు టికెట్లు ఆశించిన ఎమ్మెల్యే అంబటి, ముత్తంశెట్టి, బుద్ధప్రసాద్ నిరాశలో ఉన్నట్టు వారి సన్నిహితులు చెబుతున్నారు. అవనిగడ్డ లో ఇప్పటికే ముగ్గురు కృష్ణులు మారగా, తాజాగా నాలుగో కృష్ణుడు తెరపైకి రావడంతో ఒకప్పుడు కంచుకోటగా ఉన్న టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారటంపై తెలుగు తమ్ముళ్లు మధనపడుతుండటం కొసమెరుపు. -
కాంగ్రెస్ కీలక నేతల్లో...ఊగిసలాట
*ప్రత్యామ్నాయం వైపు చూపు *ఉనికి కోసం తహతహ *సీటు హామీ కోసం ముమ్మర యత్నాలు *వైఎస్సార్సీపీలో చేరికకు విఫలయత్నం *టీడీపీలోకి బుద్ధప్రసాద్, పిన్నమనేని! *బాడిగ, వ్యాస్, సారథి ఎటు? కాంగ్రెస్ నేతల పార్టీ ఫిరాయింపులపై పూటకో ప్రచారం.. రోజుకో పుకారు షికార్లు చేస్తున్నాయి. ఆయా నేతలు మాత్రం ఎటూ తేల్చుకోలేని గందరగోళ స్థితిలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోవడంతో అందులో నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లిపోయాయని తేలిపోయింది. దీంతో కాంగ్రెస్‌లో ఉండి ఉనికి కోల్పోవడం కంటే పార్టీ ఫిరాయించి పదవుల కోసం అదృష్ట పరీక్షకు సిద్ధమవుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన నేతల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారడంతో వాళ్లు కచ్చితంగా పొరుగు పార్టీలకు వెళతారన్న ప్రచారం ఊపందుకుంది. దాదాపు రెండు నెలల కాలంగా వాళ్లు ఫలానా పార్టీలో చేరుతున్నారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినా కీలక నేతలు మాత్రం పార్టీ మారేందుకు డీల్ కుదరలేదో.. స్పష్టమైన హామీ దక్కలేదో.. ముహూర్తం కుదరలేదో మరి. కారణం ఏదైనా జిల్లాలో కాంగ్రెస్ మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ, అధికార భాషా సంఘం మాజీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు వంటి కీలక నేతలు సీటు హామీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు వినికిడి. జిల్లాలో రాజకీయ అయోమయం... ఇప్పటికే వైఎస్సార్సీపీలో చేరేందుకు విఫలయత్నం చేసిన జిల్లాలోని కాంగ్రెస్ నేతలు పలువురు మరో పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అనేక పుకార్లు వ్యాపించడంతో జిల్లాలో రాజకీయ అయోమయం నెలకొంది. మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ బందరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇటీవల ప్రకటించారు. ఆయన ఏ పార్టీలో చేరుతున్నదీ మాత్రం ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు ఇష్టంలేని బాడిగ ఎంపీ టిక్కెట్ హామీ ఇచ్చిన పార్టీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. బూరగడ్డ వేదవ్యాస్ సైతం పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రస్తుతానికి రాజకీయ సమీకరణలు చేసుకుంటున్నారు. వ్యాస్ ఆ పార్టీలో చేరుతున్నారని.. కాదు ఈ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం మాత్రం జరుగుతోంది. మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ఉయ్యూరు మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులను నిలపలేదు. సారథి తనదైన శైలిలో అక్కడ 20 వార్డుల్లోనూ సొంత ప్యానల్‌ను పెట్టడం చర్చనీయాంశమైంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో ఉండే అవకాశం లేదని, పార్టీ మారతారనే ప్రచారానికి ఊతమిచ్చినట్టు అయ్యింది. బుద్ధప్రసాద్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం? కాంగ్రెస్ వాదిగా ముద్రపడిన బుద్ధప్రసాద్‌కు ముసుగు తొలగిపోనుంది. రాజకీయ ఉనికి కోసం అనేక ప్రయత్నాలు చేసిన మండలి బుద్ధప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. గతం నుంచి బుద్ధప్రసాద్ వెంట నడిచిన అభిమానులు, కార్యకర్తలు ఆయన నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. దీంతో కార్యకర్తలకు సర్దిచెప్పేందుకు ఆయన ఈ నెల 26న అవనిగడ్డ నియోజకవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఈ నెల 27న అవనిగడ్డ నుంచి ర్యాలీగా విజయవాడ వెళ్లి అక్కడ జరిగే మహిళా గర్జన సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు కూడా టీడీపీలో చేరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేడీసీపీ బ్యాంక్ చైర్మన్ అయిన తొలినాళ్లలోనే ఆప్కాబ్ చైర్మన్ పదవి దక్కకపోవడంతో పిన్నమనేని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కొద్దిరోజుల క్రితం రాజమండ్రిలో జరిగిన జై సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు సభకు పిన్నమనేని వెళతారని.. అక్కడ మాజీ సీఎం కిరణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఆ పార్టీకి దూరంగానే ఉన్న పిన్నమనేని కూడా టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.