వక్కపట్లవారిపాలెం (నాగాయలంక), న్యూస్‌లైన్ : నియోజకవర్గంలో ఏ కార్యకర్త మనోభావాలను పట్టించుకోకుండా బుద్ధప్రసాద్‌కు టీడీపీ సీటిచ్చిన చంద్రబాబును మేమెందుకు పట్టించుకోవాలని పలువురు టీడీపీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాగాయలంక మండలంలోని వక్కపట్లవారిపాలెంలో ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్ ఇంటి ఆవరణలో మంగళవారం టీడీపీ కార్యకర్తల అత్యవసర సమావేశం జరిగింది.
మండల టీడీపీ అధ్యక్షుడు వర్రే రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తొలుత అంబటి శ్రీహరిప్రసాద్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. నియోజకవర్గంలో ఏ కార్యకర్తను అడిగి బుద్ధప్రసాద్‌కు సీటిచ్చారని మేమెందుకు కట్టుబడి ఉండాలని పలువురు కార్యకర్తలు నిలదీశారు. బుద్ధప్రసాద్‌కైతే మేము పనిచేయమని, వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిపోతామని, ఆయనను ఖచిచతంగా ఓడిస్తామని గ్రామాల్లో కార్యకర్తలంటున్నారని, వారికి మేమేం చెప్పాలని కార్యకర్తలు ప్రశ్నించారు.
సీనియర్ నేత పర్రచివర సొసైటీ ప్రెసిడెంట్ భోగాది నరసింహారావు చంద్రబాబు తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. నాగాయలంక మండలం టీ.కొత్తపాలెం సర్పంచి మెండు లక్ష్మణరావు, ప్రముఖ న్యాయవాది అందే శివరామకృష్ణ ప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, యర్రంశెట్టి సీతారామయ్య, మత్స్యకార నేత సువర్ణరాజు, అవనిగడ్డ అధ్యక్షుడు బచ్చు వెంకటనాధ్‌ప్రసాద్ చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.
ఆవేశంగా మాట్లాడిన కొంతమంది కార్యకర్తలు ఒక దశలో పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతామని లేవగా, ఎమ్మెల్యే సర్ధి చెప్పడంతో ఆగారు.కన్నా నాగరాజు, పెద్ది భాస్కరరావు, సజ్జా గోపాలకృష్ణ, తలశిల సాంబశివరావుతో పాటు కోడూరు, అవనిగడ్డ, నాగాయలంక మండలాల నుంచి కొంత మంది నాయకులు,కార్యకర్తలు సమావేశానికి హాజరయ్యారు.
బుద్ధప్రసాద్‌ను ఓడిస్తాం
Published Wed, Apr 16 2014 3:28 AM | Last Updated on Tue, Aug 14 2018 4:51 PM
Advertisement
Advertisement