బుద్ధప్రసాద్‌కు ఎదురుగాలి
- అవనిగడ్డ బరిలో రెబెల్స్
- నామినేషన్లు వేసిన కంఠంనేని, పోసబత్తిన
- కాంగ్రెస్ నుంచి కలిసిరాని కేడర్
- టీడీపీలో వ్యతిరేకత
సాక్షి, మచిలీపట్నం : సుదీర్ఘకాలం అవనిగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పిన మండలి బుద్ధప్రసాద్‌కు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. దశాబ్దాల తరబడి రాజకీయ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ఆయన టీడీపీలో చేరడంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను అనుసరించడం లేదు. టీడీపీ కేడర్ ఆయన్ని ఇముడ్చుకోలేకపోతోంది.
శనివారం నామినేషన్‌ల ఘట్టం ముగిసేనాటికి బుద్ధప్రసాద్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్లు వేయగా. కాంగ్రెస్ అభ్యర్థి సైతం బరిలో నిలిచారు. దీంతో అటు పాత పార్టీ, ఇటు కొత్త పార్టీల నుంచి కూడా ఆయనకు శిరోభారం తప్పలేదు. వాడుకుని వదిలేయడంలో అగ్రగణ్యుడైన చంద్రబాబు అవనిగడ్డలో చివరకు బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఉప ఎన్నికల్లో సానుభూతితో ఎమ్మెల్యే పదవిని టీడీపీకి దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లో గెలిచినా ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించలేదనే సంగతి తెల్సిందే. నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావుకు టిక్కెట్ ఆశచూపి అవనిగడ్డ నియోజకవర్గానికి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించారు. చివరకు మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు చంద్రశేఖర్‌కు టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో బుద్ధప్రసాద్ జాగ్రత్త పడ్డారు. ఇటీవలే టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కేడర్ ఆయన్ను ఓడిస్తామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు.
రెబల్స్‌గా బరిలోకి..
మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు రెబల్స్‌గా నామినేషన్‌లు వేశారు. తెలుగువన్ ఫౌండేషన్ (హైదరాబాద్) చైర్మన్ కంఠంనేని రవిశంకర్ శనివారం నామినేషన్ వేశారు. 2009 ఎన్నికల్లోనే చంద్రబాబు తనకు టిక్కెట్ ఇస్తానని అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఈసారి కూడా మోసం చేయడంతో రెబల్‌గా నామినేషన్ వేసినట్టు రవిశంకర్ ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా గర్జన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రెయిన్‌బో వెంచర్స్ అధినేత పోసబత్తిన సాంబశివరావు కూడా రెబల్‌గా నామినేషన్ వేశారు. వీరితోపాటు గతంలో బుద్ధప్రసాద్‌కు మద్దతుగా పనిచేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
టీడీపీ శ్రేణులు గరం గరం..
టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌పై ఆ పార్టీ శ్రేణులు గరం గరంగానే ఉన్నాయి. పలువురు టీడీపీ నేతలు బుద్ధప్రసాద్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పర్చూరి దుర్గాప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, యర్రంశెట్టి సీతారామయ్య తదితర కీలక నేతలు బుద్ధప్రసాద్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు విడిచి వచ్చిన కాంగ్రెస్ వాళ్లు వెంటరాక పోగా, ఇటు చేరిన టీడీపీలో కలిసిరాక అవనిగడ్డలో బుద్ధప్రసాద్ పరిస్థితి గడ్డుగా మారింది.