వ్యవసాయం దండగని..
సాక్షి, విజయవాడ : వ్యవసాయం దండగన్న చంద్రబాబునాయుడుకి ప్రజలు తనను రెండుసార్లు ప్రతిపక్షంలో కూర్చోపెట్టేసరికి రైతుల పట్ల ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చిందనే విమర్శలొస్తున్నాయి. తమ జీవితాలు బుగ్గిపాలు కావడానికి చంద్రబాబు నాయుడే కారణమన్న కోపం రైతుల్లో ఇంకా చల్లారలేదు. చంద్రబాబు పాలనలో సాగునీటి కోసం రైతన్న రోడ్డెక్కాల్సిన పరిస్థితి కల్పించారు. డెల్టా పరిరక్షణ వేదిక పేరుతో రైతులు ఉద్యమం చేయాల్సివచ్చింది.
అప్పుడు ఉద్యమానికి నాయకత్వం వహించిన మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ తన స్వార్థం కోసం తెలుగుదేశంలో చేరినంత మాత్రాన రైతులంతా ఆయన పక్కన వెళ్లే అవకాశం లేదని ఇతర నేతలు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు తాను అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాల వల్లే రైతాంగం నేడు ఈ దుస్థితిని అనుభవిస్తోందని చెబుతున్నారు.
రైతుల ఆత్మహత్యలకు కారణం..
రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థను దెబ్బతీసిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందనేది రైతుల వాదన. 1993లో తుఫాన్ వచ్చిన సందర్భంలో తడిసిన, తేమ ఉన్న రకాలకు ఇంత చొప్పున చెల్లించాలంటూ కనీస మద్దతు ధరలో కోత పెట్టే విధానాన్ని చంద్రబాబునాయుడే ప్రారంభించారు. దీనివల్ల అందరు రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు సమయంలో రైతులకు గిట్టుబాటు ధర రాకపోవడంతో 2003లో రైతుసంఘం నేతలు ధాన్యాన్ని ఎడ్లబండ్లపై కట్టుకువచ్చి కృష్ణానదిలో పారబోయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
వ్యవసాయానికి విద్యుత్ నిరంతరాయంగా ఇవ్వాలంటూ ఉద్యమించిన కాల్దారీ రైతులపై కాల్పులు జరిపించిన ఘనత కూడా చంద్రబాబుదే. వ్యవసాయంలో నష్టపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే నష్టపరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రులే వ్యాఖ్యానించారు. కృష్ణా, గోదావరి డెల్టాలో రైతులు ఆడంబరాలకు పోయి అప్పుల పాలవుతున్నారంటూ వారిని కించపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన సంగతి రైతాంగం ఇంకా మర్చిపోలేదు.
ఇరిగేషన్ ప్రాజెక్టులు గాలికి...
జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులను గాలికి వదిలేశారు. 15 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పులిచింతల ప్రాజెక్టు కోసం శంఖుస్థాపన రాయి వేసి, జగ్గయ్యపేటలో పులిచింతల ఇరిగేషన్ సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. చంద్రబాబునాయుడు వచ్చిన తర్వాత పులిచింతల ఇరిగేషన్ సర్కిల్‌ను కూడా ఎత్తివేసి పులిచింతల ప్రాజెక్టును చెత్తబుట్టలో పడేశారు.
వ్యవసాయ శాఖ కుదింపు...
ఇప్పుడు వ్యవసాయంపై అత్యంత ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న చంద్రబాబు ఈ శాఖను కుదిస్తూ అగ్రీ క్లీనిక్స్‌ను తీసుకురావాలని ప్రయత్నం చేశారు. ప్రతి వెయ్యి మందికి ఒక వ్యవసాయ అధికారి ఉండాల్సిన పరిస్థితిలో మండలానికి ఒకరిద్దరికి కుదించారు.
ఆలస్యంగా సాగునీరు...
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో డెల్టాకు ఏనాడు సరైన సమయానికి సాగునీరు అందించిన దాఖలాలు లేవు. జూన్ 10 నాటికి సాగునీరు ఇవ్వాల్సి ఉండగా ఆగస్టు, సెప్టెంబర్‌లో కూడా రైతులు ఉద్యమించిన తర్వాత నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉండేది. డెల్టా పరిరక్షణ సమితి నేతృత్వంలో పలు ఉద్యమాలు చంద్రబాబు నాయుడు హాయాంలోనే రైతులు చేయాల్సి వచ్చింది.