ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్?
సోమవారం ప్రకటించనున్న సభాపతి కోడెల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉప సభాపతిగా కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం సాయంత్రం నామినేషన్ దాఖలు గడువు ముగిసేనాటికి ఆయన ఒక్కరే ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయటంతో ఉప సభాపతిగా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు సోమవారం (23వ తేదీ) సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించనున్నారు. మండలి గతంలో కాంగ్రెస్ తరపున మంత్రిగా, అధికార భాషా సంఘం ఛైర్మన్‌గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీలో చేరి అవనిగడ్డ నుంచి విజయం సాధించారు.
జగన్‌కు యనమల ఫోన్: ఉప సభాపతి ఎన్నిక వ్యవహారంపై శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. సమయాభావం వల్ల నామినేషన్ వేయడానికి ముందే ఉప సభాపతి ఎంపికపై సమాచారం ఇవ్వలేకపోయామని, ఎన్నిక ఏక గ్రీవానికి సహకరించాలని కోరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
చీఫ్ విప్‌గా కాలువ, విప్‌లుగా నలుగురు: ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేశారు. వారి పేర్లను ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితోపాటు శాసనసభ సచివాలయానికి అందచేశారు. ఒకటి, రెండు రోజుల్లో వీరి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. చీఫ్‌విప్‌గా అనంతపురం జిల్లా రాయదుర్గం శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు, విప్‌లుగా చింతమనేని ప్రభాకర్ (దెందులూరు), కూన రవికుమార్ (ఆముదాల వలస), మేడా మల్లికార్జునరెడ్డి (రాజంపేట), యామినీబాల (శింగనమల)లను ఎంపిక చేశారు.