నీళ్లు ఎలా వెళ్లాయో కనిపెట్టలేకపోయిన ప్రొఫెసర్లు
గుంటూరు: వర్షం లీకేజీతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తాత్కాలిక సచివాలయం భవనాలలోని లోపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛాంబర్‌లోకి నీళ్లు ఎలా వెళ్లాయో ప్రొఫెసర్ల బృందం కనిపెట్టలేకపోయింది. సీఆర్‌డీఏ కాంట్రాక్టర్లు చెబుతున్న వాదనకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది.
పైప్ లైను నుంచి వైఎస్ జగన్ కుర్చీ వరకు నీళ్లు వెళ్లే అవకాశం లేదని ప్రొఫెసర్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ కుర్చీపైకి సీలింగ్ ఎలా ఊడిందని జేఎన్‌టియు ప్రొఫెసర్ల ప్రశ్నించగా .... కాంట్రాక్టర్లు నీళ్లు నమిలినట్టు తెలుస్తోంది. వాటర్ లీక్ అయిన ప్రాంతాన్ని, టెర్రస్‌పైన పైపులను బృందం సభ్యులు పరిశీలించారు. సివిల్ పనులను పరిశీలించి సీఐడి అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు
మరోవైపు సీఐడీ అధికారులకు కూడా ఈ వాటర్ లీకేజీ వ్యవహారం అంతుపట్టడం లేదు. అసెంబ్లీ మొదటి ఫ్లోర్‌లో సీసీ కెమెరాలు లేకపోవడంతో పైప్ కట్ చేసినవారిని ఎలా గుర్తించాలనే సందేహం వారిలో తలెత్తుతోంది. అంతేకాకుండా విచారణ ప్రారంభించేసరికి మరమ్మతులు పూర్తి చేయడంతో విచారణ ఎలా అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
లీకేజీ తర్వాత చాలాచోట్ల మరమ్మతులు చేయడంతో సీఐడీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటర్ లీకేజీ కంటే వీడియో లీకేజీపైనే సీఐడీ విచారణ కొనసాగుతోంది. కాగా మంగళవారం కురిసిన వర్షానికి సచివాలయంతో పాటు, అసెంబ్లీ భవనాలలో వర్షపు నీరు కారిన విషయం తెలిసిందే.