‘అసెంబ్లీ సాక్షిగా వైఎస్ జగన్‌పై కుట్ర’
తిరుపతి : ఆంధప్రదేశ్ శాసనసభ సాక్షిగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. పథకం ప్రకారమే టీడీపీ నేతలు జగన్‌పై కుట్ర పన్నుతున్నారని ఆమె శుక్రవారమిక్కడ ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నేత ఛాంబర్‌లో లీకేజీ వ్యవహారం నడిచిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్ జగన్‌పై కుట్రలు జరుగుతూనే ఉన్నాయని రోజా వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దాని వెనుక జగన్ ఉన్నట్లు టీడీపీ చెప్పడం సాధారణమైపోయిందని ఆమె ధ్వజమెత్తారు. రేపు ఎప్పుడైనా చంద్రబాబు మనవడు దేవాన్ష్ ఏడ్చినా... జగనే గిచ్చి ఉంటాడని చెప్పినా ఆశ్చర్యపోనక్కరలేదని రోజా ఎద్దేవా చేశారు. భవనం లీకేజీపై తక్షణమే సీబీఐ విచారణకు సిద్ధపడతాలని ఆమె డిమాండ్ చేశారు.
కాగా వందల కోట్ల ఖర్చుతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన రాష్ట్ర నూతన శాసనసభ, సచివాలయం మంగళవారం కేవలం 20 నిమిషాలపాటు కురిసిన సాధారణ వర్షానికే అసెంబ్లీ, సచివాలయం జలదిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అసెంబ్లీలో కేటాయించిన చాంబర్‌లో లీకేజీల వల్ల వాననీరు ధారాళంగా పారింది. చాంబర్‌లో సీలింగ్ ఊడిపడింది. సోఫాలు పూర్తిగా తడిసిపోయాయి. ఏసీ, రూఫ్‌లైట్ల నుంచి కూడా వాన నీరు ధారగా కారిపోవడంతో కింద బక్కెట్లు పెట్టారు.
చాంబర్‌లో పడిన వాన నీటిని బక్కెట్లతో పట్టి బయటకు పోసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. అయితే తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటూ పైపెచ్చు వర్షాలకు అసెంబ్లీ భవనాలు కురుస్తున్నాయని, లీకేజీలు ఉన్నాయంటూ ప్రతిపక్షాలు అనవసర ప్రచారం చేస్తున్నాయంటూ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని పరిశీలించేందుకు శుక్ర, , శనివారాల్లో సామాన్య ప్రజానీకంతోపాటు ప్రజాప్రతినిధులు, మీడియా అందరికీ అవకాశం కల్పిస్తున్నామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పడం విశేషం.