జిల్లాకు మరో కీలక పదవి
- డెప్యూటీ స్పీకర్‌గా బుద్ధప్రసాద్
- మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక
సాక్షి, విజయవాడ : జిల్లాకు మరో కీలక పదవి లభించింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా శాసనసభ డెప్యూటీ స్పీకర్‌గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి బుద్ధప్రసాద్ మినహా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. టీడీ పీలో సీనియర్ నేత, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌కు కూడా మరో కీలక పదవి దక్కవచ్చని ఆ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదీ బుద్ధప్రసాద్ రాజకీయ ప్రస్థానం..
మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు తనయుడిగా బుద్ధప్రసాద్ రాజకీయ అరగ్రేటం చేశారు. ఆయన 1977-85లో జిల్లా యువజన కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడిగా, పీసీసీ సంయుక్త కార్యదర్శిగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1999, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన బుద్ధప్రసాద్ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రిగా పనిచేశారు.
2009 ఎన్నికల్లో ఓటమిపాలైన ఆయన్ను 2013లో నాటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి, అధికార భాషా సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసి గత అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. బుద్ధప్రసాద్‌కు పదవి లభించడంతో టీడీపీ అధ్యక్షుడు జిల్లాకు పెద్దపీట వేసినట్లయింది.