- రూ.1.50 కోట్లతో భవన నిర్మాణానికి చర్యలు
- ఘంటసాల ఉపయోగించిన వస్తువులు ఇచ్చేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు
- తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
- ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ(కృష్ణా జిల్లా): విజయవాడలో రూ.1.50 కోట్లతో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట స్మారక మ్యూజియంను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపసభాపతి, తెలుగు భాషాభివృద్ధి అధ్యన కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఉపసభాపతి కార్యాలయం నందు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు కలిసి ఈనెల 19, 20 తేదీల్లో తమిళనాడులో పర్యటించినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గృహానికి వెళ్లి ఘంటసాల వస్తువులను పరిశీలించి మ్యూజియం ఏర్పాటు విషయం ప్రస్తావించగా వారు అంగీకరించినట్టు చెప్పారు. ఘంటసాల వాడిన కళ్లజోడు, తంబుర, కుర్చీ, చెప్పులతో పాటు సంగీత పరికరాలు, 2వేలు గ్రాం ఫోన్ రికార్డులు మ్యూజియంకు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు బుద్ధప్రసాద్ వెల్లడించారు.
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, రూ.1.5 కోట్లతో నిర్మించే ఈ మ్యూజియం పనులు వీలైనంత త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో తమిళభాష పట్ల ప్రజలు ఎంతో మక్కువ చూపుతారని చెప్పారు. అక్కడ భాషాభివృద్ధికి తమిళ సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయని తెలిపారు.
తమిళభాషను పరాయివాళ్లకు నేర్పించేందుకు 20వేల మంది పనిచేస్తున్నారని తెలుగును ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన తెలుగు భాషాభిమానులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు రూపకల్పన చేస్తామన్నారు.
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం
Published Wed, Sep 21 2016 7:48 PM | Last Updated on Mon, Sep 4 2017 2:24 PM
Advertisement
Advertisement