
టీ మంటలు
- జిల్లా వ్యాప్తంగా కొనసాగిన ఆందోళనలు, నిరసనలు
- వైఎస్సార్ సీపీ బంద్ విజయవంతం
- మూతపడ్డ వాణిజ్య సంస్థలు, పాఠశాలలు
‘ఛీ’లికపై కేంద్ర ఏలికల తీరుకు నిరసన వెల్లువెత్తింది. పాలుపొంగు తెలుగు గడ్డను పగులగొట్టిన కాంగ్రెస్ ఓట్లు,సీట్ల రాజకీయాలకు చరమ గీతం పాడాలంటూ జనకోటి నినదించింది. లోక్‌సభలో పరిణామాలకు నిరసనగా వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నిర్వహించిన బంద్‌లో అన్ని వర్గాల ప్రజలూ స్వచ్ఛందంగా పాల్గొనటంతో జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభిం చింది. ‘సో..నయా’ వంచనకు గురైన సీమాంధ్రుల ఆగ్రహానికి పాల కులు గరికాక తప్పదంటూ పలుచోట్ల సమైక్యాంధ్ర ద్రోహుల దిష్టి బొమ్మల్ని దహనం చేశారు. రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన ప్రదర్శనలతో జిల్లా అంతటా అట్టుడికింది. ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇక్కట్లు పడ్డారు.
సాక్షి,విశాఖపట్నం : రాష్ట్ర విభజనకు నిరసనగా చెలరేగిన ఆందోళనలు బుధవారం రెండో రో జూ కొనసాగాయి. ఎక్కడికక్కడ వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పక్షాలు రోడ్లపైకి వచ్చి ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. పాఠశాలలు, వాణిజ్య దుకాణాలు, వాహనాలు, సినిమాహాళ్లు స్వచ్చందంగా బంద్ పాటించాయి. వెఎస్సార్‌సీపీ నేతలతోపాటు జిల్లాలో అన్ని చోట్లా విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ పక్షాలు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించాయి. విభజనకు పూనుకున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మలను, ఫెక్సీలను ఆందోళనకారులు దహనం చేశారు. సోనియాను ఇండియా నుంచి ఇటలీకి తరిమికొడితేనే దేశానికి భద్రత ఉంటుందంటూ మండిపడ్డాయి. ఏజెన్సీలో సంపూర్ణ బంద్ జరిగింది. అరకు,పాడేరు,చింతపల్లి తదితర ప్రాంతాలనుంచి ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును యూపీఏ ప్రభుత్వం లోక్‌సభలో ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా ఆందోళనకారులు పాఠశాలలను మూయించారు. ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు.
నర్సీపట్నం...ఉద్రిక్తం
నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర గణేష్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచే నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు 16 మందిని బలవంతంగా అరెస్టు చేశారు. నియంతలా వ్యవహరించిన హిట్లర్‌ను సోనియాగాంధీ మించిపోయారని త్వరలో ఇటలీ పారిపోవడం ఖాయమని మాడుగుల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు బూడి ముత్యాలునాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఘాట్‌రోడ్ జంక్షన్‌లో బిల్లు ఆమోదానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఓట్లు, సీట్లు కోసమే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ రెండుముక్కలు చేసిందని వైఎస్సార్ సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు.
యలమంచిలిలో మూతబడ్డ పాఠశాలలు
బుధవారం యలమంచిలి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కార్యాలయాల ను మూయించారు. మెయిన్‌రోడ్డుపై ర్యాలీ ని ర్వహించారు. సోనియాగాంధీ దిష్టిబొమ్మను ద హనం చేశారు. అనకాపల్లిలో బంద్ విజయవంతమైంది. అనకాపల్లి పూడిమాడక రోడ్ జాతీ య రహదారిపై వైఎస్సార్ సీపీ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. పాడేరులో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ పక్షాలు చేపట్టిన బంద్ ఏజెన్సీలో విజయవంతమైంది. పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించా రు. మైదానానికి వెళ్లే వాహనాలను రోడ్డుకు అడ్డంగా బైఠాయించి వాహనాలను అడ్డుకున్నా రు. టీడీపీ కూడా బంద్ నిర్వహించింది. డుం బ్రిగుడ మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ పక్షాలు బంద్‌కు తోడ్పాటు అందించాయి.
బాలరాజు ఫ్లెక్సీల దహనం
అరకు-పాడేరు ప్రధాన రహదారిలో మంత్రి బాలరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి ప్లెక్సీలను తగులబెట్టారు. నక్కపల్లిలో జరిగిన బంద్,ఆందోళన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే,వైసీపీ నేత చెంగల వెంకటరావు పాల్గొని విభజనపట్ల నిరసన వ్యక్తంచేశారు. పాయకరావుపేటలో బంద్ ప్రశాంతంగా జరిగింది. దుకాణాలు,థియేటర్లు ,ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. జాతీయ రహదారిపై చెంగల వెంకట్రావు ఆధ్వర్యర లో రాస్తారోకో నిర్వహించారు.