
కాంగ్రెస్‌కు సిపాయి గుడ్‌బై
- రెండు రోజుల్లో కొత్తపార్టీ తీర్థం
- రాష్ట్ర విభజనలో కాంగ్రెస్-బీజేపీ సమాన భాగస్వాములు
- బీజేపీతో పొత్తున్న పార్టీలకు భంగపాటు తప్పదు
- స్పష్టం చేసిన అనుచరులు
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు దోహదపడిన కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం గుడ్‌బై చెప్పనున్నారు. మరో రెండురోజుల్లో కొత్త పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం ఆయన పట్టణంలోని పొన్నాలమ్మగుడి ఆవరణలో తమ అనుచరులతో రెండు గంటల పాటు చర్చించారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీ సమాన భాగస్వాములని ఆయన అనుచరులు స్పష్టం చేశారు.
దీంతో బీజేపీకి గానీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న పార్టీలకు గానీ ప్రజలు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. అలాంటి పార్టీలు అవసరం లేదన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించే బడుగు బలహీన వర్గాల పార్టీలో చేరితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని స్పష్టం చేశారు. టీడీపీతో భవిష్యత్ ఉండదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని పరోక్షంగా పేర్కొన్నారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోసారి చర్చలు జరిపి నిర్ణయం వెల్లడించనున్నారు.
తిరుపతిలో ప్రముఖ డాక్టర్‌గా పేరొందిన రష్ ఆస్పత్రి అధినేత సిపాయి సుబ్రమణ్యం 2009 ఎన్నికల్లో తొలిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. సినీనటుడు చిరంజీవితో సన్నిహిత సంబంధాలు ఉండడంతో శ్రీకాళహస్తి నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. 25 వేలకు పైగా ఓట్లు సంపాదించారు. ఆ తర్వాత చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఇష్టం లేకున్నా సిపాయి కూడా అదే పార్టీలో కొనసాగారు. పట్టణంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇటీవల శ్రీకాళహస్తిలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో చుర్గుగా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్ ఉండదని గ్రహించిన ఆయన సోమవారం తన అనుచరులతో చర్చలు జరిపారు.
సీమాంధ్ర ప్రాంతంలో వైఎస్సార్ సీపీ తప్పక అధికారంలోకి వస్తుందని, ఆ పార్టీలోకి వెళితేనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని ఆయనకు అనుచరులు సూచించారు. రాష్ట్ర విభజన ప్రక్రియలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ ప్రధానపాత్ర పోషించిందని, అలాంటి పార్టీతో పొత్తుపెట్టుకున్న టీడీపీలోకి వెళితే రాజకీయ ఇబ్బందులు తప్పవని వివరించారు. దీంతో మంగళ, బుధవారాలు తన అనుచరులతో మరోసారి చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.
విభజనతో సీమాంధ్రకు నష్టం
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. స్వార్థం కోసం రాష్ట్రాన్ని విభజించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. రెండు రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తాను.
-డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం