ఆర్థిక సంఘం సమావేశానికి విస్తృత ఏర్పాట్లు
తిరుపతి/చిత్తూరు సెంట్రల్/రేణిగుంట: తిరుపతిలో శుక్రవారం నిర్వహించనున్న 14వ ఆర్థిక సంఘ సమావేశానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి సారిగా తిరుపతిలో జరుగుతున్న ఈ సమావేశాన్ని జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు పాల్గొంటారు.
శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడి స్వాగతోపన్యాసంతో సమావేశం ప్రారంభమవుతుంది. 10.35 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం అనంతరం 11 గంటల నుంచి రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చిస్తారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జట్టి ఆధ్వర్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
తిరుపతిలో శుక్రవారం జరగనున్న 14వ ఆర్థిక సంఘం సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో బయలుదేరి వస్తారని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9.20 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని 9.30 గంటలకు అక్కడినుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్‌కు చేరుకుంటారు. 10.00 నుంచి 10.30 గంటల వరకు ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులతో ముఖాముఖిలో పాల్గొంటారు. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాంకేతిక అంశాలపై జరగనున్న కార్యక్రమంలో ఆర్థిక సంఘం సభ్యులతో పాటు పాల్గొంటారు.
ఆర్థిక సంఘానికి స్వాగతం
డాక్టర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన 14 వ ఆర్థిక సంఘం గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంట చేరుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జట్టి, ఆర్డీవో రంగయ్య, ఇతర శాఖల అధికారులు స్వాగతం పలికారు. వైవీరెడ్డితో పాటు 12 మంది సభ్యులు విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనాల్లో తిరుపతికి వెళ్లారు.
కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం
ఆర్థిక సంఘ సమావేశంలో పాల్గొని ప్రసంగించేందుకు తిరుపతికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనిలో పనిగా టీడీపీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్థిక సంఘ సమావేశంలో ప్రసంగించిన అనంతరం ఒంటి గంటకు సమీపంలోనే ఉన్న ఎస్‌ఎస్‌బి కల్యాణమండపంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.