- మేర్లపాక సమీపంలో భూములు కొన్న మంత్రి, టీడీపీ ఎంపీ
- అక్కడ ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటు చేయాలని ఒత్తిడి
- అనుకూలం కాదని తేల్చిన కేంద్ర బృందం
- తిరుపతి పరిసర ప్రాంతాల్లో కేటాయించాలని లేఖ
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రియల్ భూమ్ సృష్టించి ప్రజాధనాన్ని కొల్లగొట్టాలన్న ఓ మంత్రి, టీడీపీ ఎంపీ ఎత్తును కేంద్ర మానవ వనరుల శాఖ అధికార బృందం చిత్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతంలో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్) కేంద్రాలను ఏర్పాటు చేయలేమని స్పష్టీకరించింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. అందులో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ సంస్థల బూచి చూపి తమ భూములను అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకోవడానికి ఓ మంత్రి, మరో టీడీపీ ఎంపీ ఎత్తు వేశారు. ఏర్పేడు మండలం మేర్లపాక పరిసర ప్రాంతాల్లో ఆ మంత్రి, ఎంపీలు బినామీ పేర్లతో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అక్కడే ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌ను ఏర్పాటు చేయాలంటూ జిల్లా అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చారు.
ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా అధికారులు ఐఐటీ ఏర్పాటుకు మేర్లపాకలో 440 ఎకరాలు, ఐఐఎస్‌ఈఆర్ ఏర్పాటుకు పంగూరులో 398 ఎకరాలు గుర్తించి కేంద్రానికి నివేదిక పంపారు. కేంద్ర మానవవనరుల శాఖ బృందం ఆ భూములను పరిశీ లించి, అటవీ ప్రాంతంలో జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేయలేమని నివేదిక ఇచ్చినట్లు రెవెన్యూ కీలక అధికారి వెల్లడించారు. మౌలిక సదుపాయాలు అంతం త మాత్రంగానే ఉన్నందున ఆ ప్రాంతం జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు అనువు కాదని పేర్కొన్నట్లు రెవెన్యూ వర్గాలు వెల్లడించాయి.
రేణిగుంట విమానాశ్రయానికి ఐదారు కి.మీల దూరంలో తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే భూమిని కేటాయిస్తే విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మానవవనరుల శాఖ లేఖ రాసినట్లు రెవెన్యూ అధికారి‘సాక్షి’కి వెల్లడించారు. దీంతో మంత్రి, టీడీపీ ఎంపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తాము ప్రతిపాదించిన స్థలంలోనే ఆ సంస్థలను ఏర్పాటు చేయాలని పట్టుపడుతుండటం గమనార్హం.