దిగ్గజాలు... యువతేజాలు !
- అనుభవ జ్ఞులు,కొత్తతరంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా
- రాజకీయ నేపథ్యంఉన్నవారికి ప్రాధాన్యం
- విద్యావంతులకూ అవకాశం
- బరిలో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు
సాక్షి, తిరుపతి: అనుభవం, కొత్తతరం కలబోతగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా వెలువడింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో జిల్లా నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాను పరిశీలిస్తే విద్యావంతులు, చట్టసభల్లో అనుభవం, యువత, మహిళలు, రాజకీయనేపథ్యం ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని కసరత్తు చేసిన తరువాత అభ్యర్థులను ఖరారు చేసినట్టు విశదమవుతుంది. అంతేకాకుండా పార్టీ ఆవిర్భావం నుంచి ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటున్న నేతలకు ఈ జాబితాలో ప్రాధాన్యమిచ్చింది.
జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యే క ముద్ర వేసుకున్న మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు రాజకీయ కుటుంబ నేపథ్యం కలిగిన మాజీ ఎమ్మెల్యేలు ఎన్. అమరనాథరెడ్డి, ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, చింత ల రామచంద్రారెడ్డి వంటి దిగ్గజాలు ఈ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు. తిరుపతి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మండలిలో ప్రాతినిథ్యం వహిస్తున్న డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మదనపల్లె బరిలో నిలిచారు.
మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుప్పం నుంచి పోటీ చేస్తున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఈయన ప్రతిష్టాత్మక నియోజకవర్గమైన కుప్పంలో ప్రతిపక్షనేత చంద్రబాబుతో తలపడనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కే నారాయణస్వామి గంగాధరనెల్లూరు బరిలో నిలి చారు. యువతరం ప్రతినిధులుగా రాజం పేట, చిత్తూరు లోక్‌సభ స్థానాల నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, సామాన్య కిరణ్, శ్రీకాళహస్తి, పూతలపట్టు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బియ్యపు మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ సునీల్‌కుమార్ వంటి నాయకులు ఉన్నారు. వీరంతా తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నారు.
వైఎస్సార్సీపీ విడుదల చేసిన జాబితాలో ఆరుగురు కొత్త అభ్యర్థులు ఉండగా, మరో ఆరుగురు ఇప్పటికే చట్టసభల నుంచి ప్రాతినిథ్యం పొందిన వారు ఉన్నారు. మరో ఇద్దరికి ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ధీటైన అభ్యర్థులను ఎంపిక చేశారనే అభిప్రాయూన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
శాసనసభ స్థానాల అభ్యర్థులు
ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి: తంబళ్లపల్లె మాజీ శాసనసభ్యులుగా ఉన్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు తొలిసారిగా 2009లో ఎన్నికైనప్పటికీ రాష్ట్ర విభజన విషయంలో ఆ పార్టీ అధినేత వైఖరిని విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విద్యావంతులైన ఈయన మరోసారి తంబళ్లపల్లె నుంచి పోటీ చేస్తున్నారు.
దేశాయ్ తిప్పారెడ్డి : మదనపల్లె శాసనసభ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన స్థానిక సంస్థల ప్రతినిధిగా శాసనమండలి సభ్యులుగా ఉన్నారు. మదనపల్లెలో వైద్యవృత్తిలో ఉన్న ఆయన నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. ప్రస్తుతం పూర్తికాలం రాజకీయాలకు కేటాయించి ప్రజాసేవలో ఉన్నారు.
ఎన్.అమరనాథరెడ్డి: పలమనేరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈయన ఇప్పటికే మూడు సార్లు శాసనసభ నుంచి ప్రాతినిథ్యం వహించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నుంచి శాసనసభకు ఎన్నికైనప్పటికీ రాష్ట్ర విభజన విషయంలో అధినేత వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరువాత వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు.
కే నారాయణస్వామి : గంగాధరనెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. 2004లో ఒకసారి సత్యవేడు నుంచి ఎన్నికై శాసనసభ్యులుగా పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. మూడు సంవత్సరాలుగా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉంటున్నారు. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.
చింతల రామచంద్రారెడ్డి: పీలేరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈయన రెండు దఫాలు ఇక్కడ నుంచి శాసనసభలో ప్రాతనిథ్యం వహించారు. రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఈ దఫా మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో తలపడుతున్నారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి: రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తిరుపతి రూరల్ మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యునిగా ఒకసారి ఎన్నికయ్యారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానం. తుడా చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభకు పోటీ చేస్తున్నారు. మహానేత మరణించిన నాటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు.
బియ్యపు మధుసూదన్‌రెడ్డి: శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి తొలిసారిగా బరిలోకి దిగుతున్నారు. జగన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. మహానేత మరణం తరువాత జగన్ బాటలో నడుస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.
ఆదిమూలం : సత్వవేడు రిజర్వుడు నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలోకి దిగుతున్నారు. మహానేత మరణం తరువాత జగన్ వెంట నడుస్తూ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
డాక్టర్ సునీల్ కుమార్: పూతలపట్టు రిజర్వుడు నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలో నిలిచారు. వైద్యరంగంలో స్థానికులకు సుపరిచితులు. వైఎస్ జగన్ పట్ల అభిమానంతో పార్టీలో చేరి కొంత కాలంగా నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
జంగాలపల్లి శ్రీనివాసులు : జిల్లా కేంద్రమైన చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన అనుభవం ఉంది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడుగా ఉంటూ ఐదు రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేశారు.
చంద్రమౌళి : ఐఏఎస్ అధికారిగా ఉద్యోగ విరమణ చేసిన చంద్రమౌళి తొలిసారిగా బరిలో దిగుతున్నారు. బలహీనవర్గాలకు చెందిన ఈయన రాజకీయ అరంగేట్రంలోనే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడుతో కుప్పం నుంచి తలపడుతున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జిల్లా రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ఇప్పటికే నాలుగు దఫాలు శాసనసభ నుంచి ప్రాతినిథ్యం వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య హయాంలో అటవీశాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం పుంగనూరు నియోజకవర్గం నుంచి శాసనసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
భూమన కరుణాకరరెడ్డి
ప్రస్తుతం తిరుపతి శాసనసభ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుం బంతో తొలి నుంచి సాన్నిహిత్యం ఉంది. మహానేత ప్రభు త్వ హయాంలో టీటీడీ చైర్మన్‌గాను, తుడా (తిరుపతి అర్బన్ డెవెలప్‌మెంట్ అథారిటీ) చైర్మన్‌గాను నియమితుల య్యారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో శాసనసభకు ఎన్నికయ్యారు. మళ్లీ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.
ఆర్‌కే రోజా
సినిమా రంగం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులయ్యారు. మహానేత మరణం నుంచి జగన్ వెంట ఉన్నారు. రెండుసార్లు శాసనసభకు పోటీ చేసిన అనుభవం ఉంది. ఈ సారి నగరి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. కొంతకాలంగా ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నారు.
లోక్‌సభ అభ్యర్థులు
పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు. యునెటైడ్ కింగ్‌డమ్‌లోని చెల్లిర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టభద్రులు. రాజకీయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్న ఆయన ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి గట్టిగా కృషి చేశారు.
డాక్టర్ వరప్రసాద్‌రావు
తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఈయన తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. వీఆర్‌ఎస్ తీసుకుని బాధ్యతల నుంచి వైదొలిగారు. రాజకీయ రంగం నుంచి ఎక్కువ సేవ చేయగలమన్న దృక్పథంతో 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకులుగా ఉన్నారు.
సామాన్య కిరణ్
ఖమ్మం జిల్లా కొత్తగూడెంకు చెందిన పశ్చిమబెంగాల్ ఐఏఎస్ అధికారి కిరణ్ సతీమణి సామాన్య చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఉన్నత విద్యావంతురాలైన ఈమె చిత్తూరులో విద్యాభ్యాసం చేశా రు. రెండేళ్ల కిందటి వరకు నెల్లూరులోని ఒక కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయాల పట్ల ఉన్న మక్కువతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం సమన్వయకర్తగా పనిచేశారు. ప్రస్తుతం చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో ఉన్నారు.