సాక్షి, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల బదిలీల్లో ఇతర జిల్లాలకు వెళ్లిన తహశీల్దార్లు, ఎంపీడీఓలు తిరిగొచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులను ఇతర జిల్లాలకు పంపడం తెలిసిందే. వీరిని తిరిగి సొంత జిల్లాలకు పంపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు 43 మంది తహశీల్దార్లు, 37 మంది ఎంపీడీఓలు జిల్లాకు చేరుకున్నారు. అయితే బదిలీపై వచ్చిన వీరిలో కొందరు సోమవారం నుంచే పోస్టింగ్‌ల కోసం పైరవీలకు తెరతీశారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే పనిలో తలమునకలవుతున్నారు.
నేతల అనుయాయులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు మీ సామాజిక వర్గానికి చెందిన వాడినని.. చెప్పినట్లు నడుచుకుంటానని నమ్మబలుకుతున్నారు. వారి సిఫారసు లేఖలతో జిల్లా ఉన్నతాధికారులను కలిసేందుకు యత్నిస్తున్నారు. దీంతో బదిలీల వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నడూ లేనంతగా పరిపాలన శూన్యత చోటు చేసుకుంది. ఎన్నికల ఫలితాలు వెలువడి పక్షం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాని పరిస్థితి. మరో ఐదు రోజులు గడిస్తే కానీ పాలకులు కొలువుదీరే అవకాశం లేకపోవడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బదిలీలపై దృష్టి సారించారు.
ఈ నేపథ్యంలో తహశీల్దార్లకు స్థానాల కేటాయింపు పారదర్శకంగా చేపట్టడం ప్రశ్నార్థకమవుతోంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయనందున వీరి సిఫార్సులను ఏ మేరకు అధికారులు పాటిస్తారనేది వేచిచూడాలి. ప్రధానంగా తహశీల్దార్ల బదిలీల్లో ప్రతిసారీ రాజకీయ జోక్యం మితిమీరుతోంది. ఈ విషయంలో ఉన్నతాధికారుల స్వేచ్ఛను నేతలు కాలరాస్తున్నారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో పాలన కూడా సక్రమంగా సాగడం లేదనే విమర్శలు తరచూ వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తహశీల్దార్ల బదిలీలు ఎలాంటి కోణాలను ఆవిష్కరిస్తాయోననే చర్చ జరుగుతోంది.
కర్నూలుపై మక్కువ
కొందరు తహశీల్దార్లకు కర్నూలు డివిజన్ అంటే మక్కువ. అత్యధిక కాలం ఇక్కడ పనిచేసిన అధికారులు ఎన్నికల వేళ జిల్లాను వీడక తప్పని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాకు చేరిన వీరు తిరిగి పూర్వ స్థానాలను కైవసం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఆదోని డివిజన్‌లోనూ పైరవీలకు తెరలేచింది. ఇక్కడ సామాజిక కోణం ఆధారంగా పలువురు తహశీల్దార్లు ఒకే చోట తిష్ట వేశారు. ఇకపోతే ఆదాయ వనరులు.. ఇసుక.. మైనింగ్ తదితరాలను దృష్టిలో ఉంచుకొని కూడా కొందరు అధికారులు ఆయా ప్రాంతాల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం గమనార్హం.
పైరవీల జోరు!
Published Tue, Jun 3 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement