ఎమ్మెల్యేలను కిరణ్, బొత్స మోసగించారు
- విభజన సమాచారం వారికి ముందే తెలుసు
- కాంగ్రెస్‌ను సీమాంధ్ర ప్రజలు క్షమించరు
- పార్టీకి రాజీనామా చేస్తా... ఎమ్మెల్యేగా కొనసాగుతా..
- తిరువూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పద్మజ్యోతి
తిరువూరు, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు రాష్ట్ర విభజనపై ముందుగానే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలకు తెలియజేయకుండా మోసగించారని తిరువూరు ఎమ్మెల్యే దిరిశం పద్మజ్యోతి అన్నారు. రాష్ట్ర విభజనను కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా చేసిందని ఆమె విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా తిరువూరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
సీమాంధ్ర ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజలు క్షమించరని చెప్పారు. విభజన తీరుకు నిరసనగా పార్టీ సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేసినప్పటికీ తాను మాత్రం చివరివరకు ఎమ్మెల్యేగా కొనసాగుతానని స్పష్టం చేశారు. గతంలో సీడబ్ల్యూసీలో రాష్ట్ర విభజనకు ఆమోదం తెలిపినప్పుడే రాజీనామా చేద్దామని తనతో సహా పలువురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కోరినప్పటికీ వారు ఉదాసీనంగా వ్యవహరించారని ఆమె ఆరోపించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, కాంగ్రెస్‌ను వీడిన తదుపరి రాజకీయాల్లో కొనసాగాలా, వద్దా, ఏ పార్టీలో చేరాలనే విషయాలను నిర్ణయించుకుంటానని ఆమె వివరించారు.