కొల్లేరుకు కొత్త అందాలు! | Kolleru new beauty! | Sakshi
Sakshi News home page

కొల్లేరుకు కొత్త అందాలు!

Published Tue, Aug 26 2014 2:34 AM | Last Updated on Thu, Oct 4 2018 7:50 PM

కొల్లేరుకు కొత్త అందాలు! - Sakshi

కొల్లేరుకు కొత్త అందాలు!

  •  రాష్ట్ర విభజనతో కొల్లేరుకు పెరిగిన ప్రాధాన్యం
  •   పర్యాటక రంగ అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం  
  •   ఆటపాక పక్షుల కేంద్రానికి ఆధునిక హంగులు
  • కైకలూరు : ప్రకృతి రమణీయతకు మారుపేరైన కొల్లేరు తీరం సరికొత్త అందాలను సంతరించుకోనుంది. విదేశీ పక్షుల సందడితో పర్యాటకులకు కనువిందు చేసే ఆటపాకలో ఆధునిక వసతులు కొలువుదీరనున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.

    మరోవైపు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీదుగా పర్యాటక రూట్ మ్యాప్‌కు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. కొల్లేరు మత్స్య సంపద ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఇందుకోసమైనా కొల్లేరు ప్రాంతంలో వసతులు మెరుగుపరిచే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్ర బడ్జెట్‌లో అటవీ, పర్యావరణ అభివృద్ధికి ప్రభుత్వం రూ.418 కోట్లు కేటాయించింది. ఈ నిధుల్లో కొంత అయినా ఖర్చు చేసి కొల్లేరు ఆభయారణ్యంలో వసతులు కల్పించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
     
    కొల్లేరు తీరం ఇలా...

    కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 77,125 ఎకరాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉన్నట్లు నిర్ధారించారు. కైకలూరు, మండవల్లి మండలాల్లో 14 గ్రామాలు కొల్లేరు పరిధిలో ఉన్నాయి. అరుదైన పక్షులను తిలకించేందుకు పశ్చిమగోదావరి జిల్లాలో గుడివాకలంక, మొండికోడు, కృష్ణా జిల్లాలో ఆటపాక, మణుగునూరులంక గ్రామాల్లో ప్రదేశాలు ఉన్నాయి. విదేశీ పక్షులను దగ్గర నుంచి చూసే అవకాశం మాత్రం కైకలూరు మండలం ఆటపాక పక్షుల విహార కేంద్రంలోనే ఉంది. ఈ కేంద్రం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
     
    ప్రతిపాదనలకే పరిమితం..
     
    కొల్లేరు ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చర్యలు చేపట్టారు. ఆయన కృషి మేరకు కొల్లేరు అభివృద్ధి, యాత్రికులకు సదుపాయాల కోసం రూ.950 కోట్లు అవసరమని 2009లో విస్సా అనే ప్రయివేటు సంస్థ నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు అందజేసింది.

    ఈ నిధులతో రహదారులు, రిసార్ట్‌లు, పక్షుల సంరక్షణ కేంద్రాల నిర్మాణం వంటివి ఏర్పాటు చేయాలని సూచించారు. వైఎస్ మరణానంతరం ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. మళ్లీ 2013లో కోస్తా ప్రాంత పర్యాటక అభివృద్ధికి రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అప్పటి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రకటించారు. కొండపల్లి హెరిటేజ్ పేరుతో విజయవాడలోని భవానీ ద్వీపం, గాంధీహిల్, కూచిపూడి, మొవ్వ, హంసలదీవి, పెడన కలంకారీ, కొల్లేరులో పర్యాటక అభివృధికి రూ.50 కోట్లును కేటాయిస్తున్నట్లు చిరంజీవి చెప్పారు.

    కొల్లేరుకు వచ్చే పర్యాటకులు విశ్రాంతి తీసుకోడానికి ఆలపాడు ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మించాలని భావించారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం రేవు వద్ద నుంచి ఉప్పుటేరు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్ర, ఆటపాక పక్షుల కేంద్రం నుంచి కొల్లేటి పెద్దింట్లమ్మ దేవస్థానం వరకు బోటు యాత్రకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఉప్పుటేరు వద్ద కాటేజీలు నిర్మిస్తే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల యాత్రికులకు అనుకూలంగా ఉంటుందని ప్రణాళికలు రూపొందించినా, పనులు పూర్తికాలేదు.
     
    పుణ్యక్షేత్రాలకు అనుసంధానం : బాపూజీ
     
    కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రముఖ పుణ్యక్షేత్రాలను అనుసంధానం చేస్తూ కొల్లేరు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలని భావిస్తున్నట్లు టూరిజం డీఎం బాపూజీ చెప్పారు. అదే విధంగా కొల్లేరులో బోటు షికారు, కాటేజీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లా ఆగడాలలంక వద్ద కొల్లేరు సందర్శకుల కోసం రిసార్ట్‌లు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.
     
    అటవీ పర్యావరణాన్ని అభివృద్ధి చేస్తాం : శ్రీదర్
     
    ఆటపాక పక్షుల కేంద్రం మాదిరిగా మరిన్ని విహార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉందని అటవీ శాఖ చీఫ్ కన్జర్‌వేటర్ ఆఫ్ ఫారెస్టు శ్రీధర్ చెప్పారు. విదేశీ పక్షులు విడిది కేంద్రంగా కొల్లేరు నిలిచిందని పేర్కొన్నారు. ఆటపాక పక్షుల కేంద్రంలో ఇప్పటికే పక్షుల ఆవాసల కోసం కృత్రిమ స్టాండ్లను ఏర్పాటు చేశామన్నారు. మణుగునూరులంక వద్ద మరో విహార కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు. రానున్న రోజుల్లో పక్షుల సంరక్షణ కేంద్రాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement