తొలి ప్రారంభం ఆనందం
విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయం ప్రారంభం
రాజధాని ప్రాంతంలో మరిన్ని ఆధునిక కట్టడాలు
సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి
విజయవాడ సిటీ : రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నూతన ఆంధ్రప్రదేశ్‌కు నూతన రాజధానిలో తొలి రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం రాత్రి పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో రూ.3 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక శాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ఇంకా అనేక ఆధునిక కట్టడాలు వస్తాయన్నారు. అనతి కాలంలోనే మంచి నాణ్యతా ప్రమాణాలతో అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యాలయం భవనాన్ని పూర్తిచేసిన అదనపు డీజీ నండూరి సాంబశివరావు, ఆ శాఖ అధికారులను ఆయన అభినందించారు. రాజధాని కావడంతో ప్రపంచమే ఇక్కడకు వస్తున్నందున శాంతి భద్రతలు ముఖ్యమని, ఇదే సమయంలో పౌరుల క్రమశిక్షణ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. తనకు తెలిసినంత వరకు కృష్ణా, గోదావరి జిల్లాల ప్రజలు క్రమశిక్షణకు మారుపేరన్నారు.
పోలీసులు ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలి...
పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. తక్కువ పోలీసులతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సమర్థవంతంగా వ్యవహరించాలన్నారు. అయితే పోలీసు శాఖలో ఇందుకు విరుద్ధంగా ఉందని చెప్పారు. ఎక్కువ సిబ్బంది, తక్కువ సాంకేతిక పరిజ్ఞానంతో ఉన్నారని, ఇది మారాల్సిన అవసరం ఉందని సూచించారు. రాష్ట్రంలో విపత్తుల నివారణ విభాగం, అగ్నిమాపక శాఖలను బలోపేతం చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. ప్రతి జిల్లాలోని అగ్నిమాపక శాఖకు ఆధునిక పరికరాలు అందజేసి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. రెండు గంటలు ఆలస్యంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత విపత్తు నివారణ బృందం నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం భవనాన్ని ప్రారంభించి అన్ని అంతస్తుల్లోని వివిధ కార్యాలయాలను పరిశీలించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న బందరు కాల్వలో విపత్తు నివారణ బృందం నిర్వహించిన రక్షణ విన్యాసాలను తిలకించారు.
అగ్నిమాపక శాఖ అదనపు డీజీ నండూరి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, పార్లమెంటు సభ్యుడు మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీ, బోడే ప్రసాద్, కాగిత వెంకట్రావు, గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, నన్నపనేని రాజకుమారి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనురాధ, మేయర్ కోనేరు శ్రీధర్, అగ్నిమాపక శాఖ డెరైక్టర్లు జయరాం నాయక్, మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు.