గుంటూరు, సాక్షి: బాపట్ల మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ నేత నందిగం సురేష్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై నందిగం సురేష్ భార్య బేబీ లలిత మీడియాతో మాట్లాడారు.
‘నా భర్త మీద అక్రమ కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఆయనకు ఏమైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబుదే బాధ్యత. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అంటే నా భర్తకు అభిమానం. అదే చంద్రబాబుకు నచ్చలేదు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ చేసేంత తప్పులు చేశారంటే అందులో మొదట ఉండేది చంద్ర బాబే. సింగ్ నగర్ సాక్షిగా చంద్ర బాబుని అరెస్ట్ చెయ్యాలి’ అని అన్నారు.
అర్ధరాత్రి అక్రమ అరెస్ట్
అంతకు ముందు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏపీ పోలీసులు హైదరబాద్‌లో నందిగం సురేష్‌ను అరెస్ట్ చేశారు. డీఎస్పీ మల్లికార్జున రావు నేతృత్వంలోని పోలీసుల బృందం.. సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతోపాటు అనుచరుల వద్ద ఉన్న ఫోన్లను స్వాధీనం చేసుకుని గుంటూరు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్టేషన్ గేట్లు మూసేసి
నందింగం సురేష్ తరలింపుపై సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ నేతలు మంగళగిరి రోడ్డు పోలీస్ స్టేషన్‌కు తరలివచ్చారు. సురేష్‌ని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ సురేష్‌ను కలవనీయంగా పోలీసులు స్టేషన్‌గేట్లను మూసివేశారు. గేటువద్దే వారిని అడ్డుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment