
జిల్లాకు రిక్త హస్తం
- బడ్జెట్ కేటాయింపులు అరకొర
- ఆశలు గల్లంతు
- విమ్స్‌కు రూ.10 కోట్లు
- కేజీహెచ్‌ను విస్మరించారు
రాష్ట్ర విభజన అంశం.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణం.. ఇటువంటి పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో జిల్లాకు వరాల వర్షం కురుస్తుందని అందరూ భావించారు. చివరి బడ్జెట్‌లో ప్రభుత్వం జిల్లాకు రిక్తహస్తాన్నే చూపించింది. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అధిష్టానాన్ని ధిక్కరిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్న సీఎం.. సీమాంధ్రకు చెందిన ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి ఈ బడ్జెట్‌లో జిల్లాకు పెద్ద పీట వేస్తారన్న ఆశలు నెలకొన్నాయి. అందుకు భిన్నంగా అరకొర నిధులతో చేతులు దులుపుకున్నారు.
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత ప్రధాన నగరమైన విశాఖ అభివృద్ధిని గాలికొదిలేశారు. పురోగతి సాధించని నీటి పారుదల శాఖకు కూడా నిర్వహణలకు అంచనా వ్యయాన్ని చూపించారు తప్పా.. పూర్తి స్థాయిలో అవసరమైన కేటాయింపులు చేయలేదు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లక్షా 83 వేల 129 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో జిల్లాకు సంబంధించి వివిధ ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి కేవలం రూ.30 కోట్లు వరకు మాత్రమే కేటాయించింది. ప్రతిపాదిత ప్రాజెక్టులకు కానీ, ప్రస్తుతం కొనసా..గుతున్న వాటికి కానీ ఎటువంటి నిధులను మంజూరు చేయకపోవడం గమనార్హం.
నీటి పారుదలకు అరకొర నిధులు
జిల్లాలో నీరుపారుదల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రతీ ఏటా బడ్జెట్‌లో అన్యా యం జరుగుతూనే ఉంది. కనీసం రిజర్వాయర్ల నిర్వహణకు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదు. ప్రతీ ఏటా వ రదలు కారణంగా రిజర్వాయర్లు దెబ్బతింటు న్నా.. వాటి మరమ్మతులకు పైసా కూడా ఇవ్వ డం లేదు. అధికారులు పంపించిన ప్రతిపాదనలను కూడా కనీసం పరిశీలించలేనట్లు తెలుస్తోంది. ఎన్నికల బడ్జెట్‌గా ప్రవేశపెట్టిన ఇందు లో కూడా జిల్లా నీటి పారుదల శాఖకు అరకొరగానే నిధులు కేటాయింపులు జరిగాయి.
ఆరోగ్యాన్ని మరిచారు.. : జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులకు ఈసారి కూడా మొండి చెయ్యి చూపించారు. విమ్స్‌కు మాత్రం రూ.10 కోట్లు కేటాయించారు. వాస్తవానికి విమ్స్‌కు రూ.60 కోట్లు అవసరమని రెండేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపినప్పటికీ ఇప్పటి వరకు దశల వారీగా విడుదల చేస్తూ వస్తున్నారు. దీంతో నిర్మాణ, అవసరాల ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు వైద్య సేవలందిస్తున్న కేజీహెచ్‌లో అదనపు బ్లాక్‌ల నిర్మాణం, నిర్వహణలకు ఈసారి బడ్జెట్‌లో నిధులు వస్తాయని భావించినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించారు. అదే విధంగా విక్టోరియా ఆస్పత్రి, ప్రభుత్వ ఈఎన్‌టీ, ఇతర ఆస్పత్రులకు కూడా ఎటువంటి నిధులివ్వలేదు. విమానాశ్రయానికి కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చారు.