ఆ కష్టాలు రాకూడదు
► పేద విద్యార్థుల కోసం ‘విద్యాసిరి’ని స్వయంగా రూపొందించా
► వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాదే అధికారం
► బడ్జెట్‌పై చర్చలో సుదీర్ఘంగా ప్రసంగించిన సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు : విద్యనభ్యసించే సమయంలో తాను ఎదుర్కొన్న కష్టాలు ఏ పేద విద్యార్థికీ రాకూడదనే ఉద్దేశంతో ‘విద్యాసిరి’ పథకానికి స్వయంగా రూపకల్పన చేసి అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. బుధవారం ఆయన శాసనసభలో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘నేను చదువుకునే సమయంలో మైసూరులో ఓ గది అద్దెకు తీసుకొని ఇంకో మిత్రుడితో కలిసి ఉండేవాడిని. బయట భోజనం చేసేందుకు డబ్బులు సరిపోక మేమే వంట చేసుకునే వాళ్లం. నా స్నేహితుడు వంట చేస్తే నేను పాత్రలు తోమే వాడిని. అప్పట్లో మా ఇంట్లో ఎనిమిది గేదెలు ఉండేవి. వాటి పోషణ ద్వారా వచ్చే డబ్బును కుటుంబ అవసరాలకు ఉపయోగించే వాళ్లం. సెలవుల్లో నేను కూడా గేదెలు కాసేందుకు వెళ్లేవాడిని’ అని చెప్పారు.
తాను విద్యనభ్యసించే సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇప్పటి తరం పేద విద్యార్థులు ఎదురుకాకుండా ఉండాలనే లక్ష్యంతోనే విద్యార్థులకు ఉపయుక్తమైన ‘విద్యాసిరి’ కార్యక్రమాన్ని రూపొందించామని పేర్కొన్నారు. విద్యాసిరి పధకంలో భాగంగా వెనకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,500 విద్యార్థి వేతనాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. హాస్టల్స్‌లో సీటు లభించని విద్యార్థులకు భోజనానికి ఇబ్బంది కాకుండా ఈ పథకాన్ని రూపొందించినట్లు సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మాదే అధికారం......
ఇక బడ్జెట్‌పై చర్చకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగిస్తూ రాష్ట్ర జిఎస్‌డీపీ పెరగడంపై మాట్లాడుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు సి.టి.రవి, బసవరాజ బొమ్మాయ్ ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. ‘గతంలో రాష్ట్రంలో ఉన్న స్థిరమైన ధరలను బట్టి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రాడక్ట్ (జిఎస్‌డీపీ)ని లెక్కగట్టేవారు. అయితే ప్రస్తుతం మార్కెట్ ధరలను బట్టి జీఎస్‌డీపీని లెక్కగడుతున్నారు. అందువల్ల రాష్ట్ర జీఎస్‌డీపీ పెరిగినట్లు కనిపిస్తోంది. అంతేతప్ప ఇందులో మీ ప్రభుత్వం సాధించిందేమీ లేదు’ అని విమర్శించారు. ముఖ్యమంత్రి కలగజేసుకొని ‘మీరు చాలా తెలివైన వారు, మీ ముందు మేమెంత’ అంటూ చమత్కరించారు.
ఈ సందర్భంలో బసవరాజ బొమ్మాయ్ కలగజేసుకొని ‘మీరు అలా అనకండి, మీరు లాయర్ కావడంతో పాటు చాలా తెలివైన వారు కాబట్టే కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను వెనక్కు నెట్టి జేడీఎస్ నుంచి వచ్చి సీఎం స్థానంలో కూర్చున్నారు’ అని అన్నారు. వెంటనే సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ....‘ప్రజల ఆశీర్వాదాలు మాకు తోడుగా ఉన్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ సైతం నాకు తోడుగా ఉంది. అందువల్లే ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాను. 2018లో సైతం మా పార్టీనే అధికారంలోకి వస్తుంది. బీజేపీ నేతలు మరోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందే’ అని జోష్యం చెప్పారు.