మంత్రి పదవుల కోసం పెరుగుతున్న డిమాండ్
సాక్షి, బెంగళూరు: మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణకు పట్టుబడుతున్న అధికార పక్ష ఎమ్మెల్యేల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ద్వారా కొత్త వారికి అవకాశం కల్పించాలని చాలా మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పదవిని ఆశిస్తున్న ఆశావహులంతా ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నారు. బడ్జెట్ సమావేశాలు పూర్తై అనంతరం ఏప్రిల్‌లో వీరు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై మూడేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో పార్టీ కోసం పనిచేస్తున్న మరికొంత మంది ఎమ్మెల్యేలకు సైతం మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని, పనితీరు సరిగ్గా లేని మంత్రులను పదవుల నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. వారిని
అలాగే కొనసాగనిస్తే 2018లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు రేస్‌లో వెనకబడిపోతుందనేది వీరి వాదన. అందువల్ల ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిని ఆయా పదవుల నుంచి తప్పించి, వారికి పార్టీలో పదవులు ఇప్పించాలని ఆశావహ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషి చేసినట్లు అవుతుందనేది వీరంతా అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే సందర్భంలో కొత్త వారికి మంత్రి పదవులు కల్పించడం ద్వారా కూడా ప్రభుత్వ పనితీరు మరింత మెరుగుపడేందుకు అవకాశం ఏర్పడుతుందని, ఇది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలీసులకు కలిసొస్తుందనేది వీరి వాదన.
ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం గత కొంత కాలంగా బడ్జెట్ సమావేశాల అనంతరం మంత్రి వర్గ పునఃనిర్మాణాన్ని చేపడతామని చెబుతూ వస్తున్నారు. అయితే ఇందుకు ఇంకా కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తుందా, లేదా అన్న అనుమానాలు సైతం ఆశావహ ఎమ్మెల్యేల్లో నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో స్వయంగా తామే వెళ్లి పార్టీ హైకమాండ్ నేతలను కలిసి మంత్రి వర్గ పునఃనిర్మాణంపై ఆలోచించాల్సిందిగా కోరనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
హస్తినకు పోయిరావలె!
Published Sun, Mar 27 2016 3:44 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement