ఇద్దరు సీఎంల సయోధ్య అధికారులకు చేరింది
ఇక ఏ ప్రాంతం ఉద్యోగులు ఆ ప్రాంతంలోనే పనిచేస్తారు
ఇరు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు
22న అఖిల భారత సర్వీసు అధికారుల తాత్కాలిక జాబితా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాలకు రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీ మార్గదర్శకాలపై ఉత్కంఠకు తెరపడింది. ఇటీవల గవర్నర్ నర్సింహన్ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కుదిరిన సయోధ్యలో భాగంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కమలనాథన్ కమిటీ రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి సంబంధించి రూపొందించిన మార్గదర్శకాలకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.
దీని ద్వారా స్థానికత ఆధారంగా ఏ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్రంలో పనిచేయడానికి వీలుకలుగుతుంది. ఏ రాష్ట్రంలోనైనా సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసుకోవడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించినట్లైంది. దీంతో ప్రధానమైన రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల పంపిణీకి మార్గం సుగమం అయింది. ఇక మార్గదర్శకాలను ఢిల్లీకి పంపించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందడమే మిగిలింది. కేంద్రం ఆమోదించగానే అందుకు అనుగుణంగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇలా ఉండగా ఈ నెల 22వ తేదీన అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల పంపిణీ తాత్కాలిక జాబితా కూడా ప్రకటించేందుకు ప్రత్యూష్‌సిన్హా కమిటీ రంగం సిద్ధం చేసింది. 22వ తేదీన ప్రత్యూష్‌సిన్హా కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు హాజరు కానున్నారు. ఇలా ఉండగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కాళింగులను బీసీల జాబితా నుంచి ఓసీల జాబితాలోకి తీసుకువస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోరిక మేరకు తిరిగి బీసీల జాబితాలోకి కాళింగులను చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అంగీకరించారు.
మార్గదర్శకాలకు ఆమోదం
Published Thu, Aug 21 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement
Advertisement